ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.
‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.
తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్‌లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు.
ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.
బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..
మొదటి దశ
ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.
రెండో దశ
సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.
మూడో దశ
గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.
అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.
ఖతార్ పాత్ర ప్రత్యేకం..
కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి.
2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్.
గాజా బాధ్యత ఎవరిది?
తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.
అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment