అభిప్రాయం
కొత్తగా దక్షిణాఫ్రికాతో తగువు ప్రారంభించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అందుకు ఆరంభం ఫిబ్రవరి 3న జరిగింది. దానికి ఆయన చెప్తున్న కారణాలు మూడు: ఒకటి, అక్కడి శ్వేతజాతీయుల భూములను సిరిల్ రామఫోసా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటున్నది. రెండు– తెల్లవారిపట్ల వివక్ష చూపుతున్నది. మూడు– అమెరికాపై, దాని మిత్ర దేశాలపై అంతర్జాతీయంగా వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నది.
ఇవిగాక, తెల్లవారి విషయంలో ‘చాలా చెడ్డ పనులు చేస్తున్నది’ అని కూడా అన్నారాయన. దక్షిణాఫ్రికాలోని తీవ్ర వాద శ్వేతజాతీయుల సంస్థలు కొన్ని తమపై ‘సామూహిక హత్యా కాండలు సాగుతున్నట్లు’ 1994లో అక్కడ వర్ణ వివక్ష (అపార్థీడ్’) ముగిసినప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. ‘చెడ్డ పనులు’ అనటంతో ట్రంప్ ఉద్దేశం అదేనేమో తెలియదు.
భూమి చట్టంతో మొదలు...
ఈ విధమైన ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ఆ విషయమై విచారణలు చేస్తున్నామనీ, అవి నిజమైతే దక్షిణాఫ్రికాకు తమ సహాయాన్ని నిలిపి వేయగలమనీ హెచ్చరించారు. ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకోవటం వేరు. అంతకన్నా ముందే సహాయం ఆపివేయటం వంటి చర్యలు మొదలై పోయాయి.
జీ–20కి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రామఫోసా త్వరలో జొహాన్నెస్‌బర్గ్‌లో నిర్వహించనున్న శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనబోవటం లేదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ప్రకటించేశారు. హెచ్‌ఐవీ చికిత్సల కోసం తాము చేసే ఆరోగ్య సహాయాన్ని ట్రంప్ ఆపివేశారు. దక్షిణాఫ్రికాలోనే పుట్టి పెరిగిన ట్రంప్ ముఖ్య సలహా దారు ఎలాన్ మస్క్, ట్రంప్ తరహా ఆరోపణలు, హెచ్చరికలు రెండు రోజులకొకసారి చేస్తున్నారు. దక్షిణాఫ్రికా శరణార్థుల కోసం శిబిరాలు సిద్ధం చేయాలంటూ ట్రంప్ తమ అధికారులను ఆదేశించారు కూడా!
మరొకవైపు, అమెరికా అధ్యక్షుని ఆరోపణలలో ఎంతమాత్రం నిజం లేదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు తోసిపుచ్చారు. ఆఫ్రికాలోగల తీవ్రమైన భూమి సమస్యల దృష్ట్యా ‘నిరుపయోగం’గా ఉన్న భూముల స్వాధీనానికి రామఫోసా ప్రభుత్వం గత నెల ఒక చట్టం చేసింది. నిజానికి ఇటువంటి చట్టాన్ని స్వయంగా అమెరికా కూడా 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన విషయాన్ని రామఫోసా గుర్తు చేస్తున్నారు. ఇండియా మొదలైన అనేక దేశాలలోనూ ఈ చట్టాలు న్నాయి.
ఇక తెల్లవారి పట్ల వివక్షలు, హత్యాకాండలున్నట్లు వారి సంస్థలు ఆరోపణలు చేయటం మినహా ఎటువంటి ఆధారాలూ చూపటం లేదు. ఈ మాట రామఫోసా ప్రభుత్వమే కాదు, దక్షిణాఫ్రి కాకు చెందిన ప్రజాస్వామిక శ్వేతజాతి వర్గాలు, పార్టీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు అంటున్నదే! అట్లాంటి దేమీ లేదని నేను స్వయంగా అక్కడికి వెళ్లినపుడు గమనించాను.
అటువంటి స్థితిలో ట్రంప్ విపరీత వైఖరికి కారణమేమిటి? ప్రధానంగా ఆయన శ్వేతజాతి దురహంకారి కావటమనిపిస్తున్నది. తను మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు (2017–21) కూడా రక రకాల ఆరోపణలు చేశారు. అప్పటికి దక్షిణాఫ్రికాలో ఈ చట్టం లేదు. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతి తీవ్రవాద సంస్థలు తరచుగా అమె రికా సహా పాశ్చాత్య దేశాలకు వెళ్లి లాబీయింగ్‌లు చేస్తుండేవారు. వారి వాదనలను డెమోక్రాట్లు, రిపబ్లికన్ల ప్రభుత్వాలు పట్టించు కోలేదు. తమ వంటి లక్షణాలు గల ట్రంప్ అధికారానికి వచ్చిన తర్వా తనే అందుకు విలువ ఇస్తున్నారు. ఇందుకు ఈసారి మరొక మూడు కారణాలు చేరాయి.
ఒకటి– గాజాలో ఇజ్రాయెల్ మారణ కాండపై ప్రపంచంలో మొదట దక్షిణాఫ్రికాయే చొరవ తీసుకుని అంతర్జా తీయ న్యాయస్థానం (ఐసీజే)లో కేసు వేయటం. రెండు– అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించి బహుళ ధ్రువ ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా భాగస్వామి కావటం. మూడు– ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంపెనీలో 30 శాతం భాగస్వామ్యాన్ని స్థానిక నల్లవారికి ఇవ్వాలన్న షరతు. వాస్తవానికి ఇటువంటి భాగ స్వామ్య నిబంధన అక్కడి టెలికాం లైసెన్సింగ్ చట్టంలో గతం నుంచి ఉంది. తనను మినహాయించాలన్నది మస్క్ వాదన. దానిని ట్రంప్ బలపరుస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వంనిరాకరిస్తున్నది.
అన్నీ ఉన్నా వివక్షేనా?
పోతే, 1994లో అపార్థీడ్, శ్వేతజాతి పాలన ముగిసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయవలసి వచ్చిందన్నది అర్థం చేసుకోవలసిన విషయం. యూరోపియన్లు దక్షిణాఫ్రికాకు రావటం 1600వ సంవత్సరంలో మొదలు కాగా, వారు భూములను అత్యధిక భాగం ఆక్రమించుకున్నారు.
వేర్వేరు యూరోపియన్ల మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1948లో శ్వేతజాతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకుముందే 1913, 1936లో భూమి చట్టాలు చేసి, మొత్తం భూములలో 87 శాతం తెల్లవారికి రిజర్వ్ చేశారు. ఆ పరిస్థితి 1994లో నల్లవారి ప్రభుత్వం ఏర్పడినా కొనసాగుతూనే వచ్చింది.
ఇంకా చెప్పాలంటే, వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా క్రమంగా శ్వేతజాతీయుల పరం కాసాగాయి. ఇది నేను అక్కడి ప్రభుత్వ రికార్డులను బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో, తెల్లవారిలోని ఆఫ్రికానర్ల ప్రస్తావన ప్రత్యేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వలస వచ్చిన జాతీయులను ‘ఆఫ్రికానర్లు’ అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం నాలుగు. భూములలో అధిక భాగం, ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన భాగం వారి అధీనంలోనే ఉన్నాయి. అయినా వివక్ష అని మాట్లాడతారు.
ఉదాహరణకు అక్కడ నేనుమౌంటేన్ ఫాక్స్ అనే పేరిట గల డచ్ వారి వ్యవసాయ క్షేత్రాన్ని చూశాను. ఆ కుటుంబానికి 740 ఎకరాలకు పైగా ఉంది. సొంత వైన్ యార్డ్, అందులో పండించే ద్రాక్షతో సొంత బ్రాండ్ సారాయి ఉన్నాయి. కొన్ని వాహనాలతో రవాణా కంపెనీ ఉంది. ఒక మధ్య తరహా హోటల్, ఒక బొటిక్ ఉన్నాయి. అయినా తమ ఆఫ్రికానర్ల పట్ల వివక్ష ఉందని వాపోతూ హాలండ్‌కు తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు.
అందుకు కారణం? తమ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం వెళితే, అక్కడి కోటాల ప్రకారం ఆ ఉద్యోగం ఒక నల్లవాడికి ఇచ్చారట! అదీ వారనే వివక్ష. ఒక్కొక్కరి వద్ద వేలాది ఎకరాలుండటాన్ని, రహదారుల వెంట ఎంతదూరం వెళ్లినా కంచెలు వేసి పడావు పడటాన్ని చూశాను. పేదరికం వల్ల కొద్దిపాటి భూములు కూడా అమ్ముకుని నగరాలకు వలస వస్తూ చిల్లర పనులతో జీవిస్తున్న నల్లవారినీ కలిసి మాట్లాడాను.
ఈ పరిస్థితులలో నల్లవారికి భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దానితో ముడిబడిన పేదరికం వల్ల అసంతృప్తి పెరుగుతున్నది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) మొదటిసారిగా సొంత మెజారిటీ కోల్పోవటానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామఫోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటం అనివార్యమైంది.
అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణాఫ్రికా ‘మానవ హక్కులను హరిస్తున్న’దనే గొప్ప మాట అన్నారు. అపార్థీ డ్‌ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కెనడా, గ్రీన్‌లాండ్, పనామా వంటి ఇతర దేశాలను ఆక్రమించుకోగలమని బాహాటంగా ప్రకటించే ట్రంప్, తెల్లవారి భూమి హక్కులంటూ ఇంతగా మాట్లాడటాన్ని బట్టి ఆయన తత్త్వం అర్థం చేసుకోవచ్చు.
అయితే, తాము బెదిరి లొంగబోమనీ, తమ ప్రజలకు అవసర మైంది చేస్తామనీ రామఫోసా తమ పార్లమెంటులో స్పష్టం చేశారు. ఆ దేశం ఆఫ్రికా ఖండంలో పారిశ్రామికంగా అన్నింటికన్నా పెద్దది. బ్రిక్స్ కూటమిలో ప్రముఖ దేశం. ఇప్పటికే ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా ఖండాల దేశాలతో తగవుకు దిగిన ట్రంప్, ఆఫ్రికాలోనూ అదే ధోరణి చూపటం వల్ల అంతిమంగా అమెరికాకు కలగగల నష్టాల గురించి ఆలోచిస్తున్నట్లు లేదు.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment