Narva
-
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
లక్ష్యం చేరని చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం
ఎగువ పరీవాహక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలు విజయవంతంగా సాగుతున్నాయి. దీంతో ఆయకట్టు దారులు ఈ ఏడాది రెట్టింపు సాగు చేశారు. కానీ నర్వ మండలంలోని చంద్రఘడ్ ఎత్తిపోతలను పాలకులు, అధికారులు విస్మరించడంతో ఈ ప్రాంత రైతులకు నిరాశే మిగిలింది. సాక్షి, నారాయణపేట: రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం డీలా పడిపోయింది. కృష్ణమ్మ చెంతనే ఉన్నా సాగునీరుకు నోచుకోక వేల ఎకరాలన్ని బీడు భూములుగా మారాయి. మండలానికి మంజూరైన ప్రధాన ఎత్తిపోతలు చంద్రఘడ్, కొండాదొడ్డి ఎత్తిపోతల పథకాలు కాంట్రాక్టుల కక్కుర్తికి ఏడాది కూడా నడవని పరిస్థితి దాపురించింది. కొండాదొడ్డి మూత పడగా, చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం పరిస్థితి కూడా అలాగే అయ్యేలా ఉంది. ముచ్చటగా మూడు లిఫ్టులు.. చంద్రఘడ్ ఎత్తిపోతలలో ప్రధానంగా మూడు లిప్టులు ఉన్నాయి. ఇందులో చంద్రఘడ్ కింద 5 వేల ఎకరాలు, నాగిరెడ్డిపల్లి కింద 5 వేలు, బెక్కర్‌పల్లి కింద 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2005 సంవత్సరంలో వీటి పనులను చేపట్టారు. ఇందుకుగాను ఒక్కో ఫేజుకు 5 వేల ఎకరాలతో 15 వేల ఎకరాల లక్ష్యంతో పనులను రూ.58 కోట్లు కేటాయించగా ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.18 కోట్లతో అప్పట్లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 18 నెలల గరిష్ట గడువుతో ఓ ప్రముఖ కంపెనీ పనులను చేపట్టింది. ఇందులో నాబార్డు ద్వారా రూ.36 కోట్లు మంజూరుకాగా ఈ నిధులతో పనులను చేపట్టిన కంపెనీ కృష్ణానది నిల్వ నీటి వద్ద పంప్‌హౌస్ నిర్మాణం, విద్యుత్ ఉపకేంద్రం, చంద్రఘడ్ పథకం మూడు దశలకు అందజేసే పంప్‌హౌస్‌కు పైప్‌లైన్ పనులు చేపట్టింది. అప్పట్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన కంపెనీ పనులు నాసిరకంగా చేయడంతో ప్రారంభంలో ట్రయల్ రన్‌లోనే చాలా చోట్ల పైపులు పగిలిపోయాయి. నిధుల అడ్డంకితో.. నాబార్డు ద్వారా మంజూరైన రూ.36 కోట్లను సింహబాగం పైప్‌లైన్ కొనుగోలు కోసం ఖర్చుచేశారు. చిన్న నీటి పారుదల సంస్థ నుంచి నిధులు విడుదల జాప్యంతో కాంట్రాక్టర్లు పనుల కోసం అదనపు నిధులు వ్యయం చేశారు. దీం తో ఐడీసీ అధికారులు అనేక మార్లు నిధుల విడుదల కోసం ప్రతిపాదనలు పంపినా ఏడేళ్ళ వరకు నిధుల కేటాయింపులే లేవు. దీంతో అదనపు కేటాయింపులు లేక పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెనకాడారు. తదనాంతరం ప్రభుత్వం నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతలకు రూ.4.76 కోట్లు, చంద్రఘడ్‌కు రూ.4.95 కోట్లు, బెక్కర్‌పల్లికి రూ.5.66 కోట్ల చొప్పున నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ గతంలో అదనపు పనుల చేసిన వాటికి బిల్లులు పోను మిగిలిన నిధులతో పనులను ప్రారంభించారు. 15 వేల నుంచి 9,770 ఎకరాలకు.. జీఓ ఆర్టి 986 ప్రకారం నవంబర్ 4, 2012న ప్రభుత్వం ఈ మూడు లిఫ్టుల ఆయకట్టును 15 వేల నుంచి 9,770 ఎకరాలకు తగ్గించింది. ఇందులో 9,770 ఎకరాల భూమి ఐడీసీ స్కీం, రాజీవ్‌భీమ లిఫ్టు సంగంబండ రిజర్వాయర్, భూత్పూరు రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నదని గ్రహించి రెండు శాఖల సమన్వయం లేనందున ఈ జీఓ ద్వారా రాజీవ్ భీమ లిఫ్టు ఆధీనంలో కాలువలు పూర్తిచేసి ఐడీసీ వారికి ఇచ్చేందుకు ఆదేశాలు జారిచేసింది. రాజీవ్ భీమానా..? ఐడీసీనా..? రైతులు ఉన్న 9,770 ఎకరాల భూమికి ఐడీసీ నుంచో రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే ఇందులో ఒక తిరకాసు ఉంది. ఐడీసీ నుంచి కాలువలు ఏర్పాటైతే పంట కాలువలకు భూమి నష్ట పరిహారం చెల్లించరు. రాజీవ్ లిఫ్టు నుంచి నీరు కోరుకుంటే రైతుల పొలాలకు నష్ట పరిహారం వస్తుంది. దీంతో రైతులు రాజీవ్‌లిఫ్టు వైపే మొగ్గు చూపారు. కానీ ల్యాండ్ యాక్వేషన్ లేకపోవడంతో నష్టపరిహారం రాదని పిల్లకాల్వల తవ్వేందుకు రైతులు ఉత్సాహం చూపడం లేదు. మేజర్ ఇరిగేషన్లో కలపాలి 1500 హార్స్‌పవర్స్ కలిగిన మోటర్లను రైతులే నిర్వహణ చేయాలంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ పథకాన్ని మేజర్ ఇరిగేషన్లో కలిపితేనే నిర్వాహణ సాధ్యమవుతుంది. కనీసం ఒక్క మాన్‌సూన్‌లోనైన పూర్తి ఆయకట్టుకు నీరు ఇవ్వలేక పోతున్నాం. దీంతో రైతులు నిర్వాహణకు డబ్బులు కట్టడం లేదు. ఎమ్మెల్యే నిధులను వాడుకునేందుకు అధికారులు ఎస్టిమేషన్ వేయడంలేదు. దీంతో అడుగడుగున లీకేజీలతో ఈ ఖరీఫ్‌లో సాగు కష్టమే అనిపిస్తుంది. – సత్యనారాయణరెడ్డి అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం -
దారితప్పిన జింకపిల్ల పోలీసులకు అప్పగింత
నర్వ : కందిచేన్లో దారితప్పి వచ్చిన కష్ణ జింకపిల్లను స్థానిక రైతులు చేరదీసి నర్వ పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం సీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని సీపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున తాను సాగుచేస్తున్న కందిచేనుకు వెళ్లి పరిశీలిస్తుండగా జింకపిల్ల తారసపడింది. దీంతో ఆంజనేయులు జింకపిల్లను జాగ్రత్తగా చేరదీసి జక్కనపల్లి గ్రామవాసులతో కలిసి నర్వ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. జింకపిల్లను స్వాధీనం చేసుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఏఎస్ఐ మక్సూద్ అహ్మద్ తెలిపారు.