
హైదరాబాద్: అధిక డబ్బులు, ఉద్యోగాల ఆశచూపింది. అందినకాడికి దండుకుంది. తేరుకున్న బాధితులు ప్రశ్నించడంతో తాను రిటైర్డ్ పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. చివరకు ఆ కిలాడీ లేడీ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే కంగుతినాల్సి వచ్చింది.
చర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి ఐజీ మింట్, గణేష్‌నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆదిలక్ష్మి ఆలియాస్ శ్రీదివ్యకాలనీలో మగ్గం వర్క్ చేసుకుంటూ కూమర్తెతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తన వద్దకు మగ్గం వర్క్ కోసం వచ్చే మహిళలను మచ్చిక చేసుకుని వారికి మాయమాటలు చెప్పి బుట్టలోకి దించింది. రూ.1000 కడితే వారంలో రూ.10వేలు ఇస్తానని, రూ.లక్ష ఇస్తే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి గంటల వ్యవధిలో రూ.20–25 వేలు అధికంగా ఇస్తానంటూ.. నమ్మబలికి సుమారు 100 మంది మహిళల వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
అనుమానం వచ్చి అడిగితే దాటవేస్తూ..
ఆమె తీరుపై అనుమానం వచ్చిన కొంతమంది తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మొండికేసింది. డబ్బుల కోసం ఒత్తిడి చేస్తే తాను రిటైర్డు పోలీసు అధికారినంటూ బెదిరింపులకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన మహిళలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువించకపోవడం గమనార్హం.
పలు కేసుల్లో నిందితురాలు..
తోటి మహిళలను బురిడీ కొట్టించి రూ.కోట్లు దండుకున్న కిలాడీ లేడిని చర్లపల్లి పోలీసులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో 2 కేసులు, మరోస్టేషన్‌లో ఇంకో కేసు ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణకు సహకరించడం లేదు..
సదరు నిందితురాలి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నా పోలీసులకు సహకరించడం లేదని, పోలీసులను కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు తెలిసింది. మేడిపల్లిలో మగ్గం మిషన్ల కొనుగోళ్లపై అవినీతికి ఆమె పాల్పడిందని, ఈ కేసులో కూడా నిందితురాలని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment