మామిడి తోటలో వీసీ డా. నీరజా ప్రభాకర్ తదితరులు
ప్రకృతి సేద్యంపై శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ వినూత్న ప్రయోగం
జీవామృతం కూడా వాడకుండా కేవలం.. కలుపు మొక్కలతో తయారు చేసే ‘సస్యగవ్య’తోనే భూసారం పెంపు!
నాలుగేళ్లలో గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం, టోటల్ నత్రజని
బంజర్లు, నిస్సారమైన భూములను ఖర్చు లేకుండా సాగులోకి తెచ్చే ఫలప్రదమైన మార్గం ఇది అంటున్న వర్సిటీ
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది.
వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు.
ఎత్తుమడులు.. అధిక సాంద్రత..
- 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు.
- భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు.
- ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు.
కలుపు మొక్కలే బలం!
ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు.
కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ
ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు.
గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం..
సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు.
సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు.
మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు.
బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన
‘సస్యగవ్య’ తయారీ ఇలా..
పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది.
ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది.
ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు.
ఇంతకీ దిగుబడి ఎంత?
స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది.
– డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
Comments
Please login to add a commentAdd a comment