Cease-fire
-
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది
టెల్ అవీవ్: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఉన్న విభేదాలను తగ్గించే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఆమోదం తెలిపిందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఇదేవిధమైన సానుకూలతతో స్పందించాలని ఆయన హమాస్‌ను కోరారు. హమాస్ సంస్థ పెడుతున్న షరతులపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. అలాగే, గాజా గుండా వెళ్లే ప్రధాన రహదారిపై పెత్తనం తమకే ఉండాలని ఇజ్రాయెల్ చేస్తున్న డిమాండ్‌పైనా ఆయన స్పందించలేదు. గతేడాది అక్టోబర్ నుంచి హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ విడుదల చేయడం, బదులుగా గాజా నుంచి ఇజ్రాయెల్ ఆర్మీ ఉపసంహరణ, ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా ఖైదీల విడుదల వంటి కీలకాంశాలు మూడు దశల్లో అమలవుతాయి. బ్లింకెన్ సోమవారం టెల్అవీవ్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో రెండున్నర గంటలపాటు విస్తృతస్థాయి చర్చలు జరిపారు. అనంతరం బ్లింకెన్ మీడియాతో మాట్లాడారు. యుద్ధం కారణంగా పడుతున్న కడగండ్ల నుంచి పాలస్తీనియన్లకు విముక్తిని, హమాస్ చెరలో మగ్గుతున్న బందీలకు స్వేచ్ఛను ప్రసాదించే కాల్పుల విరమణ ఒప్పందం ఖరారుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ‘ఇది నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు ఎంతో అనువైన సమయం. శాంతిని, సుస్థిరతను సాధించేందుకు బహుశా ఇదే చివరి అవకాశం కావచ్చు’అని వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఎవరూ ప్రయతి్నంచకుండా చూసుకోవడం కూడా అవసరమని ఇరాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపిస్తే ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. బ్లింకెన్ మంగళవారం కైరో చేరుకుంటారు. ఈజిప్టు, అమెరికా తదితర దేశాల మధ్యవర్తిత్వంతో కైరోలో చర్చలు జరుగుతున్నాయి. -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
కొలంబియాలో కాల్పుల విరమణ
బొగోటా: కొలంబియాలో చారిత్రక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో గత 52 ఏళ్లుగా రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్ఏఆర్సీ) తిరుగుబాటు దారులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సాయుధ పోరుకు తెరపడింది. ఈ పోరులో ఇంతవరకు 2 లక్షల 50 వేలమందికి పైగా మరణించారు. పూర్తిస్థాయి కాల్పుల విరమణ ఒప్పందం ఆగస్టు 29 అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కొలంబియా అధ్యక్షుడు జువాన్ మాన్యుయల్, ఎఫ్ఏఆర్సీ అధినేత తిమోలియన్ జిమినెజ్ ప్రకటించారు. ‘మేము తుపాకులకు విశ్రాంతి కల్పిస్తున్నాం. ఎఫ్ఏఆర్సీతో యుద్ధం ముగిసిపోయింది’ అంటూ అధ్యక్షుడు మాన్యుయెల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. -
కాల్పులపై పిటిషన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: చిత్తూరు శేషాచల అడవుల్లో జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీల దుర్మరణంపై సీబీఐచే విచారణ జరిపించాలని విడుదలై చిరుతైగళ్ కట్చి అధ్యక్షులు తిరుమాళవన్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాల్పుల ఘటనపై తమిళనాడు ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని, విచారణ పేరుతో పిలుచుకుపోయి హత్యచేసినట్లు తాము భావిస్తున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేగాక ఎంతోమంది ఆచూకీలేదని తెలిపారు. కనిపించనివారి ఆచూకీ, అసలు స్మగ్లర్ల పేర్లను బైటపెట్టాలని, కాల్పుల ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాజకీయనేతల హస్తాన్ని వెలుగులోకి తేవాలని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచేలా ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు ఈనెల 20వ తేదీన విచారణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. జలియన్‌వాలాబాగ్ కంటే ఘోరం: శరత్‌కుమార్ స్వాతంత్య్ర పోరాట సమయంలో జలియన్‌వాలాబాగ్‌లో జరిగిన కాల్పుల కంటే ఘోరంగా తమిళ కూలీలను హతమార్చారని అఖిలభారత సమత్తువ మక్కల్ కట్చి (ఏఐవీసీకే) అధ్యక్షులు, ఎమ్మెల్యే శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. కాల్పుల ఘటనపై శుక్రవారం వీసీకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన జరిపింది. చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన శరత్‌కుమార్ మాట్లాడుతూ అమాయక కూలీలపై కాల్పుల ఘటన తమిళనాడు ప్రజల గుండెను పిండేసిందని అన్నారు. కూలీలు చెట్లు నరుకుతుండగా కాల్పు లు జరగలేదు, చేతులు, కాళ్లు కట్టివేసి చిత్రవధకు గురిచేసి పథకం ప్రకారం హతమార్చారని ఆయన ఆరోపించారు. కూలీల మరణం పట్ల విచారం వ్యక్తం చేయకపోగా నిందలు వేయడం సరికాదని ఏపీ అటవీశాఖా మంత్రి బొజ్జలకు హితవు పలికారు. తమిళ ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లో రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనతో తమిళనాడు యావత్తు తల్లడిల్లుతుంటే ప్రధాని నరేంద్రమోదీ ఏమీ పట్టనట్లుగా విదేశాలు తిరుగుతున్నారని విమర్శించారు. కాల్పులపై సీబీఐ విచారణ కు ఆదేశించాలని, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని శరత్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దిక్కులేనివారమైనాము - సంక్షేమ బోర్డుతో బాధిత కుటుంబాల ఆవేదన ఇంటి పెద్దదిక్కును దారుణంగా పొట్టనపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం వల్ల తాము దిక్కులేని వారమైనామని మృతుల కుటుంబీకులు బోరుమన్నారు. చెన్నై చేపాక్‌లోని ప్రభుత్వ అతిధి గృహంలో జాతీయ కొండప్రాంత ప్రజల సంక్షేమ బోర్డు సహాయ కమిషనర్ రవి ఠాకూర్ బాధిత కుటుంబాలను శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు హాజరై తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కల్లుకట్టుకు చెందిన మృతుడు శశికుమార్ భార్య రంజితం, తల్లి పూంగొడి ఇతర కుటుంబ సభ్యులు కమిషన్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. రంజితం మాట్లాడుతూ ఏర్కాడుకు వెళ్లివస్తానని చెప్పి బయలుదేరిన తన భర్త ఇక తిరిగిరాలేదని వాపోయింది. తన భర్త శవాన్ని పరిశీలించగా, ముఖం కాలినట్లు కమిలిపోయి ఉందని, కళ్లలోని గుడ్లను తొలగించారని, కాళ్లు, చేతులు విరిగి ఉన్నాయని ఆమె తెలిపింది. భర్త మృతితో తాము దిక్కులేని వారయ్యామని ఆదుకోవాలని కోరింది. గత ఏడాది ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారు గత ఏడాది సెప్టెంబరు 25వ తేదీన ఏపీ పోలీసులు తమ ప్రాంతానికి చెందిన ముగ్గురిని కాల్పులతో హతమార్చారని తిరువణ్ణామలై జిల్లా జవ్వాదికొండ గ్రామానికి చెందిన మృతుడు చిన్నస్వామి భార్య మలర్ చెప్పింది. విజయకాంత్ (25), శివ (25), వెంకటేష్ (27) ఆనాటి కాల్పుల్లో మృతిచెందగా ఏపీ ప్రభుత్వం నుంచి నేటికీ నష్టపరిహారం అందలేదని మృతుల భార్యలు పవిత్ర, రేఖ, తల్లి పూమల్లి కమిషనర్‌కు చెప్పారు. ఇలా రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బాధిత కుటుంబాల నుంచి తీసుకున్న వాంగ్మూలాన్ని నమోదుచేశారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతూ బాధితుల అందజేసిన వివరాలను జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అందజేస్తామని, ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివరాలు ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం మొత్తాన్ని పెంచాలని, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సిఫార్సు చేస్తామని చెప్పారు. -
మహారాష్ట్రపై కాదు పాక్ ఆగడాలపై దృష్టి పెట్టండి
మోదీకి శివసేన సలహా ముంబై: ప్రధాని మోదీపై శివసేన దాడి తీవ్రమైంది. ఆయన మహారాష్ట్ర రాజకీయాలపై కాకుండా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాక్ ఆగడాలపై దృష్టి సారించాలని బుధవారం శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది. సీమాంతర కాల్పులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడంతోపొరుగుదేశం బరితెగిస్తోందని విమర్శించిం ది. కేంద్రంలో ఉండాల్సిన మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉండడం దేశ భద్రతను నిర్లక్ష్యం చేయడమేనంది. దేశాన్ని కాపాడుకోవడానికి 56 అంగుళాల ఛాతీ అక్కర్లేదని, దృఢసంకల్పం ఉంటే చాలని పేర్కొంది. -
మళ్లీ సరిహద్దుల్లో అలజడి
చేసిన తప్పే చేయడం పాకిస్థాన్‌కు బాగా అలవాటైన విద్య. భారత్‌తో గిల్లికజ్జాలకు దిగడం కొరివితో తల గోక్కున్నట్టేనని 67 సంవత్సరాలుగా ఎన్నోసార్లు రుజువైనా మళ్లీ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్దా, అంతర్జాతీయ సరిహద్దు వద్దా ఇప్పుడు సాగుతున్న కాల్పులకూ, గతంలో సాగించిన కాల్పులకూ మధ్య తేడా ఉన్నది. పాకిస్థాన్ సైన్యం గురి పౌర ప్రాంతాలవైపుకాక సైనిక శిబిరాలపై ఉండేది. వాటిని ధ్వంసం చేయడంద్వారా మన సైన్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించేది. అయితే, గత కొన్ని రోజులుగా పాక్ చేస్తున్నది వేరు. సైనిక శిబిరాలతోపాటు నేరుగా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది. జమ్మూ, రాజౌరి, పూంచ్, కతువా జిల్లాలోని పలుగ్రామాల ప్రజలు ఈ కాల్పుల మోతతో కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మెషీన్ గన్లతో, మోర్టార్లతో సాగిస్తున్న ఈ కాల్పుల్లో ఇంతవరకూ ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది కొంపాగోడూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 40 సైనిక శిబిరాలతోపాటు ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఏటా శీతాకాలం సమీపించే ముందు ఇలా కాల్పులకు దిగడం పాకిస్థాన్‌కు అలవాటు. ఆ కాల్పుల మాటున ఉగ్రవాదులను మన భూభాగంలో ప్రవేశపెట్టడం, ఇక్కడ అలజడులు సృష్టించడం వారి ఉద్దేశం. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో తన వ్యూహాన్ని మార్చుకుంది. సంవత్సరం పొడవునా కవ్వింపు చర్యలను కొనసాగిస్తున్నది. తాజాగా జమ్మూ సెక్టార్లో ఈ నెల 1న కాల్పుల విరమణ ఉల్లంఘనలు మొదల య్యాయి. బక్రీద్ పండుగ సందర్భాన్ని కూడా చూడకుండా పాకిస్థాన్ సైన్యం 18సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. ఇలాంటి కాల్పులు సంభవించినప్పుడల్లా ఇరుదేశాల సైనిక ఆపరే షన్ల డెరైక్టరేట్ జనరళ్లు హాట్లైన్లో సంభాషించుకునేవారు. తాత్కాలికంగానైనా ప్రశాంతత ఏర్పడేది. ఈసారి మాత్రం పాక్ మొండికేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు మీవైపే మొదలయ్యాయని దబాయించింది. వాస్తవానికి పాక్ కవ్వింపు చర్యల తర్వాతనే భారత జవాన్లు అప్రమత్తమై ప్రతి దాడులు చేశారు. ఈ కాల్పుల్లో ఇంతవరకూ పాక్ వైపు 15మంది మరణించారు. దాయాది దేశాలైనందువల్ల భారత్, పాక్‌ల మధ్య ఈ పోరు తప్పడంలేదు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందయితే ఈ కాల్పులవల్ల ఇరువైపులా ఏటా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు. సరిహద్దు గ్రామాలన్నీ దాదాపు నిర్మానుష్యమయ్యేవి. ఈ స్థితి మారాలన్న సంకల్పంతో రెండు దేశాలూ చర్చలు ప్రారంభించి ఒక అంగీకారానికి రాబట్టే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దానితోపాటే ఉల్లంఘనలూ నడుస్తున్నాయి. 2012లో 114సార్లు ఇలాంటి ఉల్లంఘనలు సంభవిస్తే నిరుడు అవి 347కు చేరుకున్నాయి. ఈ తొమ్మిదినెలల కాలంలో ఇంతవరకూ 334సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా తరచు ఈ ఉల్లంఘనలు సాగినా మునుపటితో పోలిస్తే ప్రాణనష్టం చాలావరకూ తగ్గింది. కనుక వైషమ్యాలు తలెత్తినప్పుడు శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించడమే ఎప్పుడైనా ఉత్తమం. అయితే, రెండు పక్షాల్లోనూ దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటిది సాధ్యంకాదు. 2003లో ఇరు దేశాల్లోని రాజకీయ నాయకత్వమూ ఈ విషయంలో గట్టిగా ప్రయత్నించాయి గనుక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తర్వాత కాలంలో పాక్ సైన్యం దీనికి గండికొట్టేందుకు ఎంత ప్రయత్నించినా పరిమిత స్థాయిలో మాత్రమే విజయం సాధించగలిగింది. భారత్‌తో సామరస్యపూర్వక సంబంధాలకు పౌరప్రభుత్వం చేసే ఏ ప్రయత్నాన్నయినా సైన్యం వమ్ము చేయడానికి చూడటం అక్కడ మామూలే. ఇటీవల సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అది తన మాటను నెగ్గించుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. అందువల్లే ఇదే అదనుగా పాక్ సైన్యం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు కనబడుతున్నది. ఎల్ఓసీ వద్ద పాక్ సైన్యం నెలకొల్పిన 20 శిబిరాల్లో 2,000మంది ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుకూలమైన స్థితి ఏర్పడటం కోసమే పాక్ సైన్యం తహతహలాడుతున్నదని తాజా కథనాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక పాకిస్థాన్‌తో సామరస్య వాతావరణం ఏర్పడటానికి కృషి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీకి రంగం సిద్ధమైంది. అయితే, మన ప్రభుత్వం సలహాను విస్మరించి పాక్ హైకమిషనర్ హురియత్ నాయకులతో సమావేశం కావడంతో ఈ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. తాజా ఘర్షణల నేపథ్యంలో మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ త్రివిధ దళాధిపతులతో సమావేశం కావడం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించడం చూస్తే పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు అర్ధమవుతుంది. సమస్యలు తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, వాటి పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించడం చాలా అవసరం. సరిహద్దుల్లో ప్రశాంతతను భగ్నం చేయడానికి పాక్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి వెల్లడించి ఆ దేశాన్ని ఏకాకిని చేయాలంటే చర్చల ప్రక్రియ తప్ప మార్గం లేదు. దీనివల్ల తమకు జరిగే నష్టం ఏమిటో తెలుసుగనుకే చర్చల ప్రక్రియకు తూట్లు పొడిచేలా పాక్ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలను ప్రేరేపిస్తున్నది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. మన వ్యూహం అలాంటి దుష్టపన్నాగాలను తిప్పికొట్టే దిశగా ఉండాలి. -
కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం!
గాజా: ఇజ్రాయెల్, హమస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే, మూడు రోజుల విరమణ ఒప్పందం పూర్తికాగానే.. బుధవారం రాత్రి గాజా నుంచి రాకెట్ దాడులు ప్రారంభమయ్యాయి. ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో సమాధానమిచ్చింది. కానీ, అదృష్టవశాత్తూ కాసేపటికే ఆ దాడులు సద్దుమణిగాయి. ఇరు వర్గాలు సంయమనం పాటించాయి. కాల్పుల విరమణ కొనసాగిస్తామని ప్రకటించాయి. దాంతో సోమవారం అర్ధరాత్రి వరకు గాజాలో శాంతి నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్, హమస్‌ల మధ్య శాంతి చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని పాలస్తీనా తరఫున చర్చల్లో పాల్గొంటున్న అజమ్ అల్ అహ్మద్ తెలిపారు. -
72 గంటల కాల్పుల విరమణ
ఈజిప్టు విజ్ఞప్తికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం గాజా/జెరూసలెం: గాజాలో గత 29 రోజులుగా జరుగుతున్న భీకర దాడులకు తాత్కాలిక విరామం లభించింది. కాల్పుల మోతలు, క్షిపణి దాడులతో దద్దరిల్లిన గాజాలో మంగళవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గాజాలో 72 గంటలపాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ ప్రతిపాదనకు సోమవారం అర్ధరాత్రి దాటాక ఇరు పక్షాలు ఒప్పుకున్నాయి. మంగళవారం ఉదయం ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ గాజా నుంచి తమ సైనికులను ఉపసంహరించింది. ఇరుపక్షాల దాడుల్లో 1,900 మంది పాలస్తీనావాసులు, ముగ్గురు సైనికులు సహా 67 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో 392 మంది చిన్నారులు మృతిచెందారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దాడుల వల్ల తమకు సుమారు 24 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని పాలస్తీనా అధికారులు తెలిపారు. రూ. 1,369 కోట్ల అదనపు సాయం స్వల్పశ్రేణి రాకెట్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఐరన్ డోమ్ క్షిపణి రక్షక వ్యవస్థను సమకూర్చుకునేందుకు అమెరికా రూ. 1,369 కోట్ల అదనపు నిధులను అందించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై ఒబామా సంతకం చేశారు.