
ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్
ఇకపై మన దేశ అధికారిక విధానమిదే
పాకిస్తాన్ దుశ్చర్యలన్నింటికీ ఇలాగే బదులిస్తాం
ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్‌ను ఇక వేరుగా చూడబోం
పాక్ సైన్యం, ప్రభుత్వమే ఉగ్రవాద పోషకులు
ఎప్పటికైనా ఆ భూతానికే బలవుతుంది
ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఒకే ఒరలో ఇమడవు
నీళ్లు, రక్తమూ ఎన్నటికీ కలిసి ప్రవహించలేవు
ఉగ్రవాదులు మన మహిళల సిందూరం తుడిచేశారు
ఉగ్రమూలాలతో పాటు వారి స్థైర్యాన్నీ పెకిలించేశాం
9/11 వంటి ఉగ్ర దాడుల కేంద్రాలు భస్మీపటలం
దాంతో పాక్ నాయకత్వం బిక్కచచ్చిపోయింది
చేతులు కలపాల్సింది పోయి మనపైనే దాడి
దాయాదికి కనీవినీ ఎరగని రీతిలో బుద్ధి చెప్పాం
కలలో కూడా ఊహించని నష్టాలు చవిచూపాం
దిక్కుతోచక కాళ్లబేరానికొచ్చి శరణు వేడింది
ఉగ్రవాదం, సైనిక దుశ్చర్యలుండవని హామీ ఇచ్చింది
అందుకే విరమణ, సైనిక చర్యకు కేవలం విరామమే
సైనికులకు నా సెల్యూట్.. మహిళలకు సిందూర్ అంకితం
సిందూర్ తర్వాత తొలిసారి జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
పాక్ మన సరిహద్దులపై దాడులకు ప్రయత్నిస్తే
మనం ఏకంగా దాయాది గుండెలనే చీల్చిచెండాడి చూపించాం
న్యూఢిల్లీ: ‘‘ఉగ్రవాద చర్యలకు ఇకపై ఆపరేషన్ సిందూర్‌తోనే బదులిస్తాం. ఇదే భారత ప్రభుత్వ నీతి. ఇదే మన నూతన విధానం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ‘‘దాయాది అణు బెదిరింపులకు దిగితే సహించే ప్రసక్తే లేదు. అంతేకాదు, ఉగ్రవాదాన్నీ, దానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న పాక్ ప్రభుత్వాన్నీ ఇకనుంచి వేర్వేరుగా చూడబోం. పాక్ చర్యలన్నింటినీ ఇకపై ‘సిందూర్’ గీటురాయితోనే పరిశీలిస్తాం. మనపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడ్డా ‘సిందూర్’ తరహాలో ఆ దేశంపై నిర్ణాయక రీతిలో దాడులు చేస్తాం.
జన్మలో మర్చిపోలేని రీతిలో గుణపాఠం నేర్పుతాం’’ అని కుండబద్దలు కొట్టారు. పాక్ ‘అణు’ ఆటలు మనముందు సాగవని ఆ దేశ సైనిక స్థావరాలపై జరిపిన దాడులతో ప్రపంచానికి ఇప్పటికే నిరూపించామన్నారు. ‘‘కశ్మీర్ మంచుకొండల నుంచి రాజస్తాన్ ఎడారుల దాకా పాక్ దాడులన్నింటినీ తిప్పికొట్టాం. కేవలం మన సరిహద్దులపై దాడికి ప్రయత్నించినందుకే దాయాది ఆయువుపట్లను తూట్లు చేశాం. అది గొప్పగా చెప్పుకునే వైమానిక స్థావరాలన్నింటినీ పూర్తిగా నేలమట్టం చేసి కాళ్లబేరానికి తీసుకొచ్చాం.
భారత్‌తో యుద్ధానికి దిగిన ప్రతిసారీ పాక్‌ను మట్టి కరిపించాం’’ అని గుర్తు చేశారు. ఆ విజయ పరంపరలో ఆపరేషన్ సిందూర్‌ను కలికితురాయిగా అభివర్ణించారు. పాక్ ప్రభుత్వం, సైన్యం కలసికట్టుగా దశాబ్దాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాద భూతం చివరికి ఆ దేశాన్నే కబళిస్తుందని మోదీ హెచ్చరించారు. ‘‘ఆ దేశం మనుగడ సాగించాలంటే ఉగ్రవాదాన్ని దాని గడ్డపై నుంచి కూకటివేళ్లతో పెకిలించాల్సిందే. దానికి మరో మార్గం లేదు’’ అంటూ హితవు పలికారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారిగా సోమవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. పాక్‌పై మన సైనిక విజయాన్ని దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కూతురికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
సిందూర్... దేశ భావనకు ప్రతిరూపం
‘‘సిందూరం కేవలం పేరు కాదు. సరైన న్యాయానికి అఖండ ప్రతిజ్ఞ. కోట్లాది భారతీయుల భావనలకు ప్రతిరూపం. ఉగ్రవాదం తాలూకు వికృత రూపమే పహల్గాం దాడి! అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి నన్నెంతగానో కలచివేసింది. భార్యాపిల్లల కళ్లముందే ఒక్కొక్కరిని కాల్చి పొట్టన పెట్టుకున్న వికృతత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. అందుకు ప్రతీకారం కోసం దేశమంతా ఒక్కటైంది. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. వారు కలలో కూడా ఊహించని విధంగా పాక్, పీఓకేలోని బహావల్‌పూర్, మురిద్కే తదితర ఉగ్రవాద కేంద్రాలు, శిక్షణ శిబిరాలపై మన సైన్యం విరుచుకుపడి నేలమట్టం చేసింది.
అవన్నీ నిజానికి ప్రపంచ ఉగ్రవాద యూనివర్సిటీలు. అమెరికాపై 9/11, లండన్ మెట్రో తదితర దాడులన్నింటికీ అక్కడినుంచే పథకరచన జరిగింది. అలాంటి కేంద్రాలతో పాటు ఉగ్రవాదుల స్థైర్యాన్ని కూడా మన ధ్వంసం చేసింది. దశాబ్దాలుగా పాక్ గడ్డపై బాహాటంగా రొమ్ములు విరుచుకుని సంచరిస్తున్న 100 మందికి పైగా అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చింది. మన మహిళల నుదుటి సిందూరం తుడిపేస్తే ఏమవుతుందో ప్రతి ఉగ్ర ముఠాకూ తెలిసొచ్చేలా చేశాం. ఉగ్రతండాలనే సమూలంగా తుడిచిపెట్టేశాం.
కాల్పులకు కేవలం విరామమే
ఉగ్ర కేంద్రాలపై మన దాడితో పాక్ బిక్కచచ్చిపోయింది. మన దాడుల్లో హతమైన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. వాటిలో పాక్ సైనిక ఉన్నతాధికారులు బాహాటంగా పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారనేందుకు ఇది తిరుగులేని రుజువు. తన గడ్డ మీది ఉగ్ర శిబిరాలు తుడిచిపెట్టుకుపోయాయనే నిరాశతో పాక్ దుస్సాహసానికి దిగింది. ఉగ్ర పోరులో మనతో కలిసి రావాల్సింది పోయి మనపైనే దాడులకు తెగబడింది. విచక్షణ కోల్పోయి మన సైనిక స్థావరాలతో పాటు విద్యా సంస్థలు, ప్రార్థనాలయాలు, ఇళ్లను కూడా లక్ష్యం చేసుకుంది.

కానీ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. పాక్ డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడివక్కడ నేలకూల్చింది. మనం అంతటితో ఆగలేదు. వాళ్లు సరిహద్దులపై దాడి చేస్తే నేరుగా పాక్ గుండెకాయకే గురిపెట్టాం. ప్రధాన నగరాల్లోని వాళ్ల కీలక సైనిక, వైమానిక స్థావరాలన్నింటినీ నేలమట్టం చేశాం. పాక్ సైన్యానికి ఊహించలేనంత నష్టం మిగిల్చాం. ఆ క్రమంలో మన బలగాలు అంతులేని సామర్థ్యాన్ని, సంయమనాన్ని ఏకకాలంలో అద్భుత రీతిలో ప్రదర్శించాయి. మన దేశీయ ఆయుధ వ్యవస్థ తాలూకు పాటవాన్ని పూర్తిస్థాయిలో రుచిచూపాయి.
దాంతో బెంబేలెత్తిపోయి దాయాది కాళ్లబేరానికొచ్చింది. ఎలాగోలా పరువు కాపాడుకునే ప్రయత్నాలకు దిగింది. కాపాడండంటూ ప్రపంచ దేశాలను వేడుకుంది. మే 10న మన పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓకు కాల్ చేశారు. ‘‘ఇకపై మా గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ, సైనిక దుస్సాహాసాలూ జరగబోవు’’ అని స్పష్టంగా హామీ ఇచ్చారు. అప్పటికే పాక్ గుండెలపై పుట్టుకొచ్చిన ఉగ్ర తండాలన్నింటినీ మనం నేలమట్టం చేయడమే గాక దాని పీచమణచాం. కనుక వారి అభ్యర్థనపై ఆలోచించాం. అయినా కాల్పులకు కేవలం విరామం మాత్రమే ఇచ్చాం. ఎలాంటి కవి్వంపులకు దిగినా పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు మన సైన్యం, వైమానిక, నావికా దళాలు, బీఎస్‌ఎఫ్ సర్వ సన్నద్ధంగా ఉన్నాయి.
ఐక్యతే మన శక్తి
ఉగ్రవాదాన్ని ఇకముందు ఏమాత్రమూ సహించేది లేదు. మన ఐక్యతే దానికి మరణశాసనం. అదే మన అతిపెద్ద శక్తి. ఇది యుద్ధాల యుగం కాదు. నిజమే. కానీ ఉగ్రవాద యుగం కూడా కాదని ప్రపంచమంతా ఒక్కతాటిపైకి వచ్చి స్పష్టమైన సందేశమివ్వాలి. 21వ శతాబ్దపు అధునాతన యుద్ధ రీతులతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే మెరుగైన సమాజానికి బాటలు పరిచిన వాళ్లమవుతాం.’’
పీఓకేను అప్పగించాల్సిందే
ఏ చర్చలైనా ఆ అంశంపైనే
ఉగ్రవాదంపై భారత వైఖరి సుస్పష్టమని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాదం, వాణిజ్యం, చర్చలు ఏకకాలంలో కొనసాగలేవు. నీళ్లు, రక్తం కలసికట్టుగా పారడం జరగని పని’’ అని స్పష్టం చేశారు. తద్వారా ఉగ్రవాదానికి పాక్ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేదాకా ఆ దేశంపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు, సింధూ జలాల ఒప్పందం నిలిపివేత తదితర చర్యలు కొనసాగుతాయని చెప్పకనే చెప్పారు. ‘‘ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించి తీరాల్సిందే. పాక్‌తో ఏ చర్చలైనా కేవలం ఈ రెండు అంశాలపైనే జరుగుతాయి. పాక్‌తో పాటు ప్రపంచ దేశాలకు కూడా ఈ విషయం స్పష్టం చేస్తున్నా’’ అంటూ ప్రధాని కుండబద్దలు కొట్టారు.
శక్తితోనే శాంతి
‘‘నేను బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి బుద్ధుడు చూపిన శాంతిమార్గం కూడా శక్తి గుండానే సాగుతుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘ప్రతి భారతీయుడూ శాంతియుతంగా జీవించాలి. వికసిత భారత స్వప్నం సాకారం కావాలి. అందుకు భారత్ శక్తిమంతమైన దేశంగా మారడం తప్పనిసరి. ఆ శక్తిని అవసరమైనప్పుడు ప్రదర్శించి చూపాలి. గత కొద్ది రోజులుగా మనం చేసింది సరిగ్గా అదే. ఆ యజ్ఞంలో భాగస్వాములైన సైనిక బలగాలకు, నిఘా వర్గాలకు, శాస్త్రవేత్తలకు అందరికీ ప్రతి భారతీయుని తరఫునా నా సెల్యూట్.