
శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించొద్దు
పుతిన్‌కు యూకే ప్రధాని కియర్ స్టార్మర్ హెచ్చరిక
లండన్: ఉక్రెయిన్– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని రష్యా అధినేత పుతిన్‌ను యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ హెచ్చరించారు. పుతిన్ నిజంగా శాంతిని కోరుకుంటే అది చాలా సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, ఉక్రెయిన్‌పై వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పారు. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు.
30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన చక్కటి ప్రతిపాదనకు రష్యా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని మండిపడ్డారు. శాంతియుత పరిస్థితులు నెలకొనడం పుతిన్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, అప్పుడు మరో గత్యంతరం లేక ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించక తప్పదని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ సిద్ధమైతే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా కొనసాగేలా తాము బాధ్యత తీసుకుంటామని స్టార్మర్ తెలిపారు.
ఆయన శనివారం యూరప్‌తోపాటు మిత్రదేశాల అధినేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ భేటీలో 25 దేశాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై, పుతిన్ వైఖరిపై చర్చించారు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొనాలని ఈయూ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ తదితర దేశాలన్నీ కోరుకుంటున్నట్లు స్టార్మర్ తెలిపారు. రష్యా మెడలు వంచడానికి అవసరమైతే సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికైనా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ప్రాక్టికల్ ప్లానింగ్‌తో ‘ఆచరణ దశ’ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.
వర్చువల్ సమావేశంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, రష్యా మొండి వైఖరితో ఆగిపోయిందని జెలెన్‌స్కీ విమర్శించారు. కాల్పుల విరమణను అడ్డుకోవడానికి రష్యా కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శాంతి కోసం మరింత చొరవ తీసుకోవాలని యూరప్ దేశాలు నిర్ణయానికొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించేలా పుతిన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి యూరప్ దేశాల మిలిటరీ ప్లానింగ్ సమావేశం వచ్చేవారం జరగబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment