
గాజాలో అమలవుతున్న కాల్పుల విరమణ
టెల్ అవీవ్: హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్‌జరిమ్ కారిడార్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ గాజా ప్రాంతాలను నెట్‌జరిమ్ కారిడార్ విడదీస్తుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరాటం, ఆంక్షల కారణంగా లక్షలాదిమంది పాలస్తీనియన్లు దక్షిణ భాగంలో చిక్కుకుపోయారు. ఒప్పందంలో భాగంగా వీరిని నెట్‌జరిమ్ మీదుగా తిరిగి ఉత్తర గాజాలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ అనుమతిస్తుంది.
ఇందులో భాగంగానే బలగాల ఉపసంహరణ అమలైంది. అయితే, ఆదివారం ఎన్ని బలగాలు వెనక్కి వెళ్లిపోయిందీ ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మొత్తం 42 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు సగం రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం..22వ రోజైన ఆదివారం గాజాలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలి. గాజాలోని దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లే పాలస్తీనియన్లను ఎలాంటి తనిఖీలు జరపకుండా ఇజ్రాయెల్ బలగాలు అనుమతించాల్సి ఉంటుంది. మొదటి విడతలో హమాస్ తమ వద్ద ఉన్న 33 మంది ఇజ్రాయెలీలను విడతల వారీగా విడిచిపెట్టాల్సి ఉంది.
ఒప్పందం పొడిగింపు ప్రశ్నార్థకమే
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు ఇరుపక్షాలు మరోసారి చర్చలు ప్రారంభించాల్సి ఉంది. పొడిగింపుపై ఏకాభిప్రాయం కుదిరిన పక్షంలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న మొత్తం ఇజ్రాయెలీలకు, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనియన్లకు స్వేచ్ఛ లభించనుంది. మళ్లీ చర్చలపై ఇరుపక్షాలు ఆసక్తి కనబరచక పోవడంతో కాల్పుల విరమణ పొడిగింపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ కీలక మధ్యవర్తిగా ఉంది.
ఈ దఫా చర్చలకు తక్కువ స్థాయి అధికారులను ఖతార్‌కు పంపనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశాలపై ఆశలు వదులుకోవాల్సిందేనంటున్నారు పరిశీలకులు. ఈ వారంలో నెతన్యాహూ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, ఒప్పందంపై చర్చిస్తారని భావిస్తున్నారు. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంలో స్పష్టత రాలేదు. 2023 అక్టోబర్ 7న హమాస్ మెరుపుదాడులు జరిపి 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకుపోవడంతో ఇరుపక్షాల మధ్య యుద్ధం మొదలుకావడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment