![US President Donald Trump Key Comments Over Gaza And Hamas](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/TRump.jpg.webp?itok=cryxXfq2)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్టు కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు.
పాలస్తీనాకు చెందిన గాజాపై డొనాల్డ్ ట్రంప్ తన మనసులోకి మాటను బయట పెట్టారు. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆధ్వర్యంలో గాజాను పునర్ నిర్మించే బాధ్యతను తీసుకుంటామన్నారు. ఇందు కోసం గాజాను కొనుగోలు చేసి సొంతం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఇతరులకు కూడా అప్పగించవచ్చు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారు. అంతిమంగా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. హమాస్ తిరిగి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలపై గాజా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతకుముందు కూడా గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గాజాలో పాలస్తీనియన్లందరినీ వేరే ప్రాంతానికి తరలించి, అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. అనంతరం అక్కడ అమెరికా బలగాలను దించి, భారీగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామన్నారు. శాశ్వతమైన మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ప్రస్తుతమున్నట్లుగా కాకుండా అప్పుడు గాజాలో సంతోషంగా ఉండొచ్చు. తుపాకీ కాల్పులు, ఎవరైనా పొడుస్తారని, చంపేస్తారని భయాలుండవు. అమెరికా దీర్ఘకాల యాజమాన్యంలో మధ్యధర సముద్ర తీరంలోని ఆ ప్రాంతంలో పునర్నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
ఈ మాటలపై, పాలస్తీనియన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సొంత భూభాగాన్ని ఒకసారి వదిలేసి వెళితే, తిరిగి రానివ్వరంటూ వారు భయాందోళనలకు గురయ్యారు. అరబ్ దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను తప్పుబట్టాయి. ఈజిప్టు, జోర్డాన్ వంటి మిత్ర దేశాలు సైతం పాలస్తీనియన్ల తరలింపును వ్యతిరేకించాయి. ఇటువంటి చర్యవల్ల పశ్చిమాసియా సుస్థిరత ప్రమాదంలో పడుతుందని, సంక్షోభం మరింత ముదురుతుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా కూడా ట్రంప్ ప్రకటనను తప్పుబట్టింది. ట్రంప్ ప్రకటన సమస్యాత్మకంగా ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు.
జాతి నిర్మూలన ఆలోచన వద్దు: గుటేరస్
ఇజ్రాయెల్–పాలస్తీనా రెండు దేశాల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కట్టుబడి ఉంటుందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ పునరుద్ఘాటించారు. జాతి నిర్మూలన యోచనను నివారించడం అత్యవసరమన్నారు. పాలస్తీనియన్లను వేరే ప్రాంతానికి పంపించి, గాజా నుంచి ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘సమస్య పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో పరిస్థితిని మరింత దిగజార్చరాదు. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం అత్యావశ్యకం. ఏ రూపంలో అయినా జాతి నిర్మూలన నివారించాలి’ అని పేర్కొన్నారు. ఆక్రమణలకు ముగింపు పలకాలన్నారు. గాజా అంతర్భాగంగా స్వతంత్ర పాలస్తీనా రాజ్య స్థాపనతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అన్ని వర్గాలు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియా శాంతి సుస్థిరతలకు ఇదే అసలైన పరిష్కారమని నొక్కిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment