
హమాస్ ప్రకటన
కైరో: ఇజ్రాయెల్ బందీల విడుదల విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని హమాస్ తేల్చిచెప్పింది. మందుగా ఖరారు చేసిన ప్రణాళిక ప్రకారమే బందీలకు విముక్తి కల్పిస్తామని స్పష్టంచేసింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులు తమతో చెప్పారని వెల్లడించింది. ఈ మేరకు హమాస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం చూస్తే మరో ముగ్గురు బందీలు శనివారం విడుదల కాబోతున్నారు.
ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుందని హమాస్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని హమాస్ కొద్దిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే.
గాజాలో షెల్టర్లు నిర్మించుకొనేందుకు, విదేశాల నుంచి మానవతా సాయం సరఫరాకు అనుమతి ఇవ్వకపోతే బందీల విడుదలను ఆలస్యం చేస్తామని ప్రకటించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం బందీలను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, గాజాపై మళ్లీ దాడులు ప్రారంభమవుతాయని హమాస్‌ను హెచ్చరించారు. దీంతో హమాస్ మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హమాస్ ఇప్పటిదాకా 21 మంది బందీలను విడిచిపెట్టింది. అందుకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం 730 మంది పాలస్తీనా ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేసింది.