
నన్ను రోడ్డుపై నిలిపేశారు
అమెరికా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు చేదు అనుభవం
ట్రంప్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పిన నేత
న్యూయార్క్: దేశాధ్యక్షుడి వాహన శ్రేణి వెళ్తోందంటే ఆ రహదారి మార్గంలో వెళ్లే వాహనాలను పక్కకు ఆపేసి అధ్యక్షుడి కాన్వాయ్‌కు మాత్రమే దారి వదులుతారు. అలా కాన్వాయ్ మొత్తం వెళ్లేంతవరకు ఆగిపోయిన ట్రాఫిక్‌లో సామాన్య ప్రజానీకం ఉసూరుమంటూ వేచి ఉండాల్సిందే. అదే సామాన్య ప్రజానీకం మధ్యలో మరో దేశ అధ్యక్షుడు చిక్కుకుపోవడం నిజంగా అరుదైన ఘటనే.
ఈ అరుదైన ఘటనలో మరో అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ వెళ్లేదాకా ఎంతటి దేశాధ్యక్షుడైనా రహదారిపై కారులో వేచి ఉండక తప్పదని అమె రికన్ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యు యేల్ మేక్రాన్ నడిరోడ్డుపై కారులో వెయిట్ చేశారు. ఎంతకీ ట్రంప్ వాహనశ్రేణి క్రాసింగ్ పూర్తికాకపోవడంతో విసిగెత్తిన మేక్రాన్ కారు నుంచి బయటికొచ్చి అక్కడి పోలీసులతో అసలు విషయంపై ఆరాతీశారు. ఈ ఘటనకు సోమవారం రాత్రి న్యూయార్క్ వేదికైంది.
అసలేమైంది?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనేందుకు మేక్రాన్ అమెరికాకు వచ్చారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని రాత్రి బసచేసేందుకు ఫ్రాన్స్ రాయబార కార్యాలయానికి బయల్దేరారు. ఇలా తన సొంత కాన్వాయ్‌లో వెళ్తున్నప్పుడు న్యూయార్క్ నగర పోలీసులు ఈ కాన్వాయ్‌ను అడ్డుకుంది. ఇదే మార్గంలో ట్రంప్ కాన్వాయ్ వెళ్లబోతోందని, అది వెళ్లేదాకా పక్కకు ఆగి వేచి ఉండాలని వాహన శ్రేణి డ్రైవర్లను న్యూయార్క్ సిటీ పోలీసులు ఆదేశించారు. ఎదుట ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందేమోనని కాసేపు వేచిచూసిన మేక్రాన్ ఎంతకీ ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో విసిగెత్తి కారు నుంచి కిందకు దిగి ఎదురుగా ఉన్న పోలీసుల వద్ద విషయం ఆరాతీశారు. వాళ్లు తాపీగా అసలు విషయం చెప్పారు.
‘‘ మీరు మమ్మల్ని క్షమించాలి. రహదారులపై సాధారణ ప్రజల వాహనాలన్నింటినీ ఆపేశాం. ఇదే మార్గంలో మా అధ్యక్షుడు ట్రంప్ కాన్వాయ్ రాబోతోంది’’ అని మేక్రాన్‌కు ఒక పోలీస్ అధికారి వివరించారు. దీంతో చేసేదిలేక మేక్రాన్ రోడ్డు బారీకేడ్ దగ్గర నిల్చుని సరదాగా అయినా మాట్లాడదామని నేరుగా ట్రంప్‌కు తన మొబైల్ నుంచి ఫోన్‌చేశారు. వెంటనే అటు వైపు నుంచి ట్రంప్ ఫోన్ ఎత్తారు. ‘‘ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం జరిగిందో ఊహించగలరా? మీ కాన్వాయ్ వెళ్తోందని రోడ్లపై కార్లను ఆపేశారు. దీంతో నేను నడిరోడ్డుపై ఆగిపోయా. మీ కాన్వాయ్ వెళ్లిన తర్వాత ఎంబసీకి వెళ్దామని వేచిచూస్తున్నా’’ అని మేక్రాన్ నవ్వుతూ మాట్లాడారు. ఈ మాటలు విన్న ట్రంప్ ఫక్కున నవ్వారేమో మేక్రాన్ కూడా ఫోన్‌లో విపరీతంగా నవ్వుతూ కనిపించారు. ఈ తతంగాన్ని∙మీడియా ప్రతినిధులు తమ కెమెరాల్లో
బంధించాయి.
కారు వదలి కాళ్లకు పనిచెప్పి..
ఇంత జరిగిన తర్వాత కొద్దిసేపటికి ట్రంప్ కాన్వాయ్ అదే మార్గంలో వేగంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత వాహనాలకు పోలీసులు దారి విడవలేదు. పాదచారులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది చూసిన మేక్రాన్ ఇక కారు ఎక్కొద్దని నిర్ణయించుకుని తను కూడా నడుచుకుంటూ ముందుకెళ్లారు. నడుస్తున్నంతసేపూ ట్రంప్‌తో మేక్రాన్ మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూసిన న్యూయా ర్క్ ప్రజలు ఒకింత ఆశ్చర్యం మరికొంత ఆనందానికి గురయ్యారు. అందివచ్చిన అవకాశాన్ని వృథాచేసుకోవద్దని వెంటనే కొందరు పాదచారులు మేక్రాన్‌తో సెల్ఫీలు దిగారు. మేక్రాన్ సైతం ఏమాత్రం అసహనం వ్యక్తంచేయలేదు. సరదాగా వాళ్లతో ఫొటోలు, సెల్ఫీలు దిగి వారి యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. ఒకావిడ ఏకంగా మేక్రాన్ నుదుటిపై ముద్దు పెట్టుకుందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఒక జంటతో మేక్రాన్ ఫొటో దిగాల్సి ఉండగా అక్కడే ఉన్న ఐరాసలో ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి, రాయబారి జెర్మీ బోనాఫాంట్ ఆ ఫొటో తీయడం విశేషం. మేక్రాన్ పాదయాత్ర వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Macro vs Trump Funny Fight 😂🚨
Macron was stopped by the New York Police, because of Donald Trump.
Macron called Trump and said -
"I'm waiting outside right now because everything is blocked for you (motorcade)"
He had to walk to the French Embassy, for 80th UNGA.
Video 📷 pic.twitter.com/UHFR7ivsCg— Mayank (@mayankcdp) September 23, 2025