న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్‌పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు.
అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment