కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఆదిలక్ష్మి తలిదండ్రులు వెంకటేశ్వర్లు, నాగమ్మ
ఒంగోలు టౌన్: చికిత్స కోసం వచ్చిన ఒక పేద కుటుంబాన్ని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి చేతికందిన కాడికి దోచుకుంది. అయినాసరే కడుపునిండని వైద్యశాల నిర్వాహకులు.. అడిగినంత డబ్బు చెల్లించలేదని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని అర్ధరాత్రి వైద్యశాల నుంచి పంపించి వేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... యర్రగొండపాలేనికి చెందిన బెల్లంకొండ ఆదిలక్ష్మిపై భర్త చినగురవయ్య, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఆగస్టు చివరలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిని ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
రిమ్స్‌లో పనిచేస్తున్న బాధితుడి తాలూకా బంధువు ఒకరు ఇక్కడి కంటే చికిత్స బయట ఆస్పత్రిలో బాగుంటుందని, అక్కడి డాక్టర్లు తనకు బాగా తెలుసని చెప్పి రిమ్స్ ఎదురుగా ఉన్న లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. తొలుత రూ.లక్ష ఖర్చు చేస్తే మీ అమ్మాయి కోలుకుంటుందని మధ్యవర్తి నమ్మించి వైద్యశాలలో చేర్పించారు. అసలు కథ అప్పుడు ప్రారంభమైంది. మొదట రూ.40 వేలు అడ్వాన్స్ కట్టించుకున్నారు. ఆ తర్వాత అర్జంటుగా ఆపరేషన్ చేయాలి రూ.70 వేలు కట్టమన్నారు. అలా మొదలుపెట్టిన వైద్యశాల నిర్వాహకులు రోగి నుంచి విడతలవారీగా రూ.9 లక్షల వరకూ వసూలు చేశారు.
40 రోజులు దాటిపోయినా రోగి మాత్రం కోలుకోలేదు. కానీ, మరో రూ.2 లక్షలు చెల్లించాలని, లేకపోతే వైద్యం చేయమని నిర్వాహకులు ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఆదిలక్ష్మి తలిదండ్రులు వల్లబాయి వెంకటేశ్వర్లు, నాగమ్మ కూలి పనులు చేసుకుంటూ బతుకుబండి లాగుతుంటారు. రెక్కాడితేగానీ డొక్కాడని వారు.. బిడ్డ బతుకుతుందన్న ఆశతో యర్రగొండపాలెంలోని ఇంటిని తాకట్టు పెట్టి మరీ డబ్బు తెచ్చారు. చివరికి మందులకు కూడా డబ్బు లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఒంగోలు ఆర్టీసీ బస్టాండుకు వెళ్లి బిక్షాటన చేసి రూ.3 వేలు తెచ్చి మందులు కొనుగోలు చేశారు. మరో రూ.2 లక్షలు చెల్లిస్తేగానీ ఇకముందు వైద్యం చేయడం కుదరదని తేల్చిచెప్పడంతో ఆందోళనకు గురైన బాధితురాలి తల్లి నాగమ్మ వైద్యశాల నిర్వాహకులను బతిమాలుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
అంతేగాకుండా నాగమ్మను వైద్యశాల నిర్వాహకుడు రాజా దూషించడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు కన్నీటి పర్యంతమైంది. గత సోమవారం రాత్రి అపస్మారక స్థితిలో ఉన్న ఆదిలక్ష్మికి చికిత్స చేయకుండా డిశ్చార్జి సమ్మరి ఇవ్వకుండా బయటకు పంపించారు. ఏం చేయాలో దిక్కుతోచక రోదిస్తూ స్థానికుల సలహా మేరకు 108కు ఫోన్ చేసి రిమ్స్‌కు వెళ్లారు. ఆదిలక్ష్మి పరిస్థితి విషమంగానే ఉండటంతో ఐసీయూలో చేర్చారు. అయితే రోగుల వద్ద డిశ్చార్జి రిపోర్టు లేకపోవడంతో ఆమెకు ఎలాంటి వైద్యం జరిగిందో తెలియక తదుపరి ఏం చికిత్స చేయాలో అర్థంగాక వైద్యులు గందరగోళంలో పడ్డారు.
విచారణకు ఆదేశించిన కలెక్టర్ దినేష్‌కుమార్...
ఆదిలక్ష్మి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, నాగమ్మ బుధవారం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రూ.9 లక్షలు వసూలు చేయడంపై కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. డిశ్చార్జి రిపోర్టు ఇవ్వకపోగా మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసిన లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై వెంటనే డీఎంఅండ్‌హెచ్‌ఓను విచారణకు ఆదేశించారు. చికిత్స పేరుతో వసూలు చేసిన డబ్బు మొత్తం తిరిగి ఇప్పించాలని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆదిలక్ష్మిని గుంటూరు తరలించి మరింత మెరుగైన చికిత్స అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
డబ్బు చెల్లించకపోతే రిపోర్టులు ఎలా ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకుడు...
ఆస్పత్రికి చెల్లించాల్సిన ఫీజు మొత్తం చెల్లించకపోతే డిశ్చార్జి సమ్మరి ఎలా ఇస్తామని ఆస్పత్రి నిర్వాహకుడు కృష్ణ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. ఆదిలక్ష్మి విషయం గురించి వివరణ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అంటేనే లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment