హమాస్ సానుకూలంగా స్పందించాలి: బ్లింకెన్
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇదేవిధమైన సానుకూలతతో స్పందించాలని ఆయన హమాస్‌ను కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.
అలాగే, గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్‌పైనా ఆయన స్పందించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలకాంశాలు మూడు దశల్లో అమలవుతాయి.
బ్లింకెన్ సోమవారం టెల్‌అవీవ్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో రెండున్నర గంటలపాటు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు.
‘ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయం. శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు’అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయతి్నంచకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. బ్లింకెన్ మంగళవారం కైరో చేరుకుంటారు. ఈజిప్టు, అమెరికా తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కైరోలో చర్చలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment