
స్థానికులకు పని అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న స్టార్మర్ సర్కార్
స్థిరనివాస హోదా పొందాలంటే కనీసం పదేళ్లు అక్కడ ఉండాల్సిందే
శ్వేతపత్రం విడుదల చేసిన బ్రిటన్ హోం శాఖ
లండన్: గత ప్రభుత్వాల ఉదారవాద విధానాల కారణంగా బ్రిటన్‌లోకి వలసలు పోటెత్తాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు భారీగా తగ్గిపోయాయని ఆరోపిస్తూ అధికార లేబర్ పార్టీ కఠిన నిబంధనలను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. బ్రిటన్‌లో వలసకార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమలుచేయనుంది.
వలసదారులు బ్రిటన్‌లో శాశ్వత నివాస హోదా పొందాలంటే ఇకపై ఐదేళ్లకు బదులు కనీసం పదేళ్లు యూకేలో నివసిస్తూ ఉండాలని నిబంధనను కఠినతరం చేయనున్నారు. దీంతో అత్యధిక వర్క్ వీసాల పొందే భారతీయుల బ్రిటన్ శాశ్వత స్థిరనివాస కలలు నెలవేరడం మరింత కష్టంకానుంది. భారతీయులు ఎక్కువగా వైద్యం, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, ఆతిథ్యం, కేటరింగ్, వాణిజ్యవిభాగాల్లో పనిచేసేందుకు వీసాలు పొంది బ్రిటన్‌కు వస్తుంటారు. 2024 జూన్‌లో ముగిసిన 12 నెలల కాలానికి 1,16,000 మంది భారతీయులు వర్క్ వీసాలు పొంది బ్రిటన్‌లో పలు రకాల్లో వృత్తుల్లో స్థిరపడ్డారు.
వీసా నిబంధనల్లో ముఖ్యమైన మార్పులేంటి?
చిన్నారులు, వృద్ధులు, రోగుల బాగోగులు చూసుకునే ఓవర్‌సీస్ కేర్ వర్కర్లకు ఇచ్చే వీసాలను ఇకపై ఆపేయనున్నారు. ఇకపై విదేశీయులను కేర్ వర్కర్లుగా నియమించుకోకూడదనే నిబంధనను అమల్లోకి తేనున్నట్లు పార్లమెంట్‌లో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనున్న హోం శాఖ మంత్రి వెట్టీ కూపర్ చెప్పారు. దీంతో ఈ ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
నైపుణ్యమున్న వాళ్లకు మంజూరుచేసే స్కిల్డ్ వర్కర్ వీసాను ఇకపై కనీసం గ్రాడ్యుయేషన్ విద్యార్హత ఉన్న వ్యక్తులకే ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైద్యులు, ఇంజనీర్లు, కృత్రిమ మేధ ఉద్యోగులు ఇలా నైపుణ్యమున్న వాళ్లకే స్కిల్డ్ వర్కర్ వీసా మంజూరుచేయాలని శ్వేతపత్రంలో ప్రతిపాదించారు. నిబంధనలను పాటిస్తూ దేశార్థికాన్ని తమ వంతు తోడ్పాటునందించే వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. స్కిల్డ్ వర్కర్ వీసా కోరే వాళ్లు కనీసం యూనివర్సిటీ డిగ్రీ పట్టభద్రులై ఉండాలి. ఈ నిబంధనలతో బ్రిటన్ హోం శాఖ సోమవారం ఒక శ్వేతపత్రం విడుదలచేసింది.
డిపెండెంట్‌లకూ ఇంగ్లిష్ పరీక్ష
వీసాదారులపై ఆధారపడి బ్రిటన్‌లో అడుగుపెట్టే వారి జీవితభాగస్వాములు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఇంగ్లిష్ భాషపై కనీస పరిజ్ఞానం, పట్టు ఉండాల్సిందే. వీళ్లంతా ఏ1–లెవల్ ఇంగ్లిష్ టెస్ట్‌ను పాసవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఉంటున్నారు?. ఏ పని మీద వచ్చారు?. ఏం చేస్తారు? ఇలా బ్రిటన్ పోలీసులు ఎక్కడైనా ప్రశ్నిస్తే కనీసం సమాధానం ఇంగ్లిష్‌లో చెప్పేలా బేసిక్ లెవల్ ఇంగ్లిష్ తెలిసి ఉండాలనే నిబంధనను జతచేయనున్నారు.
వీసా గడువు కాలాన్ని వర్కర్లుగానీ, వాళ్ల కుటుంబసభ్యులుగానీ పెంచుకోవాలనుకుంటే వారిపై ఆధారపడే వాళ్లు హై లెవల్ ఏ2 ఇంగ్లిష్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. బ్రిటన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులు అదనంగా మరో 24 నెలలపాటు బ్రిటన్‌లోనే ఉండేందుకు వెసులుబాటు ఉండేది. దానిని ఇప్పుడు 18 నెలలకు కుదించారు. ఊహించనంతగా చట్టబద్ధంగా, అక్రమంగా వస్తున్న వారితో బ్రిటన్ ‘అపరిచితుల ద్వీపం’గా తయారవుతోందని సోమవారం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రధాని స్టార్మర్ వ్యాఖ్యానించారు.