fruits plants
-
Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..
రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా మార్కెట్‌కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్ చేయటం వారి సక్సెస్‌కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్‌కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ల్లో డిమాండ్ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్ క్వీన్ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్ రకం, మస్క్‌మిలన్ (జ్యూస్ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్ నుంచి తెప్పించారు. ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్ మేకర్‌తో బెడ్ తయారు చేసి, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు. జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్ 3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ డిమాండ్‌ను బట్టి పంట మార్చుతాం! ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273). నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
Lockdown: ‘ఫలం’ దక్కలే
సాక్షి, హైదరాబాద్: పుచ్చ, అరటి, జామ, కర్బూజా, బత్తాయి, దానిమ్మ.. ఇవి అందరూ ఇష్టంగా తినే పండ్లే. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి బాగా డిమాండ్ కూడా ఉంది. ఇవి దాదాపుగా నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయన్నా అతిశయోక్తి కాదు. అయినప్పటికీ.. రాష్ట్రంలో ఈ పంటలు పండించిన రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. అడ్వాన్సు కొనుగోళ్లేవీ.. రాష్ట్రంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణం దాదాపు 4.5 లక్షల ఎకరాలు కాగా ఇందులో ఒక్క మామిడి తోటలే 3,17,591 ఎకరాల్లో ఉన్నాయి. బత్తాయి 63,479 ఎకరాల్లో ఉండగా మిగతావి పుచ్చ, జామ, బొప్పాయి, కర్బూజ వంటి ఇతర పంటలు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన.. అకాల వర్షాలకు తోడు లాక్డౌన్ ఉద్యాన రైతుల్ని అష్టకష్టాల పాలు చేస్తోంది. పంటలను అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో వ్యాపారులే తోటల వద్దకు వచ్చి ముందస్తు అడ్వాన్సులిచ్చి మరీ కొనుగోళ్ల జరిపేవారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటం, కేవలం 4 గంటల సడలింపు మాత్రమే ఉండటంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. రవాణాలో ఇబ్బందులు, కష్టనష్టాల కోర్చి ఎలాగో మార్కెట్‌కు తెచ్చినా సరైన ధర లేక, తక్కువ సమయం కావడంతో హడావుడిగా అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కోసారి కొనే నాథుడు కూడా లేకపోవడంతో తెచ్చిన పంటను అక్కడే వదిలేసి పోతున్నారు. కాగా వేసవి సీజన్లో వచ్చే మామిడి పరిస్థితి మరీ దయనీయంగా మారగా.. లాక్డౌన్ కారణంగా శుభకార్యాలకు చాలావరకు బ్రేక్ పడటంతో పూలు సాగు చేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టి, దిక్కుతోచని పరిస్థితుల్లో పూల తోటల్లో గొర్రెలు, మేకల్ని మేపుతున్నారు. కూరగాయల రైతులు కూడా కొనే దిక్కులేక చేళ్లను పశువులకు వదిలేశారు. గత ఏడాది కరోనా దెబ్బతోనే ఇప్పటికీ కోలుకోలేని రైతులు, తాజా లాక్‌డౌన్‌తో మరింత నష్టాల్లో కూరుకుపోతున్నారు. తప్పని కూర‘గాయాలు’ ఈ ఫొటోలో పాలకూర చేనులో బర్రెలను మేపుతున్న రైతు కత్తి గోవిందరెడ్డి. ఇతనిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మచెట్టుస్టేజీ గ్రామం. తనకున్న మూడు ఎకరాల్లో వంకా య, టమాట, దోస, గోరు చిక్కుడుతో పాటు పాలకూర, గోంగూర వంటి ఆకుకూరలు వేశాడు. మొ త్తం రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేశాడు. వేసవికాలంలో ఆకుకూరలు, కూరగాయలకు రేటు బాగానే ఉంటుందని భావించినా.. పంట చేతికి వ చ్చిన దశలో లాక్డౌన్ పుణ్యమా అని కూరగాయలు కొనే దిక్కులేకుండా పోయింది. టమాట కిలో రూ. 3, వంకాయలు రూపాయి, దోస రూ.4 కు అమ్ముతామన్నా వ్యాపారులు తీసుకోలేదు. లాక్డౌన్లో దుకాణాలు తెరిచేందుకు సమయం తక్కువగా ఉం డటమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అమ్ముడుపోకుంటే కూరగాయలు చెడిపోతాయని అంటున్నారు. దీంతో గోవిందరెడ్డి సాగు చేసిన పం టలన్నీ చేనుపైనే వదిలేసి బర్రెలను మేపుతున్నాడు. పూలు.. గగ్గోలు ఈ ఫొటో చూస్తే పూలతోటలా ఉంది.. గొర్రెలు మేస్తున్నాయేంటి అనుకుంటున్నారా? అవును గొర్రెలు మేస్తోంది పూలే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కాశీంబౌలి గ్రామానికి చెందిన మునుగాల జంగారెడ్డి.. అర ఎకరంలో బంతి, మరో అర ఎకరంలో జర్మనీ పూలు సాగు చేశాడు. బంతి నారుకు రూ.3కు ఒక మొక్క చొప్పున 8 వేల మొక్కలకు రూ.24 వేలు ఖర్చు పెట్టాడు. ఎరువులు, మందులు, కలుపు కూళ్లకు మరో రూ.15 వేల వరకు ఖర్చయింది. ఇక జర్మనీ విత్తనాలు ఇంటి దగ్గరే వేశాడు. దీనికి మందులు, ఎరువులు, కలుపుకూళ్లు రూ.10 వేల వరకు ఖర్చయ్యింది. సరిగ్గా పూలు కోసే సమయంలోనే కరోనా ఎక్కువైందని లాక్డౌన్పెట్టారు. మార్కెట్ రెండు మూడు గంటలే నడుస్తుండటంతో పూలు కొనేవాళ్లే లేకుండా పోయారు. పది రోజుల క్రితం ఒకసారి బంతిపూలు తీసుకుని హైదరాబాద్ మార్కెట్‌కు వెళ్తే ఒక్క కిలోకూడా అమ్మకపోవడంతో అక్కడే పారబోసి వచ్చాడు. కూరగాయలైతే గ్రామాల్లోనైనా తిరిగి అమ్ముకునే అవకాశం ఉండేది. కానీ పూల విక్రయానికి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కే వెళ్లాలి. నగర శివారు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇక్కడికి పూలు తెస్తారు. కానీ లాక్డౌన్ కారణంగా మార్కెట్ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే కొనసాగుతోంది. సుమారు రూ.50 వేలు ఖర్చుపెట్టి పూలు సాగుచేస్తే ఒక్క రూపాయి కూడా రాలేదు. చేసేదేమీలేక పూలతోటలో గొర్రెలు వదలిపెట్టాడు. పోయినేడు కూడా లాక్‌డౌన్‌తో పూలు సరిగా అమ్మలేదని, ఈసారి మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు పూల డిమాండ్ ఉంటుందనుకుంటే ఇలా అయ్యిందని జంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డిమాండ్ కొరవడిన అంజీర.. ఈ రైతు పేరు ధనేశ్వర్‌రెడ్డి. జోగుళాంబ గద్వా ల జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లెడుదిన్నెకు చెందిన ఇతను 16 ఎకరాల్లో అంజీర తోట సాగు చేశాడు. లాక్‌డౌన్‌కు ముందు ప్రతిరోజూ 800 కేజీల నుంచి 1,000 కేజీల వరకు హైదరాబాద్ ఫ్రూట్ మార్కెట్ నుంచి ఆర్డర్ పెట్టేవారు. లాక్‌డౌన్‌తో కొనుగోళ్లు లేవని, 50 నుంచి 100 కేజీలే పంపమని చెబుతుం డటం దిక్కుతోచడంతో లేదు. లాక్‌డౌన్‌కు ముందు కేజీ ధర రూ.120 ఉండేది, ప్రస్తుతం రూ.100 నిర్ణయించారు. కూరగాయలు తరలించే ఆటోలో వంద కేజీలు పంపుతున్నాం. మిగతా పండ్లు మాగినా కో యకపోవడంతో పురుగులు పడుతున్నాయి. పురుగుల వల్ల తోట దెబ్బతింటుందని రోజుకు 25 మం ది కూలీలతో పండ్లు తెంపి పారబోస్తున్నాం. పది రోజులు లాక్డౌన్ అనుకుంటే ఇప్పుడు నెలాఖరు వరకు పొడిగించారు. మా పరిస్థితి దారుణంగా వుంది. రోజుకు కూలీలకు రూ.పది వేలు ఖర్చువుతోంది. వచ్చే ఆదాయం ఆటోకు, కమీషన్ పోను కూలీలకు సరిపోవడం లేదు. పరిస్థితి ఇలా కొనసాగితే పొలాలు అమ్ముకోవాల్సిందేనని ధనేశ్వర్‌రెడ్డి వాపోతున్నాడు. కర్బూజ.. ఏక్ కహానీ ఇతని పేరు రమేష్. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామం. రెండున్నర ఎకరాలలో తెల్ల కర్బూజ, కీరదోస వేశాడు. రూ.1.80 లక్షలు ఖర్చు చేశాడు. పంట అమ్మగా తిరిగి చేతికి రూ.1.10 లక్షలు మాత్ర మే వచ్చాయి. అంటే రూ.70 వేలు నష్టపోయాడన్నమాట. లాక్డౌన్ కారణంగా వ్యా పారులు కొనేందుకు ముందుకు రాలేదని, తామే అష్టకష్టాలు పడి నిజామాబాద్, ఇతర మార్కెట్లకు వెళ్లి అమ్ముకున్నామని చెప్పాడు. చివర్లో రవాణా ఖర్చులు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మిగిలిన పంటను దున్నేశానని వాపోయాడు. గుమ్మడి కాయకు కష్ట కాలం! సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని ఆయా గ్రామాల్లో రైతులు సుమారు వంద ఎకరాల్లో గుమ్మడికాయ సాగు చేశారు. మామూలుగా అయితే హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకునేవారు. ఏ శుభకార్యానికైనా గుమ్మడికాయ కొట్టడం ఆనవాయితీ. ఇలా గుమ్మడికీ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు అంతగా లేకపోవడంతో పంట అమ్ముడు పోవడం లేదు. దీంతో కోతకు వచ్చిన గుమ్మడి కాయలను రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. ‘ఎకరాకు సుమారు పదిహేను వేల చొప్పున ఖర్చు చేసి రెండెకరాల్లో గుమ్మడికాయ పంట సాగు చేశా. ప్రస్తుతం కొన్ని కోసి సిద్ధంగా ఉంచా. కానీ కొనేందుకు ఎవరూ రావడం లేదు. పొలంలో ఇంకా కాయలున్నాయి. ప్రభుత్వం ఆదుకోవాలి..’అని గుమ్మడిదలకు చెందిన రైతు రవీందర్‌రెడ్డి కోరుతున్నారు. రేటు దక్కని అరటి రెండెకరాల్లో అరటి పంట వేశా. ఇప్పటివరకు రూ.1,50,000 పెట్టుబడి అయింది. లాక్డౌన్ లేకుంటే ఈ సీజన్లో సుమారుగా రూ.4 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉండేది. కానీ వ్యాపారులు.. అరటిపండ్లు తక్కువగా అమ్ముడు పోతున్నాయంటూ మా దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గతంలో అరటికాయలు కిలోకు రూ.13– 16 ధర పలకగా, ఇపుడు రూ.5–6 మాత్రమే పలుకుతోంది. దీనికి తోడు అకాల వర్షాలతో అరటి చెట్లు పడిపోయి గెలలు దెబ్బతింటున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. – హింగే నాగేశ్వర్రావు, దామెర, వరంగల్ రూరల్ జిల్లా బొప్పాయికి తప్పని తిప్పలు నాకున్న రెండున్నర ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసిన. కలుపుతీత కోసం కూలీలకే ఇప్పటివరకు సుమారు రూ.70 వేల వరకు ఖర్చయ్యింది. పూతకు వచ్చినప్పటి నుంచి రెండు సార్లు మందులు పిచి కారీ చేసిన. ఇలా ఇప్పటివరకు మొ త్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పె ట్టిన. పంట కోతకు వచ్చిన సమయంలో లాక్డౌన్ వచ్చి పడింది. రవాణా సౌకర్యం లేదంటున్నారు. స్థానికం గా అమ్ముకుంటే ఏమొస్తుందో ఏమో.– నర్సయ్య, రైతు 20 శాతం పంటలకు నష్టం జనగామ జిల్లాలో రైతులు 15 వేల ఎకరాల్లో మామిడి, కూరగాయలు, బొప్పాయి, జామ తదితర పంటలు సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు, గాలి దుమారంతో 20 శాతం మేర పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇందులో మామిడి 950 ఎకరాల్లో, బొప్పాయి 150 ఎకరాల్లో , కూరగాయలు 2 వేల ఎకరాల్లో 15 నుంచి 20 శాతం మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలను పంపిస్తాం. లాక్‌డౌన్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం. – కేఆర్ లత, హార్టికల్చర్ ఆఫీసర్, జనగామ ఇబ్బందులు వాస్తవమే.. ఉద్యాన ఉత్పత్తుల విక్రయాలకు లాక్డౌన్ కొంత ఇబ్బందిగా మారిన విషయం నిజమే. ప్రతిరోజూ మార్కెట్‌కు పుచ్చతో పాటు ఇతర పండ్లు వస్తున్నాయి. మార్కెట్లో పండ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతుల నుంచి ఫిర్యాదులు రాలేదు. అయితే మే మాసంలో కోతకు వచ్చేలా పంటలు సాగు చేసిన వారుంటే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. సడలింపు సమయం తక్కువ కావడంతో కూరగాయలు, ఆకుకూరలు మాత్రం పూర్తి స్థాయిలో విక్రయించుకోలేక పోతున్నారు. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి, వరంగల్ అర్బన్ జిల్లా పంట పేరు: పుచ్చ సాగుచేసిన విస్తీర్ణం: మూడు ఎకరాలు పెట్టుబడి: రూ.2.10 లక్షలు నష్టం: రూ.5 లక్షలు ఇదీ పుచ్చ సాగు వ్యయాల లెక్క. నలిమెల ప్రవీణ్‌రెడ్డి (ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర) రెండేళ్లుగా యాసంగి పంటగా పుచ్చ సాగుచేస్తున్నాడు. గతేడాది ఆరెకరాల్లో సాగుచేయగా, పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌తో లాభాలకు తాళంపడింది. అప్పట్లో ఊరూరా తిరిగి ఒక్కో కాయను రూ.10 చొప్పు న అమ్మి కొంత సొమ్ము చేసుకున్నాడు. ఈసారి లాక్డౌన్ కఠిన నిబంధనలతో ఆ అవకాశమూ లేకపోయింది. పైగా ధర లేదు. వ్యాపారులూ కొనుగోలుకు రాలేదు. కూలీలతో కాయలు కోయించి విక్రయిద్దామంటే కూలీ డబ్బులైనా వస్తాయో రావోనని మూడెకరాల్లోని పంట మొత్తం వదిలేశాడు. అన్నీ సవ్యంగాజరి గుంటే.. పెట్టుబడి పోను రూ.3 లక్షల లాభం మూటగట్టుకునే వాడు. -
పెట్టకండి.. ఫ్రిజ్జు తినేస్తుంది
ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఆ నిశ్చింతే వేరు. పండ్లు, కూరగాయలు, మిగతా పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టేస్తేరెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకేసారి కొని తెచ్చేసుకుని, ఫ్రిజ్‌లో ఓ మూల పడేసి, అవసరం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే సౌలభ్యం ఉండడం వల్ల ఫ్రిజ్ ఇప్పుడు దాదాపుగాప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. అయితే పండ్లుగానీ, బ్రెడ్డు, తేనె.. ఇంకా ఇతరత్రా పదార్థాలు ఏవైనాఫ్రిజ్లో పెట్టే ముందు మీరెప్పుడైనా ఆలోచించారా.. ‘వీటిని ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?’ అని. ఆలోచించే ఉంటారు.సమాధానమే దొరికి ఉండదు. ఫర్వాలేదు. ఏయే ఫుడ్స్‌ని ఫ్రిజ్‌లో రోజులకొద్దీ పెట్టకూడదో ఇప్పుడుసాక్షి ‘ఫ్యామిలీ’ ఇప్పుడు మీకు చెబుతోంది. కట్ చేసుకుని భద్రపరచుకోండి. భద్రపరచుకోవడం అంటే.. ఫ్రిజ్‌లో కాదని మీకు తెలియకుండా ఉంటుందా?! నట్స్ : బాదం పప్పులు, వాల్నట్స్, ఎండు ఖర్జూరాలు, ఇతరత్రా పప్పుల్ని ఫ్రిజ్‌లో పెడితే వాటి లోపల ఉండే నూనె నిక్షేపంగా ఉంటుంది కానీ, రుచే చప్పబడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే గాలిచొరబడని ఒక డబ్బాలో ఈ నట్స్‌ను పోసి, మూత గట్టిగా బిగించండి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను పెట్టుకోండి. నిల్వా ఉంటాయి, రుచీ ఎక్కడికీ పోదు. చాక్లెట్ స్ప్రెడ్ : బ్రెడ్ స్లయిస్కి అద్దుకుని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో! అయితే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి తియ్యడం వల్ల కాస్త గట్టి పడినట్లయి స్లయిస్ మీద చక్కగా పరుచుకోదు. పైపెచ్చు కొంచెం ఫ్లేవర్ కూడా తగ్గుతుంది. కాబట్టి చాక్లెట్ స్ప్రెడ్‌ని కూడా టైట్ జార్లో ఉంచి మూత గట్టిగా తిప్పేయండి. కీర దోస : ఎవరి ఫ్రిజ్ డోర్ తెరిచినా కూరగాయలతో పాటు కీర దోస తప్పనిసరిగా కనిపిస్తుంది. కనిపించలేదంటే, అంతకు ముందే బయటికి తీసి లాగించేసి ఉంటారని అనుకోవాలి. సరే, కీర దోసను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదంటే.. చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడతాయి. తాజాదనం పోతుంది. కట్ చేసి పెట్టినవైతే నీరుకారి పోతాయి. గది ఉష్ణోగ్రతలోనే ఇవి నవనవలాడుతూ ఉంటాయి. వెల్లుల్లి : వెల్లుల్లి గుబ్బలు గానీ, రెబ్బలు గానీ ఫ్రిజ్‌లోని తేమకు పాడైపోతాయి. రాత్రి వంటకో, మర్నాడు లంచ్‌కో ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టమాటా : టమాటాలు కూడానా! అనిపిస్తుంది. అవును టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే ఆ చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకని కిచెన్ టెంపరేచర్లోనే వాటిని ఉంచేయడం బెటర్. అంతకన్నా బెటర్, ఎక్కువెక్కువ టమాటాల్ని ముందే కొనేసి పెట్టుకోకపోవడం. తేనె : బాటిల్లోని తేనెతో మీరు ఫైటింగ్ చేయదలచుకుంటే తప్ప మీరు తేనె సీసాను ఫ్రిజ్‌లో పెట్టనవసరమే లేదు. ఫ్రిజ్ చల్లదనానికి తేనె చిక్కనవుతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. అందుకే తేనె చిక్కబడినట్లయి, చివరికి బంకమన్నులా మారినా ఆశ్చర్యం లేదు. ఉల్లిగడ్డలు : మరీ ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచితే ఉల్లిగడ్డలు కూడా పాడైపోతాయి. వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో వీటిని ఉంచాల్సిన మాట నిజమే కానీ, ఫ్రిజ్‌లో పెట్టినందు వల్ల ఇవి మెత్తబడి, చెమ్మగిల్లుతాయి. ఆలుగడ్డలు : ఫ్రిజ్‌లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దాంతో ఆలుగడ్డ టేస్టు తగ్గుతుంది. పైగా రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డల్ని బయటి వాతావరణంలోనే వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో కడగకుండా నిల్వ ఉంచాలి. కడిగితే మట్టి వల్ల ఏర్పడిన రక్షణ కవచం దెబ్బతింటుంది. బ్రెడ్డు : మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బ్రెడ్‌ను ప్రిజ్‌లో పెట్టొచ్చా అని. పెడితే సేమ్ ఆలుగడ్డలకు వచ్చే సమస్యే బ్రెడ్డుకూ వస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లదనానికి బ్రెడ్లోని పిండి పదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అంతేకాదు, మామూలుగా పాడైపోయే బ్రెడ్డు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మరింత వేగంగా పాడవుతుంది. దీనినే ‘రిట్రోగ్రెడేషన్’ అంటారు. నిజానికి ఈ రిట్రోగ్రెడేషన్.. బేకింగ్ అవెన్ నుంచి బ్రెడ్డును బయటికి తీసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది. అందుకే వీలైనంత త్వరగా బ్రెడ్‌ను వాడేయాలి. మామిడి పండ్లు : పండినవైతే కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. పండకుండా మాత్రం అలాగే పెట్టేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం కాయను త్వరగా పండనివ్వదు. అందుకని పండేవరకు బయట ఉంచి, పండాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా కవర్లో చుట్టి పెట్టాలి. లేకుంటే పై పొర దెబ్బతింటుంది. పుచ్చకాయ : ఏంటి! పుచ్చకాయను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదా! అవును. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టినా, బయట పెట్టినా ఒకేలా నిల్వ ఉంటుంది పుచ్చకాయ. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో స్థలాన్ని వృథా చేయడం ఎందుకు? కోసిన ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు కానీ, కవర్లో పెట్టి, పెట్టాలి. విడిగా పళ్లెంలో పెట్టి సుదీర్ఘంగా ఉంచితే ఆ ఎర్రటి గుజ్జు మెత్తబడిపోతుంది. తినబుద్ధేయదు. అరటి పండ్లు : అరటి పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పై తోలు నల్లబడి పోతోంది. పండు రుచీ తగ్గుతుంది. కేక్ : కేక్ పైన క్రీమ్ ఉంటే తప్ప ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పైగా పొడి వాతావరణంలోనే కేక్ రుచి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి గాలి చొరబడని కంటెయినర్లో, ఫ్రిజ్ బయటే కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి. ఇక కామన్ టిప్ ఏంటంటే.. వండిన పదార్థాల్ని రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదని డేవిస్లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. -
ప్రతి గ్రామానికీ వంద పండ్ల మొక్కలు
ఎంపీడీఓ యాదయ్య కొందుర్గు : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అందించిన పండ్ల మొక్కలను పిల్లల్లా పెంచాలని ఎంపీడీఓ యాదయ్య సూచించారు. సోమవారం ఆయన ఎంపీటీసీలు, సర్పంచ్ల సమక్షంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు కొబ్బరి మొక్కలను పంపిణీ చేశారు. ఇదివరకే 5వేల జామ, 2వేల బాదామి మొక్కలు పంపిణీ చేశామని, ప్రస్తుతం కార్యాలయానికి వచ్చిన 2500 కొబ్బరి మొక్కలను గ్రామానికి 100 చొప్పున అందిస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లో మామిడి, బొప్పాయి మొక్కలు కూడా వస్తాయని తెలిపారు. ఈ మొక్కలను నీటివసతి ఉన్న కుటుంబాలకే అందించాలని సూచించారు. ప్రతిమొక్కను పసిపిల్లవాడిని పెంచినట్లు పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు సలహాలు అందించారు. గ్రామాల్లో ఇదివరకు నాటిన మొక్కలకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
అక్కడ ఆడపిల్ల పుడితే పండుగే
ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగలాంటి వాతావరణం కనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలంతా ఆనందంతో చిందేస్తారు. పుట్టిన ఆడబిడ్డ పేరిట ఊరంతా కలిసి 111 పండ్ల మొక్కలను తీసుకొస్తారు. వాటిని బిడ్డ పుట్టిన ఇంటి లోపల, బయట నాటుతారు. ఆ మాత్రం స్థలం లేకపోతే ఊరుమ్మడి స్థలంలో నాటుతారు. ఆ చెట్లకు ఆ ఆడబిడ్డ పేరే పెడతారు. ఆడబిడ్డతోపాటు ఆ పండ్ల మొక్కలను కూడా అల్లారు ముద్దుగా పెంచాల్సిన బాధ్యత ఆ బిడ్డ తల్లిదండ్రులదే. కావాల్సిన సహాయం మాత్రం ఇరుగు, పొరుగు మహిళలు అందజేస్తారు. అంతేకాకుండా మొక్కలు నాటినప్పుడే ఆ మొక్కలకు పూజలు చేసి ఆ బిడ్డకు 18 ఏళ్ల వయస్సు వచ్చేవరకు చదివిస్తానని, ఆ తర్వాతనే పెళ్లి చేస్తానని బిడ్డ తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేస్తారు. ఏటా ఆ బిడ్డ పుట్టిన రోజునాడు ఆ చెట్ల వద్దకు వెళ్లి కంకణధారణతో ఆడ పిల్లలు పూజలు చేస్తారు. చెట్లు చల్లగా ఉంటూ తమను చల్లగా చూడాలని కోరుకుంటారు.ఆడబిడ్డ బతుకు భారం కాకూడదనే తలంపుతో ఆడబిడ్డ ప్రసవించిన రోజే ఊరంతా కలసి 21 వేల రూపాయలు సేకరిస్తారు. తల్లిదండ్రుల నుంచి మరో పదివేల రూపాయలు వసూలు చేసి మొత్తం 31 వేల రూపాయలను పుట్టిన బిడ్డ పేరిట డిపాజిట్ చేస్తారు. ఆ సొమ్మును ఆ బిడ్డ పెళ్లికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఊరుమ్మడి కట్టుబాటు. 2006లో మొదలైన ఈ కట్టుబాటు రాజస్థాన్ రాష్ట్రంలోని పిప్లాంత్రి గ్రామంలో నేటికి నిర్విఘ్నంగా కొనసాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామంలో పుట్టిన ఆడ పిల్లల పేరుమీద 25 వేల రకరకాల పండ్ల మొక్కలను నాటారు. వాటి నుంచి వచ్చే పండ్లనే కాకుండా అలవీర మొక్కల నుంచి జూస్‌ను తయారు చేసి గ్రామ మహిళలు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును గ్రామంలోని అమ్మాయిల ఆరోగ్యం, చదువుకోసం ఖర్చు పెడుతున్నారు. ఫలప్రదమైన ఈ ఆచారానికి 2006లో అప్పటి గ్రామ సర్పంచ్ శ్యామ్ సుందర్ పలవాల్ శ్రీకారం చుట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు కిరణ్ అనారోగ్యంతో మరణించడంతో గ్రామంలో ఎవరి కూతురు కూడా అనారోగ్యంతో చావకూడదని, ఆరోగ్య పరిరక్షణలో పండ్లు ఎంతగానో తోడ్పడతాయని పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల మైనస్, మగపిల్లాడు ప్లస్ అనే ఆర్థిక సూత్రం చెప్పే నేటి సమాజంలో అమ్మాయిల పెంపకం, చదువు, పెళ్లి భారం కాకూడదనే దూరాలోచనతో 31 వేల రూపాయల డిపాజిట్ పథకాన్ని కూడా తీసుకొచ్చారు.