hostages freed
-
ఇజ్రాయెల్ చెర నుంచి 90 మంది విడుదల
రమల్లా(వెస్ట్ బ్యాంక్): ఇజ్రాయెల్– హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. హమాస్ ముందుగా ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం తెలిసిందే. దీంతో తమ జైళ్లలోని వెస్ట్ బ్యాంక్‌కు చెందిన 90 మంది మహిళలు, చిన్నారులకు సోమవారం ఇజ్రాయెల్ స్వేచ్ఛనిచ్చింది. రెడ్ క్రాస్‌కు చెందిన బస్సుల్లో వచ్చిన వీరికి వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మియులు ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కసారిగా అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. వారిని కొందరు భుజాలపైకి ఎత్తుకోగా మరికొందరు నినాదాలు, ఈలలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఫతా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపుల జెండాలు పట్టుకుని గుమికూడారు. వేడుకలు చేసుకోవద్దంటూ ఇజ్రాయెల్ బలగాలు చేసిన హెచ్చరికలను వారెవరూ పట్టించుకోలేదు. సోమవారం రమల్లాకు చేరుకున్న వారిలో 69 మంది మహిళలు, 21 మంది టీనేజీ బాలురు ఉన్నారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు సైతం ఉన్నాడు. ఒప్పందం మొదటి విడతలో హమాస్ 33 మంది బందీలను 42 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ వెయ్యి నుంచి రెండు వేల మంది ఖైదీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. -
అమల్లోకి కాల్పుల విరమణ
డెయిర్ అల్ బాలాహ్ (గాజా): పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. శ్మశాన సదృశంగా కన్పిస్తున్న గాజా వీధుల్లో ఎట్టకేలకు శాంతిపవనాలు వీచాయి. (Israel),ఇజ్రాయెల్, (Hamas)హమాస్ మధ్య విరమణ ఒప్పందం మూడు గంటలు ఆలస్యంగా ఆదివారం ఉదయం 11.30కు అమల్లోకి వచ్చింది. విడుదల చేయబోయే తమ బందీల జాబితాను హమాస్ వెల్లడించేదాకా (ceasefire agreement)కాల్పుల విరమణ అమల్లోకి రాదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుండబద్దలు కొట్టడంతో తొలుత ఆందోళన నెలకొంది. జాబితా విడుదలను హమాస్ ఆలస్యం చేయడం ఉత్కంఠకు దారితీసింది. ఉదయం 11.15కు రోమీ గోనెన్ (24), ఎమిలీ దమారీ (28), డోరోన్ స్టెయిన్బ్రీచర్ (31) అనే ముగ్గురు మహిళలను హమాస్ వదిలేస్తున్నట్టు హమాస్ ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇజ్రాయెల్ బలగాలు వారిని సురక్షితంగా స్వదేశానికి తరలించాయి. బదులుగా ఇజ్రాయెల్ కూడా తొలి దఫాలో 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. వారిని సురక్షితంగా గాజా చేర్చేందుకు రెడ్‌క్రాస్ వాహనశ్రేణి ఇజ్రాయెల్‌లోని ఓఫెర్ కారాగానికి చేరుకుంది. ఆరువారాల్లో హమాస్ 33 మంది, ఇజ్రాయెల్ దాదాపు 2,000 మంది ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వ భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి వైదొలగింది. ఆ పారీ్టకి చెందిన ముగ్గురు నేతలు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.గాజాలో ఆనందోత్సాహాలు కాల్పుల విరమణతో గాజా స్ట్రిప్‌లో ఆనందం వెల్లివిరిసింది. వలస వెళ్లిన పాలస్తీనియన్లు భారీగా గాజాకు తిరిగొస్తున్నారు. అయితే ఆదివారం ఉదయం దాకా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులు కొనసాగింది. దాంతో ఆదివారం ఒక్క రోజే 26 మంది మరణించారు. -
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇదేవిధమైన సానుకూలతతో స్పందించాలని ఆయన హమాస్‌ను కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. అలాగే, గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్‌పైనా ఆయన స్పందించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలకాంశాలు మూడు దశల్లో అమలవుతాయి. బ్లింకెన్ సోమవారం టెల్అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో రెండున్నర గంటలపాటు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ‘ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయం. శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు’అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయతి్నంచకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. బ్లింకెన్ మంగళవారం కైరో చేరుకుంటారు. ఈజిప్టు, అమెరికా తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కైరోలో చర్చలు జరుగుతున్నాయి. -
గాజాలో భీకర పోరు.. 210 మందికి పైగా మృతి!
జెరూసలెం/గాజా: సెంట్రల్ గాజాలో నుసెయిరత్‌లో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య పోరు భీకరంగా సాగుతోంది. శనివారం నుసెయిరత్, పరిసర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 210 మంది చనిపోయినట్టు సమాచారం! 400 మంది దాకా గాయపడినట్లు హమాస్‌ను ఉటంకిస్తూ అల్‌జజీరా పేర్కొంది. మృతుల్లో పలువురు చిన్నారులున్నట్లు తెలిపింది. డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది.నలుగురు బందీలకు విముక్తి..ఇలా ఉండగా, హమాస్ మిలిటెంట్ల చెర నుంచి బందీలను విడిపించుకునేందుకు గాజాపై యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆర్మీ పెద్ద విజయం నమోదు చేసుకుంది. నుసెయిరత్‌లో ఓ భవన సముదాయంపై శనివారం పట్టపగలే ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచి ఉంచిన నోవా అర్గామని(25), అల్మోగ్ మెయిర్ జాన్(21), ఆండ్రీ కొజ్లోవ్(27), ష్లోమి జివ్(40) అనే నలుగురు బందీలను సురక్షితంగా తీసుకొచ్చినట్లు తెలిపింది. తాజాగా రక్షించిన నలుగురితో కలిపి ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటి వరకు కాపాడిన బందీల సంఖ్య ఏడుకు చేరుకుంది. అమెరికా అందించిన సమాచారంతోనే బందీలను ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించి, రక్షించిందని బైడెన్ ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. గురు, శుక్రవారాల్లోనూ ఇజ్రాయెల్ దాడుల్లో డజన్ల మంది మరణించారు.ఆమె వీడియో వైరల్.. శనివారం ఐడీఎఫ్ రక్షించిన వారిలో అర్గామని అనే మహిళ ఉన్నారు. మిలిటెంట్లకు చిక్కిన బందీల్లో అర్గామనికి చెందిన వీడియోనే మొదటిసారిగా బయటకు వచి్చంది. ఇద్దరు మిలిటెంట్లు బైక్‌పై తీసుకెళ్తుండగా ‘నన్ను చంపకండి’అని ఆమె రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. బ్రెయిన్ కేన్సర్ ముదిరి మృత్యుశయ్యపై ఉన్న తనకు కూతురిని చూడాలని ఉందంటూ అర్గామని తల్లి లియోరా ఏప్రిల్‌లో ఒక వీడియో విడుదల చేశారు. చెర నుంచి విడుదలైన అర్గామనితో ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. బందీలందరినీ విడిపించేదాకా యుద్ధం ఆపబోమని స్పష్టం చేశారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
‘విరమణ’ మరో రెండు రోజులు
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య కుదిరిన నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం సోమవారం ముగిసింది. ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలను విడుదల చేశారు. ఇజ్రాయెల్ అధికారులు 117 మంది పాలస్తీనియన్ ఖైదీలను జైలు నుంచి విడిచిపెట్టారు. నాలుగో విడత కింద స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి తర్వాత మరికొంత మంది బందీలను హమాస్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. దీనిపై సంబంధిత బందీల కుటుంబ సభ్యులకు ఇజ్రాయెల్ అధికారులు సమాచారం ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులపాటు పొడిగించడానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సోమవారం వెల్లడించారు. ఒప్పందం పొడిగింపు అమల్లో ఉన్నన్ని రోజులు నిత్యం అదనంగా 10 మంది చొప్పున బందీలను హమాస్ వదిలేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇరుపక్షాలు ముందుగానే ఒక అవగాహనకు వచ్చాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే విషయంలో ఈజిప్టు, ఖతార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాయి. ఇజ్రాయెల్‌లో ఎలాన్ మస్క్ పర్యటన సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టి విమర్శల పాలైన ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ సోమవారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అక్టోబర్ 7న హమాస్ దాడిలో ధ్వంసమైన కిబుట్జ్ పట్టణాన్ని దర్శించారు. అక్కడి పరిస్థితిన పరిశీలించారు. ఈ సందర్భంగా మస్క్ వెంట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారు. -
Israel-Hamas war: మరో 17 మంది బందీల విడుదల
గాజా్రస్టిప్: ఇజ్రాయెల్–హమాస్ గ్రూప్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో సందిగ్ధత వీడింది. ఒప్పందానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉంటున్నాయి. మూడో విడత కింద ఆదివారం మరో 17 మంది బందీలకు హమాస్ విముక్తి కలిగించింది. వీరిలో 14 మంది ఇజ్రాయెలీలు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అలాగే 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ అధికారులు విడుదల చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హమాస్ మిలిటెంట్లు శనివారం బందీలను విడుదల చేయడానికి నిరాకరించారు. ఒప్పందం అమలుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఒప్పందం యథాతథంగా అమలవుతున్నట్లు కొన్ని గంటల తర్వాత తేటతెల్లమయ్యింది. శనివారం బందీల్లోని 13 మంది ఇజ్రాయెలీలను, నలుగురు థాయ్‌లాండ్ జాతీయులను హమాస్ విడుదల చేసింది. వీరిలో నాలుగేళ్ల అమెరికన్–ఇజ్రాయెలీ చిన్నారి అబిగైల్ ఎడాన్ కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులను అక్టోబర్ 7న మిలిటెంట్లు హత్య చేశారు. అమెరికా బందీలంతా సైతం అతిత్వరలో విడుదలవుతారని ఆశిస్తున్నామని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ చెప్పారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై అనూహ్యంగా దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 240 మందిని బందీలుగా మార్చి, గాజాకు తరలించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్–హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటిదాకా మూడు విడతల్లో మొత్తం 58 మంది బందీలకు హమాస్ స్వేచ్ఛ కలి్పంచింది. నాలుగో విడత కింద సోమవారం మరికొంత మంది విడుదల కానున్నారు. మరోవైపు శనివారం రాత్రి ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో ఇజ్రాయెల్ దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ సీనియర్ కమాండర్ హతం ఇజ్రాయెల్ దాడిలో హమాస్ సీనియర్ కమాండర్ అహ్మద్ అల్–ఘందౌర్(56) మృతి చెందాడు. ఈ విషయాన్ని హమాస్ ఆదివారం స్వయంగా ప్రకటించింది. అయితే, ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న సంగతి బయటపెట్టలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా మరణించిన హమాస్ కమాండర్లలో అహ్మద్ అల్–ఘందౌర్ అత్యంత పెద్ద హోదా ఉన్న నేత కావడం గమనార్హం. ఉత్తర గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తున్నాడు. హమాస్ సాయుధ విభాగంలో హై–ర్యాకింగ్ కలిగి ఉన్నాడు. 2002నుంచి ఇజ్రాయెల్ సైన్యం సాగించిన హత్యాయత్నాల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు. -
నిలిచిన బందీల విడుదల!
జెరుసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
Israel-Hamas war: తిరుగుబాటు గళానికి స్వేచ్ఛ
రమల్లా: ఆమె పేరు మారా. పాలస్తీనా యువతి. వయసు 24 ఏళ్లు. కానీ ఎదిగే దశలో అత్యంత కీలకమైన 8 ఏళ్లు ఇజ్రాయెల్ చెరలో జైలు గోడల నడుమ గడిపింది! వందేళ్లకు సరిపడా అనుభవాలు చవిచూసింది. టీనేజీలో అత్యంత అవసమైన అమ్మ ఆసరా కోసం ఎంతగానో అంగలార్చింది. అలాగని ధైర్యం మాత్రం కోల్పోలేదు. ఉత్తర ఇజ్రాయెల్‌లో తనను ఉంచిన డామన్ జైల్లోని పాలస్తీనా మహిళలు, మైనర్ల తరఫున గళమెత్తింది. చూస్తుండగానే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కీలక రాజకీయాంశంగా కూడా మారిపోయింది. దాంతో అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడి అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మారాను మరో జైలుకు మార్చి ఇతరులతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా ఉంచింది ఇజ్రాయెల్ ప్రభుత్వం! బందీల పరస్పర విడుదలలో భాగంగా శుక్రవారం ఇజ్రాయెల్ వదిలిపెట్టిన 39 మంది పాలస్తీనియన్లలో ఆమె కూడా ఉంది. లాంఛనాలన్నీ పూర్తై ఎట్టకేలకు శుక్రవారం రాత్రి విడుదలై రమల్లా చేరింది. తల్లి సౌసన్ అప్పటికే అక్కడ ఆమె కోసం క్షణమో యుగంగా ఎదురు చూస్తోంది. కూతురు వాహనం దిగుతూనే పరుగెత్తుకెళ్లి ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. ఎనిమిదేళ్ల ఎడబాటును తలచుకుంటూ వారిద్దరూ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లీకూతుళ్ల కలయికను చూసిన వాళ్లందరిలోనూ హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ‘‘నేను చెప్పలేదూ! నా కూతురు పోరాటాలతో రాటుదేలి అంతర్గత సౌందర్యంతో మెరిసిపోతోంది’’ అని పాలస్తీనా మీడియాతో చెబుతూ మురిసిపోయింది సౌసన్. స్కూలుకు వెళ్తుండగా... మారా స్వస్థలం ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న తూర్పు జెరూసలేం. కొద్ది దూరంలోని స్కూలుకు వెళ్లే క్రమంలో తూర్పు, పశి్చమ జెరూసలేం మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ వేను దాటాల్సి వచ్చేది. 2015 అక్టోబర్‌లో 16 ఏళ్ల టీనేజర్‌గా స్కూలుకు వెళ్తుండగా ఎక్స్‌ప్రెస్ వే మీద ఇజ్రాయెల్ సైన్యం ఆమెపై కాల్పులకు దిగింది. గాయాలతో పడున్న మారాను అరెస్టు చేసింది. ఇజ్రాయెలీ సైనికాధికారిని పొడిచేందుకు ప్రయతి్నంచిందన్న అభియోగాలపై ఎనిమిదిన్నరేళ్ల జైలు శిక్ష పడింది. చేతిని తూట్లు పొడిచిన 12 తూటా గాయాలు శాశ్వతంగా అవిటిగా మార్చేశాయి. జైల్లో రోజులు అత్యంత దుర్భరంగా గడిచాయి. ముఖ్యంగా ఓ టీనేజర్‌గా తల్లి తోడు అత్యంత అవసరమైన తొలి రోజులు!’’ అని తల్లి చేతులను గట్టిగా పట్టుకుంటూ గుర్తు చేసుకుంది మారా. కష్టాన్నైనా తట్టుకునే శక్తిని కూడా ఇచ్చాయని చెప్పుకొచ్చింది. -
Israel-Hamas War: కన్నలూ, నన్ను మిస్సయ్యారా!?
జెరుసలేం/టెల్ అవీవ్: శుక్రవారం రాత్రి వేళ. ఇజ్రాయెల్‌లోని ష్నెయ్డర్ పిల్లల ఆస్పత్రి. ప్రధాన ద్వారమంతటా భావోద్వేగ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 57 ఏళ్ల అవీ జిచ్రీ చాలాసేపటి నుంచి ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికీ ప్రధాన ద్వారం కేసి చూస్తూ గడుపుతున్నాడు. ఎట్టకేలకు అతని ఎదురుచూపులు ముగిశాయి. తొమ్మిదేళ్ల చిన్నారి ఒహద్ అతని వైపు మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చాడు. వస్తూనే, ‘నాన్నా!’ అంటూ గట్టిగా కరుచుకుపోయాడు. ఆ క్షణాన వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ వెనకే అవీ భార్య, తల్లి కూడా వచ్చి అతన్ని అమాంతం వాటేసుకున్నారు! ఆ పక్కనే ఉన్న 38 ఏళ్ల అషెర్దీ అతని పరిస్థితే! తన భార్య డొరాన్, కూతుళ్లు అవివ్ (4), రజ్ (2) ఆస్పత్రి ప్రాంగణంలో రెడ్ క్రాస్ వాహనం దిగీ దిగగానే వారి దగ్గరికి పరుగులు తీశాడు. ముగ్గురినీ బిగ్గరగా వాటేసుకున్నాడు. తనను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న కూతుళ్లను పదేపదే ఆప్యాయంగా తడిమి చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘కన్నలూ, నన్ను మిస్సయ్యారా? నన్నే తలచుకుంటూ బాధ పడ్డారు కదూ!’’ అంటూ కూతుళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు. 49 రోజుల హమాస్ నిర్బంధం నుంచి తొలి విడతలో విడుదలైన 13 మంది ఇజ్రాయెల్ బందీలు తమవారిని కలుసుకున్న సందర్భంలో కనిపించిన భావోద్వేగ సన్నివేశాలివి. వీటికి సంబంధించి ఆస్పత్రి విడుదల చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. అక్టోబర్ 7 నాటి మెరుపు దాడిలో వీరంతా హమాస్ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు. చిన్నారి ఒహద్ హమాస్ చెరలోనే తొమ్మిదో పుట్టినరోజు చేసుకోవడం విశేషం! ఆ రోజు ఇజ్రాయెల్ అంతా అతని పుట్టినరోజు వేడుకలు జరిపి సంఘీభావం ప్రకటించింది! ఒహద్తో పాటే అతని తల్లి, నాయనమ్మ విడుదలైనా తాతయ్య హమాస్ చెరలోనే ఉన్నాడు. ఎమిలియా అలోనీ అనే ఐదేళ్ల చిన్నారి కూడా తల్లితో పాటు విడుదలైంది. తమకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న నాయనమ్మను కలుసుకుని ఆనందంలో మునిగిపోయింది. -
Israel-Hamas war: 24 మంది బందీలకు స్వేచ్ఛ
గాజా స్ట్రిప్/జెరూసలేం: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గాజా స్ట్రిప్‌లో శుక్రవారం భూతల, వైమానిక దాడులు ఆగిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజాలో ఏడు వారాల తర్వాత ప్రశాంత వాతావరణం కనిపించింది. పాలస్తీనియన్ల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మానవతా సాయం, ఇంధనం గాజాకు చేరుకుంటోంది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాల చొరవతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కుదిరిన సంధి శుక్రవారం ఉదయం నుంచే అమల్లోకి వచి్చంది. తాత్కాలిక కాల్పుల విరమణ నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఒప్పందం మేరకు హమాస్ చెరలోని బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటిరోజు 13 మంది ఇజ్రాయెలీ బందీలకు హమాస్ మిలిటెంట్లు స్వేచ్ఛావాయువులు ప్రసాదించారు. వీరిలో ఆరుగురు వృద్ధులు, నలుగురు పిల్లలున్నారు. వారిని రెడ్‌క్రాస్ సంస్థకు అప్పగించారు. మొత్తం 24 మంది బందీలను హమాస్ విడిచిపెట్టిందని, వారిని 4 వాహనాల్లో ఈజిప్టుకు చేర్చామని రెడ్‌క్రాస్ వెల్లడించింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 10 మంది థాయ్‌లాండ్ పౌరులు, ఒకరు ఫిలిప్పైన్స్ పౌరుడున్నట్టు ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. విడుదలైన బందీలంతా ఆరోగ్యంగానే కనిపిస్తున్నారని ఇజ్రాయెల్ వైద్య శాఖ తెలియజేసింది. హమాస్ డిమాండ్‌ను నెరవేరుస్తూ ఇజ్రాయెల్ కూడా మొదటి దశలో 39 పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిందని సమాచారం. వీరిలో 24 మంది మహిళలు కాగా 15 మంది చిన్నారులు. వారిని తీసుకుని వాహనాలు వెస్ట్ బ్యాంక్‌లోని జైళ్ల నుంచి రమల్లాకు బయల్దేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 50 మంది బందీలకు హమాస్ విముక్తి కల్పించాల్సి ఉంది. అలాగే 150 మంది ఖైదీలను జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడిచిపెట్టాలి. ప్రస్తుతం 7,200 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్నారు. ‘ఉత్తరాది వలస’లపై కాల్పులు.. ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు ఆగిపోవడంతో దక్షిణ గాజా నుంచి జనం ఉత్తర గాజాకు కాలినడకన తిరిగివస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకొనేందుకు ఇజ్రాయెల్ సైన్యం ప్రయతి్నస్తోంది. శుక్రవారం పలుచోట్ల వారిపై కాల్పులు జరిపింది. ఎవరూ వెనక్కి వెళ్లొద్దంటూ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలియజేసింది. అక్టోబర్ 7న గాజాపై దాడులు మొదలైన తర్వాత ఇజ్రాయెల్ హెచ్చరికల వల్ల ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణభయంతో దక్షిణ గాజాకు వలసవెళ్లారు. వారంతా స్వస్థలాలకు తిరిగి రావాలని భావిస్తున్నారు. గాజాకు 1.30 లక్షల లీటర్ల డీజిల్ కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కావడంతో గాజాకు మానవతా సాయం చేరవేతలోనూ వేగం పెరిగింది. ఆహారం, నిత్యావసరాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, దుస్తులు తదితర సామగ్రితో దాదాపు 90 వాహనాలు శుక్రవారం ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ గుండా గాజాలోకి ప్రవేశించాయి. అలాగే 1.30 లక్షల లీటర్ల డీజిల్ కూడా గాజాకు అందింది. డీజిల్ లేక, జనరేటర్లు పనిచేయక గాజా ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి. కాల్పుల విరమణ అమల్లో ఉన్న నాలుగు రోజుల్లో రోజుకు 1.30 లక్షల లీటర్ల డీజిల్‌ను గాజాకు సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచి్చంది. వాస్తవానికి గాజాకు నిత్యం 10 లక్షల లీటర్ల డీజిల్ అవసరం. కాల్పుల విరమణ పొడగిస్తారా ? ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం నాలుగు రోజులపాటే అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒప్పందాన్ని పొడిగిస్తారని సమాచారం. హమాస్ చెరలో 240 మంది బందీలు ఉన్నారు. వారందరినీ విడుదల చేయించాలంటే నాలుగు రోజుల సమయం సరిపోదు. అందుకే ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. -
దాడుల్ని ఆపితే.. బందీలను వదిలేస్తాం: హమాస్
జెరూసలేం: గాజా ఆస్పత్రిపై దాడిలో వందల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో గాజా నగరం అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో ఉత్తర గాజా సగభాగాన్ని ప్రజలు ఇప్పటికే ఖాలీ చేశారు. దాడుల్లో హమాస్ టాప్ కమాండర్ కూడా హతమయ్యారు. ఈ క్రమంలో హమాస్ నుంచి కీలక ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ఇజ్రాయల్ దాడులను తక్షణమే నిలిపివేస్తే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ బందీలను వదిలేస్తామని ప్రకటన వెలువడినట్లు సమాచారం. హమాస్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి ఈ మేరకు తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం మంగళవారం భీకరరూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. హమాస్ దళాలకు చెందిన రాకెట్ దాడుల్లోనే ఆస్పత్రి కూలిపోయిందని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. 'మంగళవారం ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ దాడులు జరిపింది. అందులో విఫలమైన ఓ రాకెట్ ఆస్పత్రిపై పడింది. మా బలగాలు ఆ ఆస్పత్రిపై రాకెట్‌ను ప్రయోగించలేదు.' అని ఐడిఎఫ్(ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) తెలిపింది. #IsraelHamasConflict | Al Ahli Hospital hit by the Islamic Jihad terror organization. @PoojaShali with more details. #Isarael #Gaza #Hamas #IsraelPalestineConflict #HamasMassacre #HamasTerrorist | @GauravCSawant pic.twitter.com/DUOFYMRz9p — IndiaToday (@IndiaToday) October 18, 2023 ఆసుపత్రిపై జరిగిన దాడిని పాలస్తీనా అధికారులు ఊచకోతగా పేర్కొన్నారు. గాజాలో ఆసుపత్రిపై వైమానిక దాడిలో వందలాది మంది మరణించడంతో మూడు రోజుల సంతాప దినాలను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. 'మారణహోమం జరుగుతోంది. ఈ మారణకాండను ఆపడానికి అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలి. మౌనం ఇకపై ఆమోదయోగ్యంకాదు'అని పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ప్రకటన వెలువరించింది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌లో నోవా ఫెస్టివల్‌పై దాడులు ప్రారంభించాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడుల నుంచి తేరుకుని ఇజ్రాయెల్ హమాస్ దళాలపై తిరగబడింది. హమాస్ అంతమే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో జ్రాయెల్లో సైనికులు, మహిళలు, చిన్నారులతో సహా 1,400 మందికిపైగా జనం మరణించారు. హమాస్ దళాల చేతికి దాదాపు 200 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా చిక్కారు. గాజాలో 2,778 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 9,700 మందికి క్షతగాత్రులుగా మారారు. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
-
ఐసిస్ చెర నుంచి సురక్షితంగా..
14 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బయటపడిన తెలుగు ప్రొఫెసర్లు తీవ్రవాద స్థావరాలపై భద్రతా దళాల దాడితో విముక్తి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్/టెక్కలి : 14 నెలల కిందట ఐసిస్ తీవ్రవాదుల చేతుల్లో బందీలుగా చిక్కుకున్న హైదరాబాద్‌కు చెందిన తెలుగు ప్రొఫెసర్లు చిలువేరు బలరాంకిషన్, తిరువీధుల గోపీకృష్ణ ఎట్టకేలకు విడుదలయ్యారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తమ కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి తాము క్షేమంగా విడుదలయ్యామని, ప్రస్తుతం మిలటరీ రక్షణలో ఉన్నామని చెప్పారు. లిబియాలోని ట్రిపోలీకి 250 కి.మీల దూరంలో ఉన్న తాము భారత దౌత్య అధికారులను కలిశాక హైదరాబాద్ వస్తామన్నారు. వారిద్దరు సోమ లేదా మంగళవారాల్లో హైదరాబాద్ వచ్చే వీలుంది. ఊహించని రీతిలో గోపికృష్ణ, బాలరాం కిషన్ తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేయటంతో ఆ రెండు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలాయి. తమవారి విడుదలకు క ృషి చేసిన ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్య, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండియాకొస్తూ ఐసిస్ చెరలోకి.. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లా శనిగరం గ్రామానికి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ చిలువేరు బలరాంల కుటుంబాలు నగరంలోనే స్థిరపడ్డాయి. గోపీ భార్యపిల్లలు నాచారంలో, బలరాం భార్యాపిల్లలు ఆల్వాల్‌లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా లిబియాలో పనిచేస్తూ, స్వస్థలానికి తిరిగి వస్తున్న క్రమంలో 2015 జూలై 29న ట్రిఫోలి సమీపంలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో గోపీ భార్య కళ్యాణి, పిల్లలు జాహ్నవి, సాయికుమార్.. బలరాం కిషన్ భార్య శ్రీదేవి, పిల్లలు విజయభాస్కర్, మధుసూదన్ అనేక మార్లు కేంద్రమంత్రులు, మోదీని కలిసి విజ్ఞాపనలు చేశారు. ఇటీవల లిబియా దేశంలో అమెరికా సైనికులు ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట వీరు బందీలుగా ఉన్న స్థావరాలపై దాడులు చేయగా, వీరు సురక్షితంగా బయట పడినట్లు సమాచారం. గోపీ ఇంట్లో ఆనందం... ‘నేను గోపీకృష్ణను మాట్లాడుతున్నా. ఉగ్రవాదుల చేర నుంచి బయటపడ్డా. నేను క్షేమంగా ఉన్నా. మీరు క్షేమంగా ఉన్నారా?’ అంటూ గోపీకృష్ణ తన భార్య కళ్యాణితో బుధవారం అర్థరాత్రి ఫోనులో మాట్లాడారు. తాను అమెరికాకు చెందిన బలగాల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. ‘గోపీ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబంలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. ఇది అతడికి పునర్జన్మగా భావిస్తున్నాం’ అన్నారు. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో పాటు తండ్రి నారాయణరావుతోనూ మాట్లాడినట్లు తెలిపారు. భర్త పలకరింపుతో ఉద్వేగానికి గురైన శ్రీదేవి: ‘హలో... శ్రీదేవి నేను బలరాంను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు?’ అంటూ తెలియని నంబర్ నుంచి బుధవారం అర్ధరాత్రి వచ్చిన ఫోన్లో ఉద్వేగపూరితమైన గొంతుతో పలకరింపు ఇది. దీంతో ఒక్కసారిగా మూగబోరుున శ్రీదేవి గొంతు సంతోషంతో బదులిచ్చింది. తన భర్త దాదాపు అర నిమిషం సేపు అక్కడి సైన్యం ఇచ్చిన ఫోన్ ద్వారా తనతో మాట్లాడారని ఆమె చెప్పారు. ఇన్నాళ్లు అధికారులు, సహ ఉద్యోగులు బలరాం క్షేమంగా ఉన్నాడంటూ చెప్తున్నప్పటికీ గుబులుతోనే ఉన్న శ్రీదేవి మొఖంలో నిమజ్జనం రోజు ఆనందం వెల్లివిరిసింది. దీంతో ఇంటిల్లిపాదీ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెక్కలిలో సంబరాలు గోపికృష్ణ ఉగ్రవాదుల చెర నుంచి బయట పడినట్లు సమాచారం రావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నివాసముంటున్న ఆయన తల్లిదండ్రులు వల్లభ నారాయణరావు, సరస్వతి, అమ్మమ్మ మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే హైదరాబాద్ బయల్దేరుతామని ‘సాక్షి’కి చెప్పారు. సంకీర్ణ దళాలు కాపాడాయి: సుష్మా లిబియాలో ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఇద్దరు తెలుగు ఇంజినీర్లను రక్షించినట్లు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం ట్వీటర్లో తెలిపారు. ఐసిస్‌తో పోరాడుతున్న సంకీర్ణ బలగాలు సిర్త్ పట్టణంలో ఉగ్రవాదుల చెర నుంచి వీరిని విడిపించాయని.. ఇద్దరు ఇంజనీర్లూ క్షేమంగా ఉన్నారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌స్వరూప్ మీడియాకు తెలిపారు. అయితే డాక్టర్ రామమూర్తి ఇంకా ఉగ్రవాదుల చెరలో బందీగానే ఉన్నారని.. ఆయనను విడిపించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. తెలుగు ఇంజినీర్లు ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం అధికారులు మాట్లాడించారని ఆయన వివరించారు. మాకిది..మరో జన్మ ‘నెలలు గడిచాయి. ఆయన తప్పక తిరిగి వస్తారన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపించింది. మాకిది పునర్జన్మ. నా భర్త క్షేమంగా విడుదలయ్యానని ఫోన్ చేశాడు. ఈ 14 నెలలు నరకయాతన అనుభవించాము. దేవుని దయకు తోడు, ప్రధాని, సుష్మాస్వరాజ్ ప్రయత్నాలు ఫలించాయి. అందరికీ ధన్యావాలు. - కళ్యాణి(గోపీకృష్ణ భార్య) మా పూజలు ఫలించాయి ‘మా వారి కోసం నేను చేయని పూజ, వ్రతం లేదు. వాటన్నింటికి తోడు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రయత్నాలు కలిసి రావటంతో నా భర్త క్షేమంగా తిరిగొస్తున్నారు. మంచివాళ్లకు మంచే జరుగుతుందన్న విశ్వాసమే నన్ను, నా పిల్లల్ని ముందుకు నడిపింది. గాడ్ ఈజ్ గ్రేట్.’ - శ్రీదేవి(బలరాం భార్య)