
సాక్షి, గిద్దలూరు రూరల్: ఉన్నత చదువుల నిమిత్తం జర్మనీకి వెళ్లిన ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని అనారోగ్యంతో ఈనెల 21న మృతి చెందింది. ఆమె భౌతికకాయాన్ని సోమవారం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
వివరాల ప్రకారం.. కంచిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు షేక్ మహబూబ్ బాషా కుమార్తె రెహనాబేగం (28) జర్మనీలోని హాల్ పట్టణంలో పోస్టు గాడ్యుయేషన్ పూర్తి చేసింది. బయో మెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేందుకు 2022లో జర్మనీకి వెళ్లింది. గతేడాది నుంచి ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ అక్కడే తుదిశ్వాస విడిచింది. మహబూబ్‌బాషాకు ఇద్దరు కుమార్తెలు కాగా రెహనాబేగం పెద్ద కూతురు. మృతదేహం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. సోమవారం కంచిపల్లె గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.