అధికార నివాసం ముందు దీపాలు వెలిగించిన బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు.
భారతీయులపై ప్రశంసల జల్లు
బ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్‌నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment