సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! | Sagubadi: Cultivation Of Crops In Draft Proofing Model | Sakshi
Sakshi News home page

సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!

Published Tue, Mar 19 2024 8:14 AM | Last Updated on Tue, Mar 19 2024 8:20 AM

Sagubadi: Cultivation Of Crops In Draft Proofing Model - Sakshi

డ్రాట్‌ ప్రూఫింగ్‌ మోడల్‌లో పంటలు సాగుచూస్తున్న ఆదిలక్ష్మి, రంగస్వామి

బీడు భూములనూ సాగులోకి తెచ్చే వినూత్న పద్ధతి

పొలం అంతా దున్నకుండా ప్రతి 3 అడుగులకు ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి 5 రకాల పంటల సాగు

ఏపీ రైతు సాధికార సమితి ఆధ్వర్యంలో సాగు చేస్తున్న 56 మంది చిన్న, సన్నకారు రైతులు

ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్‌ ప్రూఫింగ్‌ మోడల్‌)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్‌ ప్రూఫ్‌ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం..

కాలువ రాకపోయినా పంట వచ్చింది..
రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్‌ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు.

ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్‌ ప్రూఫ్‌ మోడల్‌లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు.

పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్‌ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్‌ పెల్లటైజేషన్‌ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది.

ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్‌ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది.

మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్‌ ప్రూఫ్‌ మోడల్‌లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది.

సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా

బీడులోనూ పంటలు.. 
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు.

సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్‌ ప్రూఫింగ్‌ మోడల్‌లో 2023 డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది.

పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్‌ ప్రూఫింగ్‌ మోడల్‌ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు.

ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement