72 గంటల కాల్పుల విరమణ
ఈజిప్టు విజ్ఞప్తికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకారం
గాజా/జెరూసలెం: గాజాలో గత 29 రోజులుగా జరుగుతున్న భీకర దాడులకు తాత్కాలిక విరామం లభించింది. కాల్పుల మోతలు, క్షిపణి దాడులతో దద్దరిల్లిన గాజాలో మంగళవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గాజాలో 72 గంటలపాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ ప్రతిపాదనకు సోమవారం అర్ధరాత్రి దాటాక ఇరు పక్షాలు ఒప్పుకున్నాయి. మంగళవారం ఉదయం ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ గాజా నుంచి తమ సైనికులను ఉపసంహరించింది. ఇరుపక్షాల దాడుల్లో 1,900 మంది పాలస్తీనావాసులు, ముగ్గురు సైనికులు సహా 67 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. ఇజ్రాయెల్ దాడుల్లో 392 మంది చిన్నారులు మృతిచెందారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దాడుల వల్ల తమకు సుమారు 24 వేల కోట్ల నుంచి రూ. 36 వేల కోట్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని పాలస్తీనా అధికారులు తెలిపారు.
రూ. 1,369 కోట్ల అదనపు సాయం
స్వల్పశ్రేణి రాకెట్ దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఐరన్ డోమ్ క్షిపణి రక్షక వ్యవస్థను సమకూర్చుకునేందుకు అమెరికా రూ. 1,369 కోట్ల అదనపు నిధులను అందించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై ఒబామా సంతకం చేశారు.