న్యూయార్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, హమాస్ అగ్రనేతలపై అరెస్టు వారెంట్లు ఇవ్వాలని కోరిన చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులతో మారణ హోమం సృష్టిస్తుందన్న కరీం ఖాన్ ఆరోపణలను బెడెన్ తీవ్రంగా ఖండించారు. వైట్‌హౌజ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో జో బైడెన్ మాట్లాడారు.
‘‘గాజాలో జరగుతున్నది.. మారణహోమం కాదు. అటువంటి ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్ బాధిత పక్షంగా మిగిలింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, కొందరు హమాస్ చెరలో ఇంకా బంధీలుగా ఉన్నారు.
.. మేము(అమెరికా) ఇజ్రాయల్ రక్షణ, భద్రత కోసం కట్టుబడి ఉంటాం. హమాస్ మిలిటేంట్లను అంతం చేసేవరకు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తాం. హమాస్ ఓడిపోవటమే మా లక్ష్యం. హమాస్‌ను ఒడించేందుకు ఇజ్రాయెల్ కోసం పనిచేస్తాం. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బంధీల విడుదల విషయంలో వెనక్కి తగ్గము’’ అని బెడెన్ అన్నారు. మరోవైపు.. గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని బైడెన్ పేర్కొనటం గమనార్హం.
గాజా, ఇజ్రాయెల్‌లో యుద్ధ నేరాలు, మానవాళిపై అకృత్యాలకు గాను నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, హమాస్ నేతలు యోహియా సిన్వర్, మహ్మద్ దీఫ్, ఇస్మాయిల్ హనియేహ్‌లు బాధ్యులని చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ అన్నారు. వారికి అరెస్టు వారెంట్లు ఇవ్వాలని ఐసీసీని కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment