DGMO
-
కాల్పుల విరమణకు పాకిస్తాన్ తూట్లు
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు. ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు. రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి. ఈ ఏడాదే విచ్చలవిడిగా.. సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు 2015 287 2016 271 2017 860 2018(మే చివరి నాటికి) 1252 -
భారత్, పాక్ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దుల్లో ఎప్పుడూ భీకర వాతావరణమే దర్శనమిస్తుంది. గతంలో పలుమార్లు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగినప్పటికీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా 2003లో కుదుర్చుకున్న కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని మంగళవారం ఇరు దేశాలు నిర్ణయించాయి. రెండు దేశాల మిలటరీ ఉన్నతాధికారులు హాట్‌లైన్ ద్వారా జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరుదేశాల అధికారులు కలసి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పరిస్థితులపై సమీక్ష నిర్వహించినట్టు భారత ఆర్మీ పేర్కొంది. సరిహద్దుల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు స్థానిక కమాండర్ల స్థాయిలో ఫ్లాగ్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక హాట్‌లైన్ ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పాక్ ఆర్మీ కూడా స్పష్టం చేసింది. -
మేం రెడీగా ఉన్నాం..: డీజీఎంవో
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యానికి భారత్ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి కాల్పులకు తెగబడితే మాత్రం మా భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చొరబాట్లకు పాకిస్తాన్ సైన్యం సహకరిస్తోందని.. భవిష్యత్‌లో ఇటువంటివి ఎదురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ డీజీఎంఓకు.. ఏకే భట్ స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చొరబాట్లకు సంబంధించి భారత డీజీఎంవో పాక్ అధికారులతో ఫోన్లో సంభాషించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు. పాకిస్తాన్ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్.. పాక్ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ఇండియన్ ఆర్మీలో సుశిక్షితులైన సైనికులు ఉన్నారని.. వారంతా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు భట్ స్పష్టం చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్ర రేఖ వెంబడి భారత దళాలు శాంతిగా ఉంటాయని.. అవసరమైతే మాత్రం తుపాకులు పనిచెబుతాయని.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. చెప్పారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. -
గత సర్జికల్ దాడుల రికార్డులు లేవు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వెల్లడి న్యూఢిల్లీ: 2016 సెప్టెంబర్ 29వ తేదీ కంటే ముందు చేపట్టిన సర్జికల్ దాడులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ వద్ద లేవని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్రశ్నకు డీజీఎంఓ సమాధానమిచ్చింది. ఇండియన్ ఆర్మీ రికార్డులో సర్జికల్ దాడులకు ఎలాంటి నిర్వచనం ఉందో తెలపాల్సిందిగా అతను దరఖాస్తులో కోరాడు. దీనికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమధానమిస్తూ ‘ఇంటెలిజెన్స్ సమాచారంతో నిర్దేశిత లక్ష్యంపై వేగంగా, కచ్చితమైన దాడులు చేయడాన్ని’సర్జికల్ దాడులుగా పేర్కొంది. అంతేకాకుండా భారత సైన్యం చరిత్రలో 2016 సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన సర్జికల్ దాడులే మొదటిదా లేక 2004–2014 మధ్యలో ఏమైనా సర్జికల్ దాడులు జరిగాయా తెలపాలని దరఖాస్తులో కోరాడు. ఇంటిగ్రేటేడ్ హెడ్‌క్వార్టర్స్ (ఆర్మీ)కి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును బదిలీ చేసింది. -
ప్రాంతీయ అగ్రరాజ్యంలా..
* భారత్‌పై పాక్ ఎన్ఎస్ఏ విమర్శ * తమదీ అణ్వస్త్ర దేశమేనని వ్యాఖ్య ఇస్లామాబాద్: భారత దేశం ప్రాంతీయ అగ్రరాజ్యం తరహాలో వ్యవహరిస్తోందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)సర్తాజ్ అజీజ్ ధ్వజమెత్తారు. ఉఫా ఒప్పందాన్ని అతిక్రమిస్తూ భారత్ తన ఎజెండాను రుద్దుతోందని.. దానివల్లే ఎన్ఎస్ఏ చర్చలు రద్దయ్యాయని ఆరోపించారు. డాన్ వార్తా పత్రిక సోమవారం ప్రచురించిన కథనం ప్రకారం.. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఏడాది ప్రభుత్వ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ.. భారత్‌ను ప్రాంతీయ అగ్రరాజ్యంగా పరిగణిస్తున్నారు. మోదీ సారథ్యంలోని భారత్ ప్రాంతీయ అగ్రరాజ్యంగా వ్యవహరిస్తోంది. కానీ మాదీ అణ్వస్త్ర శక్తిగల దేశమే.. మమ్మల్ని రక్షించుకోవటం ఎలాగో మాకు తెలుసు’ అని అజీజ్ అన్నారు. కశ్మీర్ అనేది ఒక అంశం కానట్లయితే.. ఆక్రమిత కశ్మీర్లో భారత్ 7 లక్షల మంది సైనికులను ఎందుకు మోహరించిందని ప్రశ్నించారు. ‘‘రెండు దేశాల మధ్య కశ్మీర్ అనేది ఒక సమస్య అని, దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సమాజం యావత్తూ విశ్వసిస్తోంది.కశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు వీలు కల్పిస్తూ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణను భారత్ నిర్వహించాలి’’ అని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై చర్చల నుంచి పాక్ పారిపోదని.. ఎందుకంటే పాక్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించటంలో భారత గూఢచర్య సంస్థ ‘రా’ ప్రమేయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆంక్షలు కొనసాగిస్తే.. చర్చలు అసాధ్యం భారత్-పాక్‌ల ఎన్ఎస్ఏ స్థాయి చర్చలు రద్దయినప్పటికీ.. సెప్టెంబర్ 5-6 తేదీల్లో జరగాల్సివున్న భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల సమావేశం షెడ్యూలు ప్రకారం జరుగుతుందని అజీజ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ అయిన హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో పాక్ నేతలు కలవకూడదని భారత్ ఆంక్షలు విధించటం కొనసాగిస్తే.. ఎటువంటి చర్చలూ సాధ్యం కాదని అని ఓ టీవీ చానల్‌తో అన్నారు. -
షరీఫ్ కొత్త పల్లవి!
భారత, పాకిస్థాన్ ప్రధానుల మధ్య చర్చలు జరిగి 20 రోజులై ంది. దానికి సంబంధించి ఇంతవరకూ పురోగతి ఏమాత్రం లేదు. ఇరుదేశాల మిలిటరీ ఆపరేషన్స్ డెరైక్టర్ జనరల్స్ (డీజీఎంఓలు) ఎప్పుడు సమావేశం కావాలన్న అంశంపై తదుపరి చర్చలు లేవు. ఈలోగా ఎప్పట్లాగే పాక్ వైపునుంచి అడపా దడపా కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 10రోజుల్లో దాదాపు 36సార్లు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల ప్రధానుల చర్చలకు చాలాముందే ఇవి మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల విరామం మినహా నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. పాకిస్థాన్ ఎన్నికలకు ముందూ, ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించాక భారత్‌తో స్నేహం గురించి నవాజ్ షరీఫ్ చాలా మాట్లాడారు. ద్వైపాక్షిక సహకారం పెంచుకుంటామని, సరిహద్దు తగాదాలకు శాంతియుత పరిష్కారం సాధనకు కృషిచేస్తామని చెప్పారు. ఈ మూడున్నర నెలల పాలనాకాలంలో మాత్రం అందుకు సంబంధించిన జాడలు కనబడనేలేదు. సరిగదా సరిహద్దుల్లో కొత్తగా ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఏర్పడింది. అందుకు సంజాయిషీ ఇవ్వాల్సిన సమయంలో షరీఫ్ ఇప్పుడు కొత్త స్వరం వినిపించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి అమెరికా మధ్యవర్తిత్వం కావాలని ఆయన కోరారు. రెండు దేశాల ప్రధానులు చాలా కాలం తర్వాత చర్చించుకున్నారని, అందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, పర్యవసానంగా స్నేహసంబంధాలు పెరగడానికి ఆస్కారం ఉన్నదని ఆశించేవారికి షరీఫ్ ఇలా అడ్డం తిరగడం ఆశ్చర్యమూ, అసంతృప్తి కలిగిస్తాయి. నిజానికి షరీఫ్ మాటలు కొత్తవేమీ కాదు. పాకిస్థాన్‌లో అధికార పీఠంపై ఉన్న ప్రతి ఒక్కరూ గత ఆరున్నర దశాబ్దాలుగా ఈ మాటలే వినిపిస్తున్నారు. సమస్యను ఎలాగైనా అంతర్జాతీయం చేసి ఏదోరకంగా తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని చూస్తున్నారు. క్రితంసారి ప్రధానిగా పనిచేసినప్పుడు కూడా షరీఫ్ ఇలాంటి మాటలే మాట్లాడారు. ఆ సంగతి ఆయనే చెబుతున్నారు. 1999లో అమెరికా పర్యటించినప్పుడు అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముందు ఇలాంటి ప్రతిపాదనే పెట్టానంటున్నారు. అమెరికా పశ్చిమాసియా సమస్యపై వెచ్చించే సమయంలో 10 శాతం కాశ్మీర్ సమస్యపై కేంద్రీకరిస్తే అది సులభంగా పరిష్కారమవుతుందని క్లింటన్‌కు ఆయన చెప్పారట. అయితే, ఇలా మూడో పక్షం జోక్యం చేసుకోవడం భారత్‌కు నచ్చదని కూడా ఆయనకు తెలుసట. ప్రధాని పదవి చేపట్టాక నవాజ్ షరీఫ్ అమెరికాలో చేస్తున్న తొలి అధికారిక పర్యటన ఇది. ఈ పర్యటనకు ముందే, లండన్‌లో ఆగిన సందర్భంలో షరీఫ్ ‘మూడో పక్షం’ జోక్యం ప్రతిపాదన చేశారు. వాస్తవానికి తాను మన్మోహన్‌తో మాట్లాడినప్పుడు ఏ నిర్ణయాలు జరిగాయో, అవి క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో చూసి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తాము అనుకున్నదానికి భిన్నంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎందుకు కొనసాగుతున్నాయో ఆరా తీయాల్సి ఉంది. కానీ, అవేమీ చేయకపోగా ఇలా పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇందువల్ల షరీఫ్ ఆశిస్తున్నదేమిటో స్పష్టమే. దీనిద్వారా ఆయన తన చేతగానితనాన్ని దాచుకోవాలని చూస్తున్నారు. దేశ ప్రధానిగా ఆ చర్చల్లో తాను ఇచ్చిన హామీలకు తన సైన్యమే తూట్లు పొడుస్తుంటే, వారిని వారించలేక ఆయన ఇలా సమస్యను పక్కదోవపట్టించాలని చూస్తున్నారు. కానీ, ఆ విషయంలో ఆయన విజయం సాధించలేకపోయారు. అమెరికా వెళ్తూ లండన్‌లో ఆగినప్పుడు షరీఫ్ ఈ ప్రతిపాదన చేయగా ఆయనింకా ఒబామాతో సమావేశం కాకుండానే అమెరికా దీన్ని చెత్తబుట్టలో వేసింది. ద్వైపాక్షిక సమస్యలపై ఆ రెండుదేశాలే చర్చించుకోవాలని, ఆ చర్చల ఉరవడి, పరిధి,స్వభావమూ ఎలా ఉండాలో అవే తేల్చుకోవాలని అమెరికా ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పటికైనా తన ప్రతిపాదనలోని తెలివితక్కువతనం ఆయనకు తెలిసిందో, లేదో?! అమెరికా జోక్యానికి షరీఫ్ కొన్ని కారణాలను చూపుతున్నారు. ఈ ఆరున్నర దశాబ్దాలుగా ఇరుదేశాలమధ్యా ఆయుధపోటీ పెరిగిందని, ఇరుపక్షాలూ పోటాపోటీగా క్షిపణులనుంచి అణ్వస్త్రాల వరకూ సమకూర్చుకున్నాయని, ఇది ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నదని షరీఫ్ అన్నారు. అంతా నిజమే. కానీ కారకులెవరు? చర్చల్లో తీసుకుంటున్న నిర్ణయాలను కాలరాస్తున్నదెవరు? తాము దృఢంగా వ్యవహరించి, తమ సైన్యం వైపుగా తప్పిదాలు జరగకుండా చూస్తే సామరస్యపూర్వక పరిష్కారం లభించడం అంత కష్టమా? కానీ, ఎప్పుడూ చర్చల దారి చర్చలది...తమ వైఖరి తమది అన్నట్టే పాకిస్థాన్ వ్యవహరిస్తున్నది. ఇప్పుడు షరీప్ తెచ్చిన ‘మూడో పక్షం జోక్యం’ ప్రతిపాదననే తీసుకుంటే...అది ఇరుదేశాల మధ్యా నాలుగు దశాబ్దాలక్రితం కుదిరిన సిమ్లా ఒప్పందానికి పూర్తి విరుద్ధం. ద్వైపాక్షిక సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకుందామని, మూడో పక్షం జోక్యాన్ని కోరవద్దని ఆ ఒప్పందంలో ఇరు దేశాలూ అంగీకరించాయి. ఇప్పుడు దాని స్ఫూర్తికి విరుద్ధంగా షరీఫ్ వ్యవహరిస్తున్నారు. పాత ఒప్పందాలపై ఖాతరులేక, తాజా చర్చల్లో తీసుకున్న నిర్ణయాలపై గౌరవంలేక తోచినట్టు మాట్లాడే ఇలాంటి ధోరణి సమస్య పరిష్కారానికి ఏమాత్రం దోహదపడదని షరీఫ్ గుర్తిస్తున్నట్టు లేరు. సరిహద్దులు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. కాల్పులు జరగని రోజంటూ లేదు. ఇప్పటికివి స్వల్ప ఘర్షణలుగా కనిపిస్తున్నా...భవిష్యత్తులో మరింత ముదురుతాయనడంలో సందేహం లేదు. ఎన్నికల సమయంలోనూ, గద్దెనెక్కిన తర్వాత తానిచ్చిన హామీలేమిటో, వాటిని అమలు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులేమిటో షరీఫ్ చిత్తశుద్ధితో ఆలోచించాలి. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటో అన్వేషించాలి. అంతేతప్ప పరిస్థితిని మరింత జటిలం చేసేలా వ్యవహరించకూడదు.