![Harsh Goenka Tries Viral Lemon Water Honey Hack For Weight Loss](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/harsha.jpg.webp?itok=Je1FQGyg)
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.
వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు.
బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది.
అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది.
నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు.
అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!)
Comments
Please login to add a commentAdd a comment