వెస్ట్‌ బ్యాంక్‌పై  పట్టు బిగించిన ఇజ్రాయెల్‌  | Israeli tanks move into the occupied West Bank | Sakshi
Sakshi News home page

వెస్ట్‌ బ్యాంక్‌పై  పట్టు బిగించిన ఇజ్రాయెల్‌ 

Published Mon, Feb 24 2025 5:35 AM | Last Updated on Mon, Feb 24 2025 5:35 AM

Israeli tanks move into the occupied West Bank

తమ బలగాలు ఏడాదిపాటు ఉంటాయని స్పష్టికరణ 

కబాటియా: గాజాలో హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడిక వెస్ట్‌ బ్యాంక్‌పై దృష్టి సారించింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండు రోజుల్లో భారీగా సైన్యాన్ని ఇక్కడికి తరలించింది. శరణార్థులుగా మారిన పాలస్తీనియన్లను తిరిగి వెస్ట్‌ బ్యాంక్‌లోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను క్రమేపీ విస్తరిస్తూ వచ్చింది. 

వెస్ట్‌ బ్యాంక్‌ నుంచి తమపై దాడులు పెరుగుతున్నందున ఈ ప్రాంతం నుంచి మిలిటెన్సీని రూపుమాపడమే లక్ష్యమని అంటోంది. అయితే, ఇక్కడున్న 30 లక్షల మందిని సైనిక పాలన కిందికి తేవడమే ఇజ్రాయెల్‌ ఉద్దేశమని పాలస్తీనియన్లు అంటున్నారు. ఇజ్రాయెల్‌ ఆర్మీ చేపట్టిన దాడుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం జరుగుతోందని, వేలాది మందికి నిలున నీడ కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇప్పటికే 40వేల మంది పాలస్తీనయన్లు జెనిన్‌ వంటి పట్టణ ప్రాంత శరణార్థి శిబిరాలను ఖాళీ చేసి వెళ్లిపోయారని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ తెలిపారు. దీంతో, అక్కడ కనీసం ఏడాదిపాటు ఉండేలా ఏర్పాట్లు చేయాలని మిలటరీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాలస్తీనియన్లను తిరిగి అక్కడికి రానిచ్చేది లేదని, ఉగ్రవాదాన్ని పెరగనివ్వబోమని చెప్పారు. అయితే, ఎంతకాలం పాలస్తీనియన్లను అడ్డుకుంటారో ఆయన స్పష్టం చేయలేదు. 

ఇజ్రాయెల్‌పై సాయుధ పోరుకు కేంద్ర స్థానంగా ఉన్న జెనిన్‌లోకి ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులను పంపించింది. 2002 తర్వాత ఇజ్రాయెల్‌ ట్యాంకులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌ దాడుల్లో సొంతప్రాంతాలను వదిలిన శరణార్థుల వారసులే ఈ శిబిరాల్లో ఉంటున్నారు. కాగా, దీర్ఘ కాలంపాటు ఇజ్రాయెల్‌ ఆర్మీ వెస్ట్‌ బ్యాంక్‌లో తిష్టవేయడం 2000 తర్వాత ఇదే మొదటిసారని ఐరాస కూడా అంటోంది.  

గాజాలో ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో వెస్ట్‌ బ్యాంక్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇజ్రాయెల్‌ కూడా ఈ ప్రాంతంపై పదేపదే దాడులకు పాల్పడింది. ఇక్కడ కనీసం 800 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది మిలిటెంట్లేనని ఆర్మీ పేర్కొంది. అయితే, గాజాతోపాటు లెబనాన్‌లోనూ యుద్ధం జరుగుతున్నందున సంకీర్ణ పక్షాల నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా ప్రధాని నెతన్యాహూ వెస్ట్‌ బ్యాంక్‌లో మిలిటెన్సీ అణచివేత చర్యలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో వెస్ట్‌ బ్యాంక్, గాజా, తూర్పు జెరుసలేంను ఇజ్రాయెల్‌ ఆక్రమించుకుంది. ఈ మూడు ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్నది పాలస్తీనియన్ల చిరకాల వాంఛ.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement