పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణంపై జూనియర్ వైద్యులు, నర్సులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేశారు.
మరోవైపు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో డాక్టర్‌పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు సంజయ్ రాయ్ అసలు ఆసుపత్రి ఉద్యోగి కాదని వెల్లడైంది. కానీ ఆసుపత్రిలోని అన్ని బిల్డింగ్‌లలో తరుచూ తిరుగుతుంటాడని తేలింది.
అతడు కోల్‌కతా పోలీసులతో కలిసి పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో కోల్‌కతా పోలీసుల డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌లో వాలంటీర్‌గా చేరాడు. తర్వాత పోలీసు సంక్షేమ విభాగానికి మారాడు. అనంతరం ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు మారాడు. అక్కడ క్యంపస్‌లోని బిల్డింగ్‌లలో అన్ని విభాగాల్లో ప్రవేశించడానికి అతడికి అనుమతి ఉంది.
ఈ క్రమంలోనే సంజయ్ రాయ్ పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అడ్మిషన్ కోసం, రోగుల బంధువులకు సైతం ప్రభుత్వాసుపత్రిలో పడక దొరక్కపోతే దగ్గర్లోని నర్సింగ్‌హోమ్‌లలో ఏర్పాటు చేసేదుకు డబ్బులు వసూలు చేసేవాడని తేలింది.
సంజయ్ అధికారిక పోలీస్ కానప్పటికీ తన పరిచయాలను ఆసరాగా చేసుకొని కొన్నిసార్లు పోలీస్ బ్యారక్‌లోనే ఉండేవాడు. కోల్ కతా పోలీస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి తిరిగేవాడు. అతని బైక్‌కు కూడా కేపీ(కోల్‌కతా పోలీస్) అనే ట్యాగ్ ఉంది. ఇతర పౌర వాలంటీర్లకు తనను తాను కోల్‌కతా పోలీస్ సిబ్బందిగా పరిచయం చేసుకునేవాడు.
ఏం జరిగింది?
కోల్‌కతాలో ఆర్‌జీ కర్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో బాధితురాలి మృతదేహం లభ్యమైంది. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడికి ఆగస్టు 23 వరకు పోలీసు కస్టడీ విధించారు.
కావాలంటే ఉరి తీయండి..
ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించాడు. అయితే అతనిలో ఏమాత్రం తప్పు చేసిన పశ్చాత్తాపం కనిపించలేదు. అంతేగాక మీకు కావాలంటే నన్ను ఉరి తీయండంటూ పోలీసులపైకి రుబాబుగా ప్రవర్తించినట్లు తెలిసింది. అతని మొబైల్ ఫోన్ నిండా అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అత్యవసర భవనంలోకి ప్రవేశించడం కెమెరాలో రికార్డయ్యింది. కొన్ని గంటల తర్వాత అదే భవనంలో వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం రాత్రి అతడి విరిగిన ఇయర్‌ఫోన్ వైద్యురాలి హత్య జరిగిన సెమినార్ రూమ్‌లో దొరికింది. అదే అతడిని పట్టించింది. ఎమర్జెన్సీ భవనంలోకి వెళ్తున్నప్పుడు బ్లూటూత్ డివైజ్ అతని మెడలో ఉంది. కానీ అతను బయటకు వచ్చేసరికి అది కనిపించలేదు. మృతదేహం పక్కన ఉన్న హెడ్‌సెట్ కూడా అతని ఫోన్‌తో పెయిర్ చేసి ఉంది.
మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసి తర్వాత నిందితుడు తాపీగా గదికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయినట్లు తేలింది. తెల్లారిన తర్వాత తన దుస్తులపై రక్తపు మరకలను శుభ్రం చేసుకున్నట్లు తెలిసింది, అయితే అతని షూస్‌కు అంటిన రక్తపు మరకల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. .అయిత ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. సంజయ్ రాయ్‌కు ఇదివరకే నాలుగు పెళ్లిళ్లు అవ్వగా.. ముగ్గురు భార్యలు అతడిని వదిలి వెళ్లిపోగా. నాలుగో భార్య గత ఏడాది మరణించింది.
ఎవరీ పోలీస్ పౌర వాలంటీర్లు
ఈ వాలంటీర్లు ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు ప్రతిస్పందనతో సహా వివిధ పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి నియమించినన కాంట్రాక్టు సిబ్బంది. నెలకు దాదాపు రూ.12,000 చెల్లిస్తుంటారు. అయితే ఈ వాలంటీర్లకు సాధారణ పోలీసు సిబ్బందికి ఉండే సౌకర్యాలేవి ఉండవు
Comments
Please login to add a commentAdd a comment