
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025
మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.
ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి.