adilakshmi
-
రైతు దంపతుల ఉసురు తీసిన విద్యుత్ తీగలు
మెంటాడ: పంట పొలంలో వరి ఆకుమడి తడిపేందుకు వెళ్లి తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి రైతు దంపతులు మృత్యువాత పడిన విషాద ఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మీసాలపేటలో శుక్రవారం చోటు చేసుంది. ఉన్న కాస్త పొలాన్ని జీవనాధారంగా చేసుకున్న గ్రామానికి చెందిన రైతు దంపతులు కోరాడ ఈశ్వరరావు (54), ఆదిలక్ష్మి (48) ఒకరి వెంట ఒకరు తనువు చాలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వరరావు గ్రామ సమీపంలోని పంట పొలంలో వరి ఆకుమడి తడిపేందుకు శుక్రవారం ఉదయం వెళ్లాడు. గోపీనాథ్ పట్నాయిక్ చెరువు నుంచి ఇంజిన్‌తో నీరు తోడేందుకు పైపులు ఏర్పాటు చేసుకునే క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ భార్య ఆదిలక్ష్మి వెళ్లింది. భర్త పొలంలో పడిపోయి ఉండడాన్ని చూసి లబోదిబోమంటూ లేపే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. అక్కడికి దగ్గరలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ విషయాన్ని గమనించి పరుగున వెళ్లాడు. విద్యుత్ తీగెను పరిశీలించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతుల ఇద్దరు పిల్లల్లో కుమార్తెకు వివాహం జరగగా, కుమారుడు డిగ్రీ పూర్తిచేసి ఉన్నత చదువు ప్రవేశ పరీక్షకు రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. గజపతినగరం సీఐ ప్రభాకర్, ఆండ్ర ఎస్ఐ దేవి ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యుత్ ఏడీ శివకుమార్, ఏఈ తిరుపతిరావుతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం గతనెల 14వ తేదీన వీచిన ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను సరిచేయకపోవడం, ఆ తీగెల్లో విద్యుత్ సరఫరా కావడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. రైతు దంపతుల మృతితో విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
పేద ప్రాణంపై కార్పొరేట్ ఆస్పత్రి దాష్టీకం
ఒంగోలు టౌన్: చికిత్స కోసం వచ్చిన ఒక పేద కుటుంబాన్ని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి చేతికందిన కాడికి దోచుకుంది. అయినాసరే కడుపునిండని వైద్యశాల నిర్వాహకులు.. అడిగినంత డబ్బు చెల్లించలేదని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అర్ధరాత్రి వైద్యశాల నుంచి పంపించి వేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... యర్రగొండపాలేనికి చెందిన బెల్లంకొండ ఆదిలక్ష్మిపై భర్త చినగురవయ్య, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఆగస్టు చివరలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిని ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో పనిచేస్తున్న బాధితుడి తాలూకా బంధువు ఒకరు ఇక్కడి కంటే చికిత్స బయట ఆస్పత్రిలో బాగుంటుందని, అక్కడి డాక్టర్లు తనకు బాగా తెలుసని చెప్పి రిమ్స్ ఎదురుగా ఉన్న లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. తొలుత రూ.లక్ష ఖర్చు చేస్తే మీ అమ్మాయి కోలుకుంటుందని మధ్యవర్తి నమ్మించి వైద్యశాలలో చేర్పించారు. అసలు కథ అప్పుడు ప్రారంభమైంది. మొదట రూ.40 వేలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఆ తర్వాత అర్జంటుగా ఆపరేషన్ చేయాలి రూ.70 వేలు కట్టమన్నారు. అలా మొదలుపెట్టిన వైద్యశాల నిర్వాహకులు రోగి నుంచి విడతలవారీగా రూ.9 లక్షల వరకూ వసూలు చేశారు. 40 రోజులు దాటిపోయినా రోగి మాత్రం కోలుకోలేదు. కానీ, మరో రూ.2 లక్షలు చెల్లించాలని, లేకపోతే వైద్యం చేయమని నిర్వాహకులు ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఆదిలక్ష్మి తలిదండ్రులు వల్లబాయి వెంకటేశ్వర్లు, నాగమ్మ కూలి పనులు చేసుకుంటూ బతుకుబండి లాగుతుంటారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారు.. బిడ్డ బతుకుతుందన్న ఆశతో యర్రగొండపాలెంలోని ఇంటిని తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చారు. చివరికి మందులకు కూడా డబ్బు లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి బిక్షాటన చేసి రూ.3 వేలు తెచ్చి మందులు కొనుగోలు చేశారు. మరో రూ.2 లక్షలు చెల్లిస్తేగానీ ఇకముందు వైద్యం చేయడం కుదరదని తేల్చిచెప్పడంతో ఆందోళనకు గురైన బాధితురాలి తల్లి నాగమ్మ వైద్యశాల నిర్వాహకులను బతిమాలుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేగాకుండా నాగమ్మను వైద్యశాల నిర్వాహకుడు రాజా దూషించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు కన్నీటి పర్యంతమైంది. గత సోమవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉన్న ఆదిలక్ష్మికి చికిత్స చేయకుండా డిశ్చార్జి సమ్మరి ఇవ్వకుండా బయటకు పంపించారు. ఏం చేయాలో దిక్కుతోచక రోదిస్తూ స్థానికుల సలహా మేరకు 108కు ఫోన్ చేసి రిమ్స్‌కు వెళ్లారు. ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగానే ఉండటంతో ఐసీయూలో చేర్చారు. అయితే రోగుల వద్ద డిశ్చార్జి రిపోర్టు లేకపోవడంతో ఆమెకు ఎలాంటి వైద్యం జరిగిందో తెలియక తదుపరి ఏం చికిత్స చేయాలో అర్థంగాక వైద్యులు గందరగోళంలో పడ్డారు. విచారణకు ఆదేశించిన కలెక్టర్ దినేష్‌కుమార్... ఆదిలక్ష్మి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, నాగమ్మ బుధవారం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రూ.9 లక్షలు వసూలు చేయడంపై కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. డిశ్చార్జి రిపోర్టు ఇవ్వకపోగా మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓను విచారణకు ఆదేశించారు. చికిత్స పేరుతో వసూలు చేసిన డబ్బు మొత్తం తిరిగి ఇప్పించాలని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆదిలక్ష్మిని గుంటూరు తరలించి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డబ్బు చెల్లించకపోతే రిపోర్టులు ఎలా ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకుడు... ఆస్పత్రికి చెల్లించాల్సిన ఫీజు మొత్తం చెల్లించకపోతే డిశ్చార్జి సమ్మరి ఎలా ఇస్తామని ఆస్పత్రి నిర్వాహకుడు కృష్ణ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఆదిలక్ష్మి విషయం గురించి వివరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అంటేనే లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడం గమనార్హం. -
ఎంతటి వాహనాన్నిఐనా రిపేర్ చేస్తున్న:ఆదిలక్ష్మి గ్యారేజ్
-
పెళ్లయిన వారానికే... ఆత్మహత్య
ఖమ్మం: పెళ్లయిన వారానికే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం దిబ్బగూడెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న చాతా ఆదిలక్ష్మి వివాహం ఈ నెల 21న అదే జిల్లాకు చెందిన బూర్గంపాడు మండలానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. భర్తతో కలసి ఆదిలక్ష్మి దిబ్బగూడెంలోని తన తండ్రిగారింటికి వచ్చింది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కారణాలు తెలియాల్సి ఉంది.