
దేశ వ్యాప్తంగా కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలు
రబీ సీజన్‌లో పలు పంటలకు మద్దతు ధర పెంపు
కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన ర్లకు కేంద్రంలోని మోదీ సర్కారు విజయదశమిని పురస్కరించుకుని కీలక ప్రకటనలు చేసింది. వారికి ప్రతినెలా చెల్లించే కరువు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ మీడియా సెంటర్‌లో కేంద్ర కేబినెట్ నిర్ణయాలను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే, పింఛన్లపై చెల్లిస్తున్న డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరగనుంది. ఈ ఏడాది జూలై 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల డీఏ బకాయిలను అక్టోబర్ వేతనాలతో దీపావళి కంటే ముందే అందిస్తాం. ఈ నిర్ణయంతో దేశంలోని 49.2 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.7 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. డీఏ పెంపు వల్ల కేంద్రంపై ఏటా అదనంగా రూ.10,083 కోట్ల భారం పడుతుంది. 8వ వేతన సంఘం సిఫారసులు 2026 జనవరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది’అని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలకు చెరో నాలుగు
దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయా(కేవీ)లను స్థాపించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కేవీల నిర్మాణానికి రూ.5,863 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు కేంద్రీయ విద్యాలయాలు లేని జిల్లాలు, అభివృద్ధి చెందాల్సిన జిల్లాలు, మావోయిస్టు ప్రభావిత జిల్లాలు, కొండ పాలిత రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయన్నారు. కేంద్రం కేటాయించిన కేవీల్లో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు, ఏపీకి నాలుగు ఉన్నాయని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు చెప్పారు.
పంటలకు మద్దతు ధర పెంపు
పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం రైతులకు ఊరట కల్పించింది. రబీ పంటల ఉత్పత్తి అంచనా 297 లక్షల టన్నులు కాగా, వీటికి మద్దతు ధర కోసం రూ.84,263 కోట్లు కేటాయించింది. గోధుమ పంట కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని రూ.160 పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీంతో, 2026–27లో గోధుమల ఎంఎస్‌పీ క్వింటాలుకు రూ.2,585కు చేరుకోనుంది. దేశీయ ఉత్పత్తి పెంపు, రైతుల ఆదాయం పెంపునకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. బార్లీ ఎంఎస్‌పీ రూ.170 పెంపుతో క్వింటాలు రూ.2,150, అదేవిధంగా, శనగపప్పు రూ.5,875, ఎర్ర పప్పు(మసూరి) రూ.7,000, ఆవాలు రూ.6,200, కుసుమపువ్వు రూ. 6,540 చొప్పున కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఎంఎస్‌పీ అత్యధికంగా కుసుమలకు క్వింటాలుకు రూ.600 మేర పెంచింది.
వందేమాతరం 150 ఏళ్ల వేడుక
జాతీయ గీతం వందేమాతరంనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతాన్ని జాతీయ గీతంగా రాజ్యాంగ సభ గుర్తించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ గీతం ప్రముఖ పాత్ర పోషించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి యువతకు ఆసక్తి కలిగించేలా కార్యక్రమాలుంటాయన్నారు. వీటితోపాటు బయో మెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం ఫేజ్–3కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
