చూపింది శాంపిలే | DGNO issues fierce warning to Pakistan | Sakshi

చూపింది శాంపిలే

May 13 2025 5:23 AM | Updated on May 13 2025 5:23 AM

DGNO issues fierce warning to Pakistan

మరో యుద్ధమే వస్తే ఆ కథే వేరు

పాక్‌కు సైన్యం తీవ్ర హెచ్చరికలు

ఉగ్రవాదులకు దన్నుగా పాక్‌ సైన్యం

మర్చిపోలేని గుణపాఠం నేర్పాం

కరాచీ ఎయిర్‌బేస్‌నూ ధ్వంసం చేశాం

కూల్చేసిన జెట్లలో పాక్‌ మిరాజ్‌ కూడా

దేశీయ ఎయిర్‌ డిఫెన్స్‌ దుమ్మురేపింది

వెల్లడించిన సైనిక ఆపరేషన్స్‌ డీజీలు

న్యూఢిల్లీ: దాయాదికి మన సైన్యం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ‘‘పాక్‌ ఇప్పుడు చవిచూసిన తీవ్ర సైనిక నష్టాలు కేవలం శాంపిల్‌ మాత్రమే. మరోసారి యుద్ధమంటూ వస్తే అది పూర్తి భిన్నంగా, వాళ్లూ ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది’’ అని స్పష్టం చేసింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ (డీజీఏఓ) ఎయిర్‌ మార్షల్‌ ఏకే భారతి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ నావల్‌ ఆపరేషన్స్‌ (డీజీఎన్‌ఓ) వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్‌ ప్రమోద్‌ సోమవారం మరోసారి మీడియాతో మాట్లాడారు. 

‘‘మన సైనిక వ్యవస్థలు, స్థావరాలు నిరంతరం అప్రమత్తంగా, పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఎలాంటి ఆపరేషన్లౖMðనా క్షణాల్లో రంగంలోకి దిగిపోతాయి’’ అని ప్రకటించారు. ‘‘మనం పోరాడింది కేవలం ఉగ్రవాదులతో. కానీ వారికి దన్నుగా పాక్‌ సైన్యం రంగంలోకి దిగడం శోచనీయం. ఆ దేశాన్ని ఎవరు నియంత్రిస్తున్నారో చెప్పేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు’’ అని డీజీఏఓ భారతి అన్నారు. 

మన వైమానిక దాడుల్లో కరాచీ సమీపంలోని మరో కీలక వైమానిక స్థావరం కూడా నేలమట్టమైందని ఆయన వెల్లడించారు. అయితే పాక్‌ తన అణ్వాయుధ, అణు కమాండ్‌ వ్యవస్థలను దాచి ఉంచినట్టు చెబుతున్న కిరానా హిల్స్‌పై తాము దాడులు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు పుకార్లేనన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా కూల్చేసిన అత్యాధునిక పాక్‌ యుద్ధ విమానాల్లో ఒక మిరాజ్‌ కూడా ఉందని చెప్పారు. అనంతరం దాని తాలూకు శకలాల ఫొటోలను సైన్యం ఎక్స్‌లో షేర్‌ చేసింది.

ఆకాశ్‌.. హైలైట్‌
మనవి కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలని డీజీఎంఓ రాజీవ్, డీజీఏఓ భారతి గుర్తు చేశారు. పాక్‌ దాడులను తిప్పికొట్టడంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ హైలైట్‌గా నిలిచిందంటూ కొనియాడారు. ‘‘నిరంతరాయంగా దూసుకొచ్చిన డ్రోన్లను ఆకాశ్, కాస్‌ వంటి దేశీయ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసిన తీరు మనకు గర్వకారణం. 

దశాబ్ద కాలంగా మన రక్షణ వ్యవస్థలు సాధించిన అద్భుత ప్రగతికి నిదర్శనం’’ అని చెప్పారు. పాక్‌కు అతి కీలకమైన రహీంయార్‌ ఖాన్‌ వైమానిక స్థావరంలో జరిగిన విధ్వంసం తాలూకు వీడియో, ఫొటోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. రాజస్తాన్‌ సరిహద్దుకు సమీపంలోని ఈ స్థావరంలో ఎక్కడ చూసినా భారీ గోతులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా రన్‌వేపై అతి భారీ గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తిగా పూడ్చి సరిచేసేదాకా అక్కడ ఎలాంటి వైమానిక కార్యకలాపాలూ జరిగే అవకాశం లేదు. ఇవన్నీ మన దాడుల తాలూకు కచ్చితత్వానికి తిరుగులేని నిదర్శనాలని డీజీఏఓ భారతి చెప్పారు.

యోధుని నోట రాముని మాట
పాక్‌పై దాడులు తదితర వివరాలతో సీరియస్‌గా సాగుతున్న మీడియా భేటీలో డీజీఏఓ భారతి ఉన్నట్టుండి రామయణంలోని వారధి ఉదంతాన్ని ఉటంకించి ఆకట్టుకున్నారు. ‘‘లంకకు వెళ్లేందుకు దారివ్వాలని మర్యాదగా కోరితే సముద్రుడు మూడు రోజులైనా స్పందించలేదు. భయపెట్టనిదే పనికాదంటూ రాముడు ఆగ్రహంతో కోదండం ఎక్కుపెట్టగానే తక్షణం కాళ్లబేరానికి వచ్చాడు’’ అని చెప్పుకొచ్చారు. 

ఇందుకు సంబంధించి రామచరిత్‌ మానస్‌లోని ‘వినయ్‌ న మానత్‌ జలధి...’ పద్య పంక్తులను ఆశువుగా చెప్పి అలరించారు. ‘‘నేనేం చెప్పదలచిందీ అర్థమైందిగా! తెలివైనవాడికి కనుసైగ చాలు’’ అంటూ చమత్కరించడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు. పాక్‌ నిరంతర కవ్వింపులు మనం గట్టిగా బదులివ్వక తప్పని పరిస్థితి కల్పించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆది, సోమవారాల్లో సైనిక డీజీల మీడియా బ్రీఫింగ్‌ సందర్భంగా కూడా రాయబార ఘట్టంలో కౌరవులకు కృష్ణుని హిత వచనాలు, హెచ్చరికలకు సంబంధించిన పద్యాలు, శివతాండవ స్తోత్రం తదితరాలను నేపథ్యంలో విన్పించడం విశేషం.

ఎయిర్‌ డిఫెన్స్‌కు క్రికెట్‌పరంగా భాష్యం
మన వైమానిక స్థావరాలను, సైనిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం అత్యంత కష్టమని డీజీఎంఓ రాజీవ్‌ స్పష్టం చేశారు. పాక్‌ దాడుల వేళ మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఎంత శత్రు దుర్భేద్యంగా నిలిచిందో క్రికెట్‌ పరిభాషలో వివరించి అలరించారు. ‘‘1970ల్లో జరిగిన ఓ యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ ద్వయం జెఫ్‌ థామ్సన్, డెన్నిస్‌ లిల్లీ ఇంగ్లండ్‌కు వణుకు పుట్టించింది. అయితే జెఫ్, లేకపోతే లిల్లీ అన్నట్టుగా సిరీస్‌ పొడవునా ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలు చేశారు. ఎస్‌–400 మొదలుకుని ఆకాశ్, కాస్, ఏడీ గన్స్‌ దాకా పలు శ్రేణులతో కూడిన మన ఎయిర్‌ డిఫెన్స్‌ కూడా అంతే. వాటిలో ఏదో ఒక వ్యవస్థ పాక్‌ వైమానిక దాడులను దీటుగా అడ్డుకుని పూర్తిగా తిప్పికొట్టింది’’ అని చెప్పారు. సోమవారమే టెస్టుల నుంచి రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ కోహ్లీ తన అభిమాన క్రికెటర్‌ అని చెప్పారాయన.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement