
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)చట్టం–2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా దాఖలు చేసిన 10 వరకు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుందని సుప్రీంకోర్టు వెబ్‌సైట్ పేర్కొంది. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారు. ఒవైసీతోపాటు ఆప్ నేత అమానతుల్లా ఖాన్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అర్షద్ మదానీ, సమస్త కేరళ జమియతుల్ ఉలెమా, అంజుమ్ కదారి, తయ్యబ్ ఖాన్ సల్మానీ, మహ్మద్ షఫీ, మహ్మద్ ఫజలుర్రహీమ్, ఆర్‌జేడీ నేత మనోజ్ కుమార్ ఝా పిటిషన్లు వేశారు.
ఈ చట్టంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా ముందుగా తమ వాదనను వినాలంటూ ఈ నెల 8న కేంద్రం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేయడం తెల్సిందే. పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముర్ము సంతకం చేయడంతో వక్ఫ్(సవరణ) చట్టం–2025ను గురువారం నోటిఫై చేసింది. తీవ్ర వ్యతిరేకత నడుమ పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టంతో తమిళనాడులోని 50 లక్షల మందితోపాటు దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింల హక్కులకు భంగం వాటిల్లనుందని పిటిషనర్లలో ఒకటైన డీఎంకే అంటోంది. ఈ చట్టంలోని అంశాలు ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులకు భంగకరంగా ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్‌బీ) అంటోంది.