Keir Starmer
-
ప్రధానిపై విమర్శలు..మస్క్‌కు బ్రిటన్ కౌంటర్
లండన్:బ్రిటన్(Britain) ప్రధాని కీర్ స్టార్మర్(Keir Starmer)పై అమెరికా బిలియనీర్ ఇలాన్ మస్క్(Elon Musk) విమర్శలకు బ్రిటన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్(Pakistan) మూలాలున్న వ్యక్తులు అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగ్‌లను నడిపినా అప్పట్లో క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్‌గా ఉన్న స్టార్మర్ పట్టించుకోలేదని మస్క్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)వేదికగా మస్క్ చేసిన ట్వీట్లు సంచలనం సృష్టించాయి.అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే గ్యాంగులను చట్టం ముందు దోషులుగా నిలపడంలో స్టార్మర్ అప్పట్లో విఫలమయ్యారని మండిపడ్డారు. ఇందుకే బ్రిటన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో స్టార్మర్‌కు కూడా భాగస్వామ్యం ఉందని మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఆ గ్యాంగులపై విచారణకు లేబర్ పార్టీ ఒప్పుకోనందున ఆ పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. అయితే ఈ మస్క్ చేసిన ఈ విమర్శలపై యూకే ఆరోగ్య శాఖ మంత్రి వెస్ స్ట్రీటింగ్ తప్పుపట్టారు. మస్క్‌కు ఎవరో తప్పుడు సమాచారమిచ్చారని,ఆయన ఆరోపణలు వాస్తవ దూరంగా ఉన్నాయని వెస్ పేర్కొన్నారు. అయితే బ్రిటన్‌లో అమ్మాయిలపై అకృత్యాలను అరికట్టేందుకు మస్క్‌తో పనిచేసేందుకు తాము సిద్ధమని తెలిపారు.ఇదీ చదవండి: షినవత్రకు అన్ని ఆస్తులా..? -
G20 Summit: మళ్లీ ఎఫ్‌టీఏ చర్చలు
రియో డి జనిరో: బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై నెలకొన్న అనుమానాలకు తెర పడింది. దీనిపై చర్చలను పునఃప్రారంభిస్తామని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ స్పష్టం చేశారు. బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా నేతలిద్దరూ సమావేశమయ్యారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ గెలుపుతో ఎఫ్‌టీఏ భవితవ్యం అయోమయంలో పడటం తెలిసిందే. దానికి నేతలిద్దరూ తాజాగా తెర దించారు. పరస్పరం లాభసాటిగా ఉండేలా ఎఫ్‌టీఏ విధివిధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. బెల్ఫాస్ట్, మాంచెస్టర్ నగరాల్లో నూతన కాన్సులేట్లు తెరవాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్‌కు మోదీ విజ్ఞప్తి చేశారు.మెరుగైన భవితకు కృషి మెరుగైన భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టాల్సిందిగా జీ20 సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. సదస్సులో రెండో రోజు సుస్థిరాభివృద్ధి, ఇంధన రంగంలో మార్పులపై ఆయన ప్రసంగించారు. అభవృద్ధి చెందుతున్న దేశాలకు ఇచి్చన హామీలను అమలు చేయడం సంపన్న దేశాల బాధ్యత అని గుర్తు చేశారు. పర్యావరణ సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవడం మానవాళి మనుగడకు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. గాజాకు మరింత మాన వతా సాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడాలంటూ సదస్సు డిక్లరేషన్ విడుదల చేసింది. వీటితో పాటు పలు అంశాలపై బుధవారం సదస్సు చివరి రోజు ఉమ్మడి తీర్మానం చేసే అవకాశముంది. దేశాధినేతలతో మోదీ భేటీలుఆతిథ్య దేశం బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ వరుస భేటీలు జరిపారు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్), గాబ్రియెల్ బోరిక్ ఫోంట్ (చిలీ), జేవియర్ మెయిలీ (అర్జెంటీనా), జార్జియా మెలోనీ (ఇటలీ), ప్రబోవో సుబియాంటో (ఇండొనేసియా), పెడ్రో శాంచెజ్ (స్పెయిన్), అబ్దెల్ ఫతా ఎల్ సిసీ (ఈజిప్ట్), యూన్ సుక్ యోల్ (దక్షిణ కొరియా), జోనాస్ గర్ స్టోర్ (నార్వే), లూయీస్ మాంటెనెగ్రో (పోర్చుగీస్), లారెన్స్ వాంగ్ (సింగపూర్), యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ తదితరులు వీరిలో ఉన్నారు. -
వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా?
లండన్ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఇచ్చిన ఆతిథ్యం వివాదంగా మారింది. యూకే ప్రధాని అధికారిక నివాసం 10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీపావళి పర్వదినాన దీపాలు వెలిగించడం, కూచిపూడి నృత్య ప్రదర్శన, కీర్ స్టార్మర్ ప్రసంగం జరిగింది. అంనతరం, అతిథులకు భోజనం ఏర్పాటు చేశారు.అయితే, అతిథులుగా వచ్చిన తమ మనోవభావాలు దెబ్బతినేలా ప్రధాని కీర్ స్టార్మర్ తమకు నాన్‌వెజ్, లిక్కర్లను అందించారని బ్రిటన్ హిందువులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ బ్రిటిష్ హిందూ పండిట్ సతీష్ కే శర్మ.. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత 14 సంవత్సరాలుగా10-డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పుడూ నాన్ వెజ్ ఐటమ్స్, వైన్స్, బీర్ వంటి వాటికి జోలికి వెళ్లలేదు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల్లో మాంసాహారంతో చేసిన వంటకాలు పెట్టారు. వైన్,బీర్లను అందించి మూర్ఖం, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.దీపావళి వేడుకల్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సలహాదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ అంశంపై కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ అంశం బ్రిటన్,భారత్‌లలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మారర్ స్పందించాల్సి ఉంది.కాగా, బ్రిటన్ లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ చరిత్ర సృష్టించింది. 650 స్థానాలకు గాను నాలుగు వందలకు పైగా సీట్లు గెలుచుకొని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. -
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
లండన్: భారత్– బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్‌మ్యాప్‌పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి. -
భారత్‌తో భాగస్వామ్యం.. వైఖరి మార్చుకున్న బ్రిటన్ ప్రధాని!
లండన్: బ్రిటన్‌లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నిక అయ్యారు. అయితే గతంలో లేబర్ పార్టీ కశ్మీర్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా లేబర్ పార్టీ అధికారంలోకి రావటంతో భారత్‌తో భాగస్వాయం విషయం తెరపైకి వచ్చింది. అయితే లేబర్ పార్టీ గతంలో భారత్‌పై చేసిన ఆరోపణలు, వైఖరిని ప్రధాని కీర్ స్టార్మర్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ వార్షిక సమావేశంలో భారత్‌లోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందని, అక్కడి పరిస్థితిపై ఎమర్జెన్సీ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేమయంలో లేబర్ పార్టీ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. లేబర్ పార్టీ ఆరోపణలు సరైన సమాచారం లేని, నిరాధారమైనవి అని భారత్ మండిపడింది. అప్పట్లో జెరెమీ కార్బిన్‌పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతి ఎంపీలు వ్యతిరేకించారు. జెరెమీపై చేసిన తీర్మానం భారత వ్యతిరేక విధానమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక..2020లో కొన్ని కారణాల వల్ల ఆయన్ను లేబర్ పార్టీ సస్పెండ్ చేసింది.అయితే కొత్తగా ఎన్నికైన ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌తో భాగస్యామ్యం, సంబంధాల విషయంలో తన పార్టీ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారత్‌తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలపై తమ పార్టీ వైఖరీ మార్చుకుంటామని పేర్కొన్నారు. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్దతతో ఉన్నట్లు తెలిపారు. ‘‘ లేబర్ పార్టీ ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను మెరుగుపర్చుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, టెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి పలు రంగాల్లో మేము భారత్ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’’ అని మేనిఫోస్ట్లో పేర్కొన్నారు. దీంతో లేబర్ పార్టీ తన భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని భాగస్వామ్య సంబంధాలు పెంచుకునే దిశగా వెళ్లుతున్నట్లు స్పష్టం అవుతోంది. -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
యూకే ఎన్నికల్లో గెలిచిన కైర్ స్టార్మర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్‌పార్టీ అభ్యర్థి కైర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం యూకేతో కలిసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖతాలో ఒక పోస్ట్ పెట్టారు.‘యూకే సార్వత్రిక ఎన్నికలలో అపూర్వ విజయం సాధించిన కీర్ స్టార్మర్‌కు హృదయపూర్వక అభినందనలు. భారత్-యూకే మధ్య పరస్పర వృద్ధి, శ్రేయస్సును పెంపొందిస్తూ అన్ని రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ సానుకూల, నిర్మాణాత్మక సహకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.అదేవిధంగా ఎన్నికల్లో ఓటమి పాలైన కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సైతం మోదీ తన సందేశాన్ని అదించారు. సునాక్ అద్బుతమైన నాయకత్వం, భారత్-యూకే సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.కాగా యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. Heartiest congratulations and best wishes to @Keir_Starmer on the remarkable victory in the UK general elections. I look forward to our positive and constructive collaboration to further strengthen the India-UK Comprehensive Strategic Partnership in all areas, fostering mutual…— Narendra Modi (@narendramodi) July 5, 2024 -
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్‌కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్‌డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్‌లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు.2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్‌లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్‌కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్‌లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్‌లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్‌క్రాస్‌లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఘోర పరాజయంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. గురువారం మొదలైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతుంది. భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ కేవలం 63 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. దీంతో బ్రిటన్ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది. ఇక బ్రిటన్ ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమిని ప్రధాని రిషి సునాక్ అంగీకరించారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలెర్టన్లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో కన్వర్జేటివ్ పార్టీ ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ఆయన దేశ ప్రజలను క్షమాపణలు కోరారు.‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, సరైన పద్దతిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్ అన్నారు.ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవనున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువడటంతో ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్‌పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.The polls are open. Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్‌పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు.