
హామీ ఇస్తేనే పాలస్తీనా ఖైదీలను విడిచిపెడతాం
స్పష్టం చేసిన ఇజ్రాయెల్.. ఖండించిన హమాస్
టెల్ అవీవ్: ఇకపై బందీల విడుదల సమయంలో ఎలాంటి వేడుకలు నిర్వహించబోమంటూ హామీ ఇస్తేనే వందలాది మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. లేకుంటే ఖైదీల విడుదల ఆలస్యమవుతుందని తెలిపింది. బందీల విడుదల సమయంలో చేపట్టే వేడుకలు అవమానకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు, ఒఫెర్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలను తీసుకుని బయలుదేరిన వాహనాలు కొద్ది దూరమే వెళ్లి తిరిగి జైలుకు చేరుకున్నాయి. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్–హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. హమాస్ శనివారం ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం తెలిసిందే.
బదులుగా ఇజ్రాయెల్ తన జైళ్లలో ఉన్న 620 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాల్సి ఉంది. మాస్క్‌లు ధరించిన హమాస్ సాయుధులు బందీలను ప్రదర్శనగా వెంట తీసుకుని వేదికపైకి చేరుకోవడం, అక్కడ పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు గుమికూడటం వంటి వాటిపై ఐరాస, రెడ్‌క్రాస్‌లతోపాటు ఇతరులు కూడా అభ్యంతరం తెలిపారు. ‘ఇటువంటి వేడుకలు మా బందీల గౌరవాన్ని తక్కువ చేయడమే. సొంత ప్రచార ప్రయోజనం కోసం వారిని క్రూరంగా ఉపయోగించుకోవడమేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే, ఈ వ్యాఖ్యలను హమాస్ ఖండించింది.
కాల్పుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ బెంజమిన్ నెతన్యాహూపై ఆయన మండిపడ్డారు. ఒప్పందం ప్రకారమే మొదటి దశ ఒప్పందం గడువు ముగిసేలోగా వచ్చే వారం నలుగురు బందీల మృతదేహాలను అందజేస్తామన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. మిగిలి ఉన్న బందీలను సజీవంగా లేదా నిర్జీవంగా తీసుకువచ్చే విషయమై ప్రధాని నెతన్యాహూ భద్రతా సలహాదారులతో చర్చించి, నిర్ణయించనున్నారని ఓ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment