పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ట్రైయినీ డాక్టర్ హత్యాచారం ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆసుప్రతిలోనే వైద్య విద్యార్ధినిపై లైంగిక దాడికి పాల్పడటం, ఆపై హత్య చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మరోవైపు బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.
తాజాగా ట్రైయినీ డాక్టర్ మరణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, వైద్యుల నిరసనలకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా వారి డిమాండ్లను అంగీకరించారని అన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు అసుపత్రిలోనే పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే నిందితులను ఉరితీస్తారని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును వేగంగా విచారించి, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు.
అయితే నిరసన చేస్తున్న వారికి రాష్ట్ర పరిపాలనపై నమ్మకం లేదని భావిస్తే, వారు మరేదైనా దర్యాప్తు సంస్థను సంప్రదించవచ్చని తెలిపారు. దానితో తనకు ఎలాంటి సమస్యలేదన్నారు. ఈ కేసులో సరైన, సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తూనే రోగులకు చికిత్స అందించాలని సూచించారు.
కాగా కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురైంది. శనివారం తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో శవమై కనిపించింది. అంతేగాక ఆమెను హత్య చేసే ముందు లైంగికదాడికి పాల్పడినట్లు తాజాగా పోస్టుమార్టంలో తేలింది.
బాధితురాలి ముఖం,కుడి చేయి, మెడ, ఎడమకాలు,పెదవులు వంటి శరీర భాగాల మీద గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె కళ్లు, నోటి నుంచి, ప్రేవేటు భాగాల నుంచి రక్తస్రావం జరిగినట్లు వెల్లడైంది. ఈ మేరకు పోలీసులు శనివారం వెల్లడించారు.
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోల్‌కతా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారాంగా ఈ ఘోరానికి పాల్పడిని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుడు ఆసుపత్రిలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగిగా, అతడికి హాస్పిటల్‌లోని పలు విభాగాల్లో ప్రవేశించేందుకు అనుమతి ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment