ఇంట్లో ఫ్రిజ్ ఉంటే ఆ నిశ్చింతే వేరు. పండ్లు, కూరగాయలు, మిగతా పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టేస్తేరెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి. ఒకేసారి కొని తెచ్చేసుకుని, ఫ్రిజ్‌లో ఓ మూల పడేసి, అవసరం వచ్చినప్పుడు బయటికి తీసి వాడుకునే సౌలభ్యం ఉండడం వల్ల ఫ్రిజ్ ఇప్పుడు దాదాపుగాప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. అయితే పండ్లుగానీ, బ్రెడ్డు, తేనె.. ఇంకా ఇతరత్రా పదార్థాలు ఏవైనాఫ్రిజ్‌లో పెట్టే ముందు మీరెప్పుడైనా ఆలోచించారా.. ‘వీటిని ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?’ అని. ఆలోచించే ఉంటారు.సమాధానమే దొరికి ఉండదు. ఫర్వాలేదు. ఏయే ఫుడ్స్‌ని ఫ్రిజ్‌లో రోజులకొద్దీ పెట్టకూడదో ఇప్పుడుసాక్షి ‘ఫ్యామిలీ’ ఇప్పుడు మీకు చెబుతోంది. కట్ చేసుకుని భద్రపరచుకోండి. భద్రపరచుకోవడం అంటే.. ఫ్రిజ్‌లో కాదని మీకు తెలియకుండా ఉంటుందా?!
నట్స్ : బాదం పప్పులు, వాల్‌నట్స్, ఎండు ఖర్జూరాలు, ఇతరత్రా పప్పుల్ని ఫ్రిజ్‌లో పెడితే వాటి లోపల ఉండే నూనె నిక్షేపంగా ఉంటుంది కానీ, రుచే చప్పబడిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే గాలిచొరబడని ఒక డబ్బాలో ఈ నట్స్‌ను పోసి, మూత గట్టిగా బిగించండి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను పెట్టుకోండి. నిల్వా ఉంటాయి, రుచీ ఎక్కడికీ పోదు.
చాక్లెట్ స్ప్రెడ్ : బ్రెడ్ స్లయిస్‌కి అద్దుకుని తింటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో! అయితే దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి తియ్యడం వల్ల కాస్త గట్టి పడినట్లయి స్లయిస్ మీద చక్కగా పరుచుకోదు. పైపెచ్చు కొంచెం ఫ్లేవర్ కూడా తగ్గుతుంది. కాబట్టి చాక్లెట్ స్ప్రెడ్‌ని కూడా టైట్ జార్‌లో ఉంచి మూత గట్టిగా తిప్పేయండి.
కీర దోస : ఎవరి ఫ్రిజ్ డోర్ తెరిచినా కూరగాయలతో పాటు కీర దోస తప్పనిసరిగా కనిపిస్తుంది. కనిపించలేదంటే, అంతకు ముందే బయటికి తీసి లాగించేసి ఉంటారని అనుకోవాలి. సరే, కీర దోసను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదంటే.. చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడతాయి. తాజాదనం పోతుంది. కట్ చేసి పెట్టినవైతే నీరుకారి పోతాయి. గది ఉష్ణోగ్రతలోనే ఇవి నవనవలాడుతూ ఉంటాయి.
వెల్లుల్లి : వెల్లుల్లి గుబ్బలు గానీ, రెబ్బలు గానీ ఫ్రిజ్‌లోని తేమకు పాడైపోతాయి. రాత్రి వంటకో, మర్నాడు లంచ్‌కో ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
టమాటా : టమాటాలు కూడానా! అనిపిస్తుంది. అవును టమాటాలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పెడితే ఆ చల్లదనానికి పై పొర పాడైపోతుంది. అందుకని కిచెన్ టెంపరేచర్‌లోనే వాటిని ఉంచేయడం బెటర్. అంతకన్నా బెటర్, ఎక్కువెక్కువ టమాటాల్ని ముందే కొనేసి పెట్టుకోకపోవడం.
తేనె : బాటిల్‌లోని తేనెతో మీరు ఫైటింగ్ చేయదలచుకుంటే తప్ప మీరు తేనె సీసాను ఫ్రిజ్‌లో పెట్టనవసరమే లేదు. ఫ్రిజ్ చల్లదనానికి తేనె చిక్కనవుతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. అందుకే తేనె చిక్కబడినట్లయి, చివరికి బంకమన్నులా మారినా ఆశ్చర్యం లేదు.
ఉల్లిగడ్డలు : మరీ ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచితే ఉల్లిగడ్డలు కూడా పాడైపోతాయి. వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో వీటిని ఉంచాల్సిన మాట నిజమే కానీ, ఫ్రిజ్‌లో పెట్టినందు వల్ల ఇవి మెత్తబడి, చెమ్మగిల్లుతాయి.
ఆలుగడ్డలు : ఫ్రిజ్‌లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దాంతో ఆలుగడ్డ టేస్టు తగ్గుతుంది. పైగా రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డల్ని బయటి వాతావరణంలోనే వెలుతురు సోకని చల్లటి ప్రదేశంలో కడగకుండా నిల్వ ఉంచాలి. కడిగితే మట్టి వల్ల ఏర్పడిన రక్షణ కవచం దెబ్బతింటుంది.
బ్రెడ్డు : మీకు డౌట్ వచ్చే ఉంటుంది. బ్రెడ్‌ను ప్రిజ్‌లో పెట్టొచ్చా అని. పెడితే సేమ్ ఆలుగడ్డలకు వచ్చే సమస్యే బ్రెడ్డుకూ వస్తుంది. ఫ్రిజ్‌లోని చల్లదనానికి బ్రెడ్‌లోని పిండి పదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. అంతేకాదు, మామూలుగా పాడైపోయే బ్రెడ్డు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల మరింత వేగంగా పాడవుతుంది. దీనినే ‘రిట్రోగ్రెడేషన్’ అంటారు. నిజానికి ఈ రిట్రోగ్రెడేషన్.. బేకింగ్ అవెన్ నుంచి బ్రెడ్డును బయటికి తీసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది. అందుకే వీలైనంత త్వరగా బ్రెడ్‌ను వాడేయాలి.
మామిడి పండ్లు : పండినవైతే కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. పండకుండా మాత్రం అలాగే పెట్టేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లదనం కాయను త్వరగా పండనివ్వదు. అందుకని పండేవరకు బయట ఉంచి, పండాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా కవర్‌లో చుట్టి పెట్టాలి. లేకుంటే పై పొర దెబ్బతింటుంది.
పుచ్చకాయ : ఏంటి! పుచ్చకాయను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదా! అవును. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టినా, బయట పెట్టినా ఒకేలా నిల్వ ఉంటుంది పుచ్చకాయ. అలాంటప్పుడు ఫ్రిజ్‌లో స్థలాన్ని వృథా చేయడం ఎందుకు? కోసిన ముక్కల్ని ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు కానీ, కవర్‌లో పెట్టి, పెట్టాలి. విడిగా పళ్లెంలో పెట్టి సుదీర్ఘంగా ఉంచితే ఆ ఎర్రటి గుజ్జు మెత్తబడిపోతుంది. తినబుద్ధేయదు.
అరటి పండ్లు : అరటి పండ్లు మగ్గడానికి పొడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అంతేకాదు, ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పై తోలు నల్లబడి పోతోంది. పండు రుచీ తగ్గుతుంది.
కేక్ : కేక్ పైన క్రీమ్ ఉంటే తప్ప ఫ్రిజ్‌లో పెట్టకూడదు. పైగా పొడి వాతావరణంలోనే కేక్ రుచి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి గాలి చొరబడని కంటెయినర్‌లో, ఫ్రిజ్ బయటే కేక్‌ను నిల్వ ఉంచుకోవాలి.
ఇక కామన్ టిప్ ఏంటంటే.. వండిన పదార్థాల్ని రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదని డేవిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment