హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో సీమ హైదర్– సచిన్ మీన, ముంబైలో సంజత కుమారీ–మహేందర్ కుమార్, మధ్యప్రదేశ్‌లో నర్సుల్లా–అంజుగా మారిన ఫాతిమా.. ఇలాంటి ‘భారత్–పాక్’ ప్రేమకథే నగరంలో వెలుగు చూసింది. దుబాయ్‌లో పరిచయమై, సహజీవనం చేసిన పాతబస్తీ మహిళ కోసం ఓ పాకిస్తాన్ యువకుడు అక్రమంగా నగరానికి చేరుకుని చిక్కాడు. ఇతడిపై కేసు నమోదు చేసిన బహదూర్‌పుర పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
పాతబస్తీలోని బహదూర్‌పుర పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే వివాహితకు ఇద్దరు సంతానం. ఈమె కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఈమె పని చేసే కార్యాలయంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫయాజ్‌తో పరిచయం ఏర్పడింది. వివాహితుడైన ఇతడి కుటుంబం పాక్‌లోనే ఉండేది. వీరి మధ్య పరిచయం ప్రేమగా మారడంతో అక్కడే వివాహం చేసుకుని కలిసి జీవించారు. నగర మహిళ ఇక్కడ ఉన్న మొదటి భర్త నుంచి తలాక్ తీసుకున్న దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు.
బిహార్ మీదుగా నగరానికి ఫయాజ్..
గత ఏడాది దుబాయ్ నుంచి ఈమె నగరానికి రాగా.. ఫయాజ్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అయినప్పటికీ వీరి మధ్య సంప్రదింపులు కొనసాగడంతో ఆమె గర్భవతి అయిందనే విషయం ఫయాజ్‌కు తెలిసింది. దీంతో గతేడాది నవంబరులో హైదరాబాద్ రావడానికి సిద్ధమయ్యాడు. పాకిస్తాన్ నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్న ఫయాజ్ అక్కడ నుంచి బిహార్ మీదుగా నగరానికి అక్రమంగా వచ్చాడు.
ఆ మహిళతో కలిసి కిషన్‌బాగ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఫయాజ్ వ్యవహారం గుర్తించిన నిఘా వర్గాలు బహదూర్‌పుర పోలీసులను అప్రమత్తం చేశాయి. గురువారం ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతడి వ్యవహారంలో కుట్ర సహా మరే ఇతర కోణాలు లేవని స్పష్టం చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.
2019లోనూ ఇదే తరహా ఉదంతం..
నగరం కేంద్రంగా 2019లోనూ ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. పాకిస్థానీ అయిన షేక్ గుల్జార్ ఖాన్ దుబాయ్‌లో ఉండగా ఓ మిస్డ్‌కాల్ ద్వారా కర్నూలు జిల్లా గడివేములకు చెందిన మహిళతో పరిచయమైంది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం సౌదీ మీదుగా నకిలీ గుర్తింపు కార్డుతో భారత్‌కు చేరుకున్నాడు.
అనారోగ్యం పాలు కావడంతో మళ్లీ సొంత గడ్డపై ప్రేమ పుట్టి కుటుంబంతో సహా వెళ్లిపోవాలని భావించాడు. తన సోదరుడి సలహా మేరకు కర్తార్‌పూర్ కారిడార్ మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఇతగాడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు పట్టుకున్నారు. ఫయాజ్‌ను శుక్రవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment