న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.
పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు.
ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి.
గవర్నర్ అత్యవసర సమావేశం
వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
సీబీఐ దర్యాప్తు ముమ్మరం
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్‌జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్‌ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్‌కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.
సుప్రీం విచారణ
మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్‌జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు.
Comments
Please login to add a commentAdd a comment