వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్
ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపాటు
అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ప్రశ్న
బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపై మీడియా సంస్థలపైనా ఫైర్
ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్ నమోదుపైనా ఆగ్రహం
ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టిన కోర్టు
ఈనెల 22 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశం
మెడికల్ కాలేజీలో భద్రత కోసం.. 10 మందితో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
సభ్యుల్లో హైదరాబాద్ ఏఐజీ వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు
న్యూఢిల్లీ,సాక్షి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది.
డాక్టర్ హత్యాచారం కేసు నమోదులో జాప్యంపై కోర్టు ఆగ్రహించింది. మృతదేహానికి ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయ. మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రిన్సిపాల్ చిత్రీకరించారు. దుండగులను కట్టడి చేయటంతో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వేచిచూసేలా చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఆయన్ను తొలిగించి, మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
డాక్టర్ల రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్..
డాక్టర్ల రక్షణకు పది మంది ప్రముఖ డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. అదేవిధంగా అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలి. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలి. మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో పూర్తి నివేదికను సమర్పించాలని జాతీయ టాస్క్ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఈనెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దు
హత్యాచార ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేవారిపై అధికారం చెలాయించవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సీజేఐ ఆదేశించారు. డాక్టర్లు, విద్యార్థులు, పౌరసమాజాన్ని అడ్డుకోవద్దని సూచించారు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన తర్వాత.. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఆందోళనకారుల పేరిట కొందరు భౌతిక దాడులకు దిగారు. పోలీసుల రక్షణ కల్పించినప్పటికీ.. వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే వాళ్ల ఆవేదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఓ యువలాయర్. ప్రొటెక్ట్ ది వారియర్స్ తరఫున అపరాజిత అనే న్యాయవాది ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఓ సీల్డ్ కవర్‌లో ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆమె అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సీజేఐ .. ఆస్పత్రిలో పరిస్థితి తీవ్రంగానే ఉందన్న అభిప్రాయంతో ఏకీభవించారు.
కేసు వివరాలు..
ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేట్టిన కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది.
ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ను కొద్దిరోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఆయనపై సీబీఐ పలు ప్రశ్నల సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ‘హాస్పిటల్‌లో చోటుచేసుకున్న మృతిని ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది?. ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు?. నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా?. క్రైమ్‌సీన్‌లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తి అయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు?. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగింది..? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించటంలో ఎందుకు ఆలస్యం చేశారు?’ అని సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment