ఎడ్ల బండిపై నుంచి స్ప్రేగన్ సహాయంతో పురుగుమందు పిచికారీ చేస్తున్న దృశ్యం
యువ రైతు మక్దుం అలీ ఆవిష్కరణ
15 నిమిషాల్లోనే ఎకరాకు పురుగుల మందు పిచికారీ
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం.
నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు.
పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి.
అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ
స్ప్రేగన్‌తో వేగంగా మందులు పిచికారీ..
రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్‌తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా.
– మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ
► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ..
రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment