చేసిన తప్పే చేయడం పాకిస్థాన్‌కు బాగా అలవాటైన విద్య. భారత్‌తో గిల్లికజ్జాలకు దిగడం కొరివితో తల గోక్కున్నట్టేనని 67 సంవత్సరాలుగా ఎన్నోసార్లు రుజువైనా మళ్లీ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వద్దా, అంతర్జాతీయ సరిహద్దు వద్దా ఇప్పుడు సాగుతున్న కాల్పులకూ, గతంలో సాగించిన కాల్పులకూ మధ్య తేడా ఉన్నది. పాకిస్థాన్ సైన్యం గురి పౌర ప్రాంతాలవైపుకాక సైనిక శిబిరాలపై ఉండేది. వాటిని ధ్వంసం చేయడంద్వారా మన సైన్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించేది. అయితే, గత కొన్ని రోజులుగా పాక్ చేస్తున్నది వేరు. సైనిక శిబిరాలతోపాటు నేరుగా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది. జమ్మూ, రాజౌరి, పూంచ్, కతువా జిల్లాలోని పలుగ్రామాల ప్రజలు ఈ కాల్పుల మోతతో కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మెషీన్ గన్‌లతో, మోర్టార్లతో సాగిస్తున్న ఈ కాల్పుల్లో ఇంతవరకూ ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది కొంపాగోడూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 40 సైనిక శిబిరాలతోపాటు ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఏటా శీతాకాలం సమీపించే ముందు ఇలా కాల్పులకు దిగడం పాకిస్థాన్‌కు అలవాటు. ఆ కాల్పుల మాటున ఉగ్రవాదులను మన భూభాగంలో ప్రవేశపెట్టడం, ఇక్కడ అలజడులు సృష్టించడం వారి ఉద్దేశం. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో తన వ్యూహాన్ని మార్చుకుంది. సంవత్సరం పొడవునా కవ్వింపు చర్యలను కొనసాగిస్తున్నది. తాజాగా జమ్మూ సెక్టార్‌లో ఈ నెల 1న కాల్పుల విరమణ ఉల్లంఘనలు మొదల య్యాయి. బక్రీద్ పండుగ సందర్భాన్ని కూడా చూడకుండా పాకిస్థాన్ సైన్యం 18సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. ఇలాంటి కాల్పులు సంభవించినప్పుడల్లా ఇరుదేశాల సైనిక ఆపరే షన్ల డెరైక్టరేట్ జనరళ్లు హాట్‌లైన్‌లో సంభాషించుకునేవారు. తాత్కాలికంగానైనా ప్రశాంతత ఏర్పడేది. ఈసారి మాత్రం పాక్ మొండికేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు మీవైపే మొదలయ్యాయని దబాయించింది. వాస్తవానికి పాక్ కవ్వింపు చర్యల తర్వాతనే భారత జవాన్లు అప్రమత్తమై ప్రతి దాడులు చేశారు. ఈ కాల్పుల్లో ఇంతవరకూ పాక్ వైపు 15మంది మరణించారు.
దాయాది దేశాలైనందువల్ల భారత్, పాక్‌ల మధ్య ఈ పోరు తప్పడంలేదు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందయితే ఈ కాల్పులవల్ల ఇరువైపులా ఏటా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు. సరిహద్దు గ్రామాలన్నీ దాదాపు నిర్మానుష్యమయ్యేవి. ఈ స్థితి మారాలన్న సంకల్పంతో రెండు దేశాలూ చర్చలు ప్రారంభించి ఒక అంగీకారానికి రాబట్టే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దానితోపాటే ఉల్లంఘనలూ నడుస్తున్నాయి. 2012లో 114సార్లు ఇలాంటి ఉల్లంఘనలు సంభవిస్తే నిరుడు అవి 347కు చేరుకున్నాయి. ఈ తొమ్మిదినెలల కాలంలో ఇంతవరకూ 334సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా తరచు ఈ ఉల్లంఘనలు సాగినా మునుపటితో పోలిస్తే ప్రాణనష్టం చాలావరకూ తగ్గింది. కనుక వైషమ్యాలు తలెత్తినప్పుడు శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించడమే ఎప్పుడైనా ఉత్తమం. అయితే, రెండు పక్షాల్లోనూ దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటిది సాధ్యంకాదు. 2003లో ఇరు దేశాల్లోని రాజకీయ నాయకత్వమూ ఈ విషయంలో గట్టిగా ప్రయత్నించాయి గనుక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తర్వాత కాలంలో పాక్ సైన్యం దీనికి గండికొట్టేందుకు ఎంత ప్రయత్నించినా పరిమిత స్థాయిలో మాత్రమే విజయం సాధించగలిగింది. భారత్‌తో సామరస్యపూర్వక సంబంధాలకు పౌరప్రభుత్వం చేసే ఏ ప్రయత్నాన్నయినా సైన్యం వమ్ము చేయడానికి చూడటం అక్కడ మామూలే. ఇటీవల సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అది తన మాటను నెగ్గించుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. అందువల్లే ఇదే అదనుగా పాక్ సైన్యం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు కనబడుతున్నది. ఎల్‌ఓసీ వద్ద పాక్ సైన్యం నెలకొల్పిన 20 శిబిరాల్లో 2,000మంది ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుకూలమైన స్థితి ఏర్పడటం కోసమే పాక్ సైన్యం తహతహలాడుతున్నదని తాజా కథనాలు చెబుతున్నాయి.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక పాకిస్థాన్‌తో సామరస్య వాతావరణం ఏర్పడటానికి కృషి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీకి రంగం సిద్ధమైంది. అయితే, మన ప్రభుత్వం సలహాను విస్మరించి పాక్ హైకమిషనర్ హురియత్ నాయకులతో సమావేశం కావడంతో ఈ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. తాజా ఘర్షణల నేపథ్యంలో మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ త్రివిధ దళాధిపతులతో సమావేశం కావడం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించడం చూస్తే పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు అర్ధమవుతుంది. సమస్యలు తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, వాటి పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించడం చాలా అవసరం. సరిహద్దుల్లో ప్రశాంతతను భగ్నం చేయడానికి పాక్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి వెల్లడించి ఆ దేశాన్ని ఏకాకిని చేయాలంటే చర్చల ప్రక్రియ తప్ప మార్గం లేదు. దీనివల్ల తమకు జరిగే నష్టం ఏమిటో తెలుసుగనుకే చర్చల ప్రక్రియకు తూట్లు పొడిచేలా పాక్ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలను ప్రేరేపిస్తున్నది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. మన వ్యూహం అలాంటి దుష్టపన్నాగాలను తిప్పికొట్టే దిశగా ఉండాలి.
మళ్లీ సరిహద్దుల్లో అలజడి
Published Wed, Oct 8 2014 11:42 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement