అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న ఆర్మీ అధికారి
జమ్మూ / శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత పోస్టులు, పౌర ఆవాసాలపై ఆదివారం ఎలాంటి కవ్వింపు లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఓ పోలీస్ అధికారి సహా 14 మంది గాయపడ్డారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) గత నెల 29న అంగీకరించారు.
ఈ ఘటన జరిగి వారంరోజులు కూడా గడవకముందే పాకిస్తాన్ ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు జమ్మూలోని అఖ్‌నూర్, కనచాక్, ఖౌర్ సెక్టార్లపై మోర్టార్లు, భారీ ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమైన భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ ఏఎస్సై ఎస్.ఎన్.యాదవ్(47), కానిస్టేబుల్ వీకే పాండేలు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వీరిద్దరూ మృతిచెందారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో పాక్ వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. పాక్ మాటల్లో ఒకటి చెప్పి, చేతల్లో మరొకటి చేస్తుందని తాజా ఘటన రుజువు చేసిందని జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్‌ఎఫ్ ఐజీ రామ్ అవతార్ మండిపడ్డారు.
రక్తపాతాన్ని ఆపండి: మెహబూబా
జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపేందుకు భారత్, పాక్‌ల డీజీఎంవోలు వెంటనే మరోసారి చర్చలు జరపాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ విజ్ఞప్తి చేశారు. శ్రీనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇరుదేశాల కాల్పులతో జవాన్లు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు వేర్పాటువాదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం ముందుకు రావాలన్నారు. కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించగలమన్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో రంజాన్‌మాసంలో మిలటరీ ఆపరేషన్లు నిలిపివేసిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల్లో కశ్మీరీ యువత భారీగా చేరుతోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాదిలో కశ్మీర్ నుంచి 81 మంది యువకులు వివిధ ఉగ్ర సంస్థల్లో చేరినట్లు వెల్లడించాయి.
ఈ ఏడాదే విచ్చలవిడిగా..
సంవత్సరం పాక్ కాల్పుల ఘటనలు
2015 287
2016 271
2017 860
2018(మే చివరి నాటికి) 1252
Comments
Please login to add a commentAdd a comment