మేం రెడీగా ఉన్నాం..: డీజీఎంవో
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ సైన్యానికి భారత్ శుక్రవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరోసారి కాల్పులకు తెగబడితే మాత్రం మా భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ స్పష్టం చేశారు.
సరిహద్దుల్లో చొరబాట్లకు పాకిస్తాన్ సైన్యం సహకరిస్తోందని.. భవిష్యత్‌లో ఇటువంటివి ఎదురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ డీజీఎంఓకు.. ఏకే భట్ స్పష్టం చేసినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చొరబాట్లకు సంబంధించి భారత డీజీఎంవో పాక్ అధికారులతో ఫోన్‌లో సంభాషించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు.
పాకిస్తాన్ సీమాంతర తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో భద్రతాపరమైన సమస్యలు వస్తున్నాయని భట్.. పాక్ డీజీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ఇండియన్ ఆర్మీలో సుశిక్షితులైన సైనికులు ఉన్నారని.. వారంతా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నట్లు భట్ స్పష్టం చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
నియంత్ర రేఖ వెంబడి భారత దళాలు శాంతిగా ఉంటాయని.. అవసరమైతే మాత్రం తుపాకులు పనిచెబుతాయని.. అందులో సందేహపడాల్సిన అవసరం లేదన్నారు. చెప్పారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి.