అక్రమ వలస కార్మికులపై బ్రిటన్ ఉక్కుపాదం
లండన్: బ్రిటన్లో అక్రమంగా పనిచేస్తున్న వలస కార్మికులపై ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. చట్టవిరుద్ధంగా పనిచేసే కార్మికులు ఇకపై ప్రభుత్వానికి పట్టుబడితే 6 నెలల జైలు శిక్షతో పాటు వారి వేతనాలను స్వాధీనం చేసుకొనే కొత్త ప్రతిపాదనను బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ బిల్లులో ఈ ప్రతిపాదనను చేర్చి వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెట్టాలని భావిస్తోంది.
ఈ తాజా ప్రతిపాదనపై బ్రిటన్ ఇమిగ్రేషన్ మంత్రి జేమ్స్ బ్రోకెన్షైర్ మాట్లాడుతూ.. అక్రమ వలసదారులు, కార్మికులకు జైలు శిక్ష విధించడంతో పాటు వారికి భారీ అపరాధ రుసుం కూడా విధిస్తామని తెలిపారు. వలసదారులకు బ్రిటన్ అనువైన ప్రదేశం అని ఇకపై అనుకునే పరిస్థితి ఉండబోదని స్పష్టం చేశారు. ఇక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారుల ఉద్యోగాలను తొలగించడంతో పాటు, వారు నివసించే ఇళ్లు, బ్యాంక్ అకౌంట్లను కూడా స్వాధీనం చేసుకుంటామన్నారు.