![Immigration Crackdown In UK: Govt Targets Indian Restaurants](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Indian-Restaurants.jpg.webp?itok=7UC4mqEH)
లండన్: అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న వేళ.. బ్రిటన్ సైతం అదే బాటలో పయనిస్తోంది. విదేశీ నేరగాళ్లను, మరీ ముఖ్యంగా దొడ్డిదారిన ఆ దేశంలోకి వచ్చిన పనులు చేసుకుంటున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లలోనే తనిఖీలు జరిపి అరెస్టులు చేస్తుండడం గమనార్హం.
తాజాగా.. యూకే వైడ్ బ్లిట్జ్(UK-wide blitz) పేరుతో వలసదారులు పని చేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్‌లు, బార్‌లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్టు చేసింది. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలని యూకే హోంమంత్రిత్వ కార్యదర్శి వెట్టే కూపర్ చెబుతున్నారు.
హంబర్‌సైడ్ ప్రాంతంలోని ఓ భారతీయ రెస్టారెంట్‌లలో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సౌత్ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
అదుపులోకి తీసుకున్న వాళ్లను ‘ట్రంప్’ స్టైల్‌లోనే బంధించి వెనక్కి పంపించేస్తోంది యూకే. వాళ్ల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి అధికారులు తాజాగా విడుదల చేశారు. అయితే వాళ్లలో నేరగాళ్లు ఉండడం వల్లే అలా చేస్తున్నామని వాళ్లు సమర్థించుకుంటున్నారు.
The public must have confidence in the UK's immigration system.
Through our Plan for Change, we have removed almost 19,000 people including failed asylum seekers, foreign criminals and immigration offenders from the UK since July 2024. pic.twitter.com/QY4tpQDqSP— Home Office (@ukhomeoffice) February 10, 2025
అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై సోమవారం స్పందించిన సంగతి తెలిసిందే. ‘బ్రిటన్‌లో అక్రమ వలసలు పెరిగాయి. చాలామంది అక్రమంగా ఇక్కడ పని చేస్తున్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తాం’ అని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్‌లో సోమవారం చర్చ జరిగింది. అలాంటి అక్రమ వలసదారుల వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడడమే కాకుండా.. వలసలు వచ్చే క్రమంలో ఎందరో ప్రాణాలు పొగొట్టుకుంటున్నారని బ్రిటన్ అందోళన వ్యక్తం చేస్తోంది.
గతేడాది జులైలో బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కీర్ స్టార్మర్ ప్రభుత్వం సరిహద్దు భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇప్పటివరకు దాదాపు 19వేల మంది అక్రమ వర్కర్లను, విదేశీ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి.. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. అయితే, తాజాగా భారతీయ రెస్టారెంట్లను మాత్రమే టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment