
దెయిర్ అల్–బలాహ్: తమ చెరలో ఉన్న అమెరికా పౌరుడైన ఇజ్రాయెల్ సైనికుడు ఈడన్ అలెగ్జాండర్‌ను గాజాలోని హమాస్ సాయుధ సంస్థ సోమవారం రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ శ్రేణులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మెరుపుదాడి చేపట్టి వందలాది మందిని చంపడంతోపాటు 250 మందిని బందీలుగా పట్టుకుపోవడం తెల్సిందే. వీరిలో ఈడన్ సహా ఇప్పటికీ చెరలోనే ఉన్న 59 మందిలో 24 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు చెబు తున్నారు.
పట్టుబడిన సమయంలో ఇతడు ఇజ్రాయెల్ సైన్యంలోని ఇన్‌ఫాంట్రీ విభాగంలో విధుల్లో ఉన్నాడు. దాదాపు 19 నెలలపాటు గాజాలో హమాస్ వద్ద సజీవంగా ఉన్న వారిలో అమెరికాకు చెందిన ఏకైక వ్యక్తి ఈడన్. ఈడన్ కోసం సురక్షిత కారిడార్ ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ట్రంప్ ప్రభుత్వంపై సాను కూల ధోరణితోనే ఈడన్‌ను వదిలిపెట్టినట్లు హమాస్ ప్రకటించింది. యుద్ధం ముగిసే దిశగా సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.