![Punjab CM Bhagwant Mann Reacts On BJP Leaders Replace Comments](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/arvind-kejriwal.jpg.webp?itok=J4HObzfG)
న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితం నేపథ్యంలో.. పొరుగున్న ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రిని అక్కడి అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ మార్చేయబోతోందంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుత సీఎం భగవంత్ మాన్ విషయంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద కేజ్రీవాల్ అసంతృప్తిగా ఉన్నారని, హామీల అమలులో మాన్ ఘోరంగా విఫలమయ్యారని, త్వరలో ఆయన్ని తప్పించి సమర్థుడిని ఎంపిక చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిపై పంజాబ్ సీఎం మాన్ స్పందించారు.
ఢిల్లీలో ఇవాళ పంజాబ్ ఆప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆ మీటింగ్ తర్వాత.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే(నూతన) మజిందర్ సింగ్ సిస్రా చేసిన కామెంట్ల గురించి మాన్‌కు మీడియా నుంచి ప్రశ్నెదురైంది. దానికి ఆయన గట్టిగా నవ్వారు. వాళ్లను అలా మాట్లాడనివ్వండి అని మీడియాతో చెప్పారు.
పంజాబ్ ఆప్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు. ఢిల్లీ ఫలితాల తర్వాత పంజాబ్ యూనిట్ మా పార్టీ కన్వీనర్‌ను కలవాలనుకుంది. అందుకే వచ్చాం. ఇవాళ్టి మీటింగ్‌లో అలాంటి అంశం కూడా ఏదీ చర్చకు రాలేదు. పంజాబ్‌లో మా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రత్యర్థులు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా.. మాకొచ్చిన నష్టమేమీ లేదు అని అన్నారాయన. అదే సమయంలో.. తనతో ఇరవై మంది పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపైనా మాన్ స్పందించారు.
‘‘ఆయన గత మూడేళ్లుగా ఆ మాటే చెబుతూ వస్తున్నారు. ఆ లెక్కలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒకసారి మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో.. ఆ పార్టీ ఎన్ని సీట్లు నెగ్గిందో ఆయన్ని లెక్కించుకోమనండి’’ అంటూ ఎద్దేశా చేశారాయన.
అలాగే.. ఎన్నికల హామీలను పంజాబ్ ఆప్ ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శలపైనా మాన్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో హామీలను అమలు చేసి తీరతామని ఉద్ఘాటించారాయన. ఇదిలా ఉంటే.. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో 93 మంది ఆప్ సభ్యులు ఉండగా, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment