Control line
-
‘బ్యాట్’ దాడిని తిప్పికొట్టిన సైన్యం
శ్రీనగర్: సరిహద్దుల్లోని భారత్ సైనిక పోస్టుపై పాకిస్తాన్ ప్రత్యేక దళమైన బోర్డర్ యాక్షన్ టీం (బ్యాట్’) చేసిన దొంగచాటు దాడి యత్నాన్ని భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు హతమయ్యారు. మిగతా వారు తిరిగి పాక్‌భూభాగంలోకి పారిపోయారు. ఈ ఘటనకశ్మీర్‌లోని నౌగామ్ సెక్టార్‌లోని భారత్–పాక్ నియంత్రణ రేఖ వెంబడి శనివారం అర్ధరాత్రి జరిగింది. ‘సరిహద్దు దాటి లోపలికి వచ్చేందుకు ‘బ్యాట్’ సభ్యులు చేసిన యత్నాన్ని మన బలగాలు భగ్నం చేశాయి. పాక్ బలగాలు మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో కాల్పులు జరుపుతూ రక్షణగా నిలవగా అడవి నుంచి భారత్ భూభాగంలోకి చొరబడేందుకు ‘బ్యాట్’ దళం ప్రయత్నించింది. వెంటనే భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో పాక్ సైనికులుగా భావిస్తున్న ఇద్దరు చనిపోగా, మిగతా వారు పారిపోయారు’ అని సైనిక ఉన్నతాధికారి చెప్పారు. ‘ వారి వద్ద శక్తివంతమైన ఐఈడీ పేలుడు పదార్థాలు, ఆధునిక ఆయుధాలున్నాయి. దీనిని బట్టి భారత్ పోస్టుపై భారీ దాడికి ప్రణాళిక వేసుకున్నారని అర్థమవుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ ‘బ్యాట్’? పాక్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్(ఎస్ఎస్జీ) నిర్మించిన బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్)లో దాదాపు 8 మంది సభ్యులుంటారు. ఈ గ్రూపుల్లో సైనిక కమాండోలు, ఉగ్రవాదులు ఉంటారు. వీరు సరిహద్దుల్లోని భారత సైనికులే లక్ష్యంగా దాడులకు దిగుతుంటారు. పాక్ ఆర్మీ కమాండోలు కూడా బ్యాట్‌లో ఉన్నప్పటికీ భారత సైన్యానికి పట్టుబడినప్పుడు మాత్రం అక్కడి ప్రభుత్వం తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. -
సరిహద్దులో మాటువేసి మట్టుబెట్టారు
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ)వెంట పాక్ స్నైపర్ (దొంగచాటు) జరిపిన కాల్పుల్లో ఒక జవాను నేలకొరగగా పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు మృతి చెందారు. సుందర్బనీ సెక్టార్లో శనివారం ఉదయం 9.45 గంటల సమయంలో పాక్ స్నైపర్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాను ఆస్పత్రిలో చనిపోయాడు. మృతుడిని సాంబా జిల్లా మావా–రాజ్‌పురా ప్రాంతానికి చెందిన వరుణ్ కట్టల్(21)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా పాక్ బలగాలు పాల్పడిన ఈ చర్యకు భారత బలగాలు దీటుగా బదులిచ్చాయన్నారు. కాగా, ఎల్వోసీ వెంట పాక్ ఈనెల 9వ తేదీన జరిపిన స్నైపర్ కాల్పుల్లో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో ఘటనలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు పుల్వామా జిల్లా టిక్కెన్ ప్రాంతాన్ని శనివారం ఉదయం దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పుల్వామా జిల్లాకు చెందిన, హిజ్బుల్ ముజాహిదీన్ తరఫున పనిచేస్తున్న లియాఖత్ మునీర్ వనీ, వాజిద్ ఉల్ ఇస్లాం చనిపోయారు. -
పాక్ సైనిక కార్యాలయంపై భారత్ కాల్పులు
జమ్మూ: నియంత్రణ రేఖ దగ్గర్లో ఉన్న పాకిస్తాన్ సైనిక పాలక ప్రధాన కార్యాలయంపై భారత్ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 23న జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, ఝల్లాస్‌ల్లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా కాల్పులకు దిగిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఖ్యురత్త, సమానీ ప్రాంతాలపై కూడా భారత జవాన్లు దాడులు జరిపారనీ, పీవోకేలో పొగలు వస్తున్నట్లు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. పాకిస్తానీ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి పొగ వస్తున్నట్లు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా భారత్ ఇన్నాళ్లూ నిగ్రహాన్ని పాటించిందనీ, తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామనేందుకు తాజా కాల్పులు పాక్‌కు గట్టి సంకేతమని తెలిపారు. పీవోకేలోని పౌర ప్రాంతాలపై ఆర్మీ కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. -
ఇక కాల్పులు ఆపేద్దాం
న్యూఢిల్లీ / ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ల మధ్య 2003లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయాలని ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంవో) అంగీకరించారు. ఇరుదేశాల మధ్య నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఇరుదేశాల డీజీఎంవోలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో పాటించేందుకు అంగీకరించినట్లు భారత ఆర్మీ తెలిపింది. సరిహద్దులో ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి తలెత్తితే హాట్‌లైన్‌తో పాటు ఫ్లాగ్ మీటింగ్‌ల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చాయి. -
జమ్మూ కశ్మీర్లో పాక్ దుశ్చర్య
జమ్మూ: పొరుగు దేశం పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యకు తెగబడింది. భారత్‌ను రెచ్చగొట్టేలా ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ లోని బాలాకోటే సెక్టార్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆదివారం మోర్టారు బాంబులతో విరుచుకు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు మైనర్ సోదరులు. మరో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కూడా గాయపడగా వారిని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలను మాత్రం హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు భారత భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఫ్తీ తన సంతాప సందేశాన్ని ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 11.30 గంటల వరకు పాకిస్తాన్ విచక్షణారహితంగా దాడులకు తెగబడినట్లు ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. పాక్ కవ్వింపు చర్యల ఫలితంగా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోయారనీ, ఆ దేశం ఎప్పుడూ అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. పౌరుల ప్రాణాలకు ఎటువంటి ముప్పూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జమ్మూ ఐజీ ఎస్డీఎస్ జమ్వాల్ చెప్పారు. -
అవసరమైతే ‘హద్దు’ దాటుతాం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: దేశ సమైక్యతను కాపాడుకునేందుకు.. అవసరమైతే భద్రతా దళాలు నియంత్రణ రేఖను దాటి ముందుకు వెళ్తాయని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటుందని స్పష్టం చేశారు. పాక్ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా కశ్మీర్‌ను భారత్ నుంచి వేరు చేయలేదన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘భారత్‌ను అంతర్గతంగా భద్రంగా ఉంచుకుంటాం. అంతేకాదు అవసరమైతే.. దేశాన్ని రక్షించుకునేందుకు సరిహద్దులు దాటి ముందుకు వెళ్తాం’ అని వ్యాఖ్యానించారు. -
చొరబడేందుకు సిద్ధంగా ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖకు దగ్గర్లో అనేకమంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు సోమవారం చెప్పారు. పాకిస్తాన్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది కూడా ఆ ఉగ్రవాదులకు సహకరించడానికేనని ఆయన పేర్కొన్నారు. ‘నియంత్రణ రేఖకు ఆవల భారీ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారమొచ్చింది’ అని శ్రీనగర్‌లోని లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ చెప్పారు. ఉగ్రవాదులు గుంపులు గుంపులుగా ఒక్కో చోట 30 నుంచి 40 మంది ఉన్నారని వెల్లడించారు. -
కశ్మీర్లో పాక్ దురాగతం
జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని బలిగొంది. కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి కాగా, మిగిలిన ముగ్గురు జవాన్లు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ సైనికులు ఆదివారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆటోమేటిక్ తుపాకులు, మోర్టార్లతో పౌర ప్రాంతాలపైనా దాడి చేశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తొలుత ఉదయం 11.10 గంటల ప్రాంతంలో పూంచ్‌లోని షాపూర్ సెక్టార్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లు, ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డారు. భారత సిబ్బంది తమ తుపాకులతో పాక్‌కు దీటైన సమాధానమిచ్చారని ఓ అధికారి చెప్పారు. రాజౌరీ జిల్లాలోని మధ్యాహ్నం 3.40 గంటలకు భీంభేర్ గలీ సెక్టార్‌లోనూ పాక్ సైనికులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా ఆయనా మృత్యువాత పడ్డారు. రాజౌరీలోనూ పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానమిచ్చారు. ఆరు రోజుల్లో పుట్టినరోజు ఉందనగా... చనిపోయిన వారిలో వయసురీత్యా అందరికన్నా చిన్నవాడే ఆ అధికారి. హరియాణకు చెందిన కపిల్ కుందు (22) ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. మరో ఆరు రోజుల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే పాక్ కాల్పులకు కుందు బలయ్యారు. చనిపోయిన జవాన్లలో కశ్మీర్‌కు చెందిన రోషన్ లాల్ (42), శుభం సింగ్ (23)తోపాటు మధ్య ప్రదేశ్‌కు చెందిన రామావతార్ (27) ఉన్నారు. మరోవైపు నియంత్రణ రేఖకు ఐదు కి.మీ. దూరంలో ఉన్న అన్ని పాఠశాలలనూ మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు రాజౌరీ ఉప కమిషనర్ చెప్పారు. -
పాక్ కాల్పుల్లో 11కు చేరిన మృతులు
జమ్మూ: పాకిస్తాన్ వరుసగా నాలుగోరోజూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ)తో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ, కథువా, సాంబా, పూంచ్, రాజౌరీ ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీకే రాయ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో గత నాలుగు రోజుల్లో పాక్ కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 11కు చేరుకుందన్నారు. చనిపోయినవారిలో ముగ్గురు ఆర్మీ, ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ఆరుగు రు పౌరులున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని 40,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. గణతంత్ర వేడుకల వేళ అలజడి సృష్టించేందుకు నలుగురు ఉగ్రవాదులు కశ్మీర్లోకి ప్రవేశించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
సరిహద్దు వద్ద రాకపోకలు బంద్
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా పూంచ్‌లో నియంత్రణ రేఖ వద్ద రాకపోకలను అధికారులు సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు. పూంచ్–రావల్కోట్ బస్సు సర్వీసును నిలిపేశారు. పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో నియంత్రణ రేఖ వద్ద ఉండే రెండంతస్తుల వ్యాపార నిర్వహణ కేంద్రం కూడా ధ్వంసమైంది. భారత్ నుంచి ఎటువంటి రెచ్చగొట్టే చర్యలూ లేకుండానే పాక్ కాల్పులు జరుపుతోందనీ, భారత దళాలు పాక్ కాల్పులకు గట్టిగా బదులిస్తున్నాయనీ, మన సైనికులంతా క్షేమంగానే ఉన్నారని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని నమ్మాలనీ, పాక్‌కు తగిన బుద్ధి చెబుతామని ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పాక్ దళాలు ఆదివారం కృష్ణగతి సెక్టార్‌లోనూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. సోమవారం ఉదయం పూంచ్‌లో 6.40 గంటలకే మళ్లీ కాల్పులు మొదలు పెట్టారు. 24 గంటలైనా గడవక ముందే రెండోసారి పాక్ కాల్పులు జరిపింది. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయనీ, పాక్ దళాలు ఆగి ఆగి కాల్పులు జరుపుతున్నాయని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. -
పాకిస్తాన్‌కు తగిన శాస్తి
ఎల్ఓసీ సర్జికల్ దాడులపై అమర జవాన్ల భార్యలు మథుర: నియంత్రణ రేఖ ఆవల ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడుల పట్ల అమరవీరుల భార్యలు సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు ఈ చర్య తగిన జవాబని అమర జవాను హేమరాజ్ భార్య ధర్మవతి అన్నారు. దాడులు సైనికులు, సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించాయని చెప్పారు. ఇవి ఇంతకు ముందే చేపడితే ఉడీలో 19 మంది సైనికుల ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు. పాక్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ఎలాంటి జాలి చూపకూడదని ప్రభుత్వాన్ని కోరారు. లాన్స్ నాయక్ హేమరాజ్‌ను పాకిస్తాన్ సైన్యం 2013, జనవరి 8న హత్య చేసింది. సర్జికల్ దాడులను ముందే జరిపితే మరింత సంతోషించేదాన్నని మరో అమర వీరుడు సమోద్ కుమార్ భార్య సీమా చౌదరి అన్నారు. ఈమె భర్త గతేడాది అక్టోబర్‌లో జమ్మూలో కన్నుమూశారు. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన జవాన్ సోరన్‌సింగ్ భార్య కమలేశ్ దేవి మాట్లాడుతూ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జూలైలో అమరుడైన బబ్లూ భార్య రవితా ...ఇలాంటి చర్యలను ఇంతక్రితమే చేపడితే సైన్యం, దేశ పౌరుల ఆత్మస్థైర్యం పెరిగేదని అన్నారు. -
మళ్లీ సరిహద్దుల్లో అలజడి
చేసిన తప్పే చేయడం పాకిస్థాన్‌కు బాగా అలవాటైన విద్య. భారత్‌తో గిల్లికజ్జాలకు దిగడం కొరివితో తల గోక్కున్నట్టేనని 67 సంవత్సరాలుగా ఎన్నోసార్లు రుజువైనా మళ్లీ గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్దా, అంతర్జాతీయ సరిహద్దు వద్దా ఇప్పుడు సాగుతున్న కాల్పులకూ, గతంలో సాగించిన కాల్పులకూ మధ్య తేడా ఉన్నది. పాకిస్థాన్ సైన్యం గురి పౌర ప్రాంతాలవైపుకాక సైనిక శిబిరాలపై ఉండేది. వాటిని ధ్వంసం చేయడంద్వారా మన సైన్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించేది. అయితే, గత కొన్ని రోజులుగా పాక్ చేస్తున్నది వేరు. సైనిక శిబిరాలతోపాటు నేరుగా పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నది. జమ్మూ, రాజౌరి, పూంచ్, కతువా జిల్లాలోని పలుగ్రామాల ప్రజలు ఈ కాల్పుల మోతతో కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మెషీన్ గన్లతో, మోర్టార్లతో సాగిస్తున్న ఈ కాల్పుల్లో ఇంతవరకూ ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా వేలాదిమంది కొంపాగోడూ వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. 40 సైనిక శిబిరాలతోపాటు ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఏటా శీతాకాలం సమీపించే ముందు ఇలా కాల్పులకు దిగడం పాకిస్థాన్‌కు అలవాటు. ఆ కాల్పుల మాటున ఉగ్రవాదులను మన భూభాగంలో ప్రవేశపెట్టడం, ఇక్కడ అలజడులు సృష్టించడం వారి ఉద్దేశం. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో తన వ్యూహాన్ని మార్చుకుంది. సంవత్సరం పొడవునా కవ్వింపు చర్యలను కొనసాగిస్తున్నది. తాజాగా జమ్మూ సెక్టార్లో ఈ నెల 1న కాల్పుల విరమణ ఉల్లంఘనలు మొదల య్యాయి. బక్రీద్ పండుగ సందర్భాన్ని కూడా చూడకుండా పాకిస్థాన్ సైన్యం 18సార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. ఇలాంటి కాల్పులు సంభవించినప్పుడల్లా ఇరుదేశాల సైనిక ఆపరే షన్ల డెరైక్టరేట్ జనరళ్లు హాట్లైన్లో సంభాషించుకునేవారు. తాత్కాలికంగానైనా ప్రశాంతత ఏర్పడేది. ఈసారి మాత్రం పాక్ మొండికేసింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలు మీవైపే మొదలయ్యాయని దబాయించింది. వాస్తవానికి పాక్ కవ్వింపు చర్యల తర్వాతనే భారత జవాన్లు అప్రమత్తమై ప్రతి దాడులు చేశారు. ఈ కాల్పుల్లో ఇంతవరకూ పాక్ వైపు 15మంది మరణించారు. దాయాది దేశాలైనందువల్ల భారత్, పాక్‌ల మధ్య ఈ పోరు తప్పడంలేదు. 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందయితే ఈ కాల్పులవల్ల ఇరువైపులా ఏటా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు. సరిహద్దు గ్రామాలన్నీ దాదాపు నిర్మానుష్యమయ్యేవి. ఈ స్థితి మారాలన్న సంకల్పంతో రెండు దేశాలూ చర్చలు ప్రారంభించి ఒక అంగీకారానికి రాబట్టే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, దానితోపాటే ఉల్లంఘనలూ నడుస్తున్నాయి. 2012లో 114సార్లు ఇలాంటి ఉల్లంఘనలు సంభవిస్తే నిరుడు అవి 347కు చేరుకున్నాయి. ఈ తొమ్మిదినెలల కాలంలో ఇంతవరకూ 334సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా తరచు ఈ ఉల్లంఘనలు సాగినా మునుపటితో పోలిస్తే ప్రాణనష్టం చాలావరకూ తగ్గింది. కనుక వైషమ్యాలు తలెత్తినప్పుడు శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించడమే ఎప్పుడైనా ఉత్తమం. అయితే, రెండు పక్షాల్లోనూ దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే తప్ప ఇలాంటిది సాధ్యంకాదు. 2003లో ఇరు దేశాల్లోని రాజకీయ నాయకత్వమూ ఈ విషయంలో గట్టిగా ప్రయత్నించాయి గనుక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తర్వాత కాలంలో పాక్ సైన్యం దీనికి గండికొట్టేందుకు ఎంత ప్రయత్నించినా పరిమిత స్థాయిలో మాత్రమే విజయం సాధించగలిగింది. భారత్‌తో సామరస్యపూర్వక సంబంధాలకు పౌరప్రభుత్వం చేసే ఏ ప్రయత్నాన్నయినా సైన్యం వమ్ము చేయడానికి చూడటం అక్కడ మామూలే. ఇటీవల సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అది తన మాటను నెగ్గించుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. అందువల్లే ఇదే అదనుగా పాక్ సైన్యం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు కనబడుతున్నది. ఎల్ఓసీ వద్ద పాక్ సైన్యం నెలకొల్పిన 20 శిబిరాల్లో 2,000మంది ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారికి అనుకూలమైన స్థితి ఏర్పడటం కోసమే పాక్ సైన్యం తహతహలాడుతున్నదని తాజా కథనాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక పాకిస్థాన్‌తో సామరస్య వాతావరణం ఏర్పడటానికి కృషి చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీకి రంగం సిద్ధమైంది. అయితే, మన ప్రభుత్వం సలహాను విస్మరించి పాక్ హైకమిషనర్ హురియత్ నాయకులతో సమావేశం కావడంతో ఈ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. తాజా ఘర్షణల నేపథ్యంలో మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ త్రివిధ దళాధిపతులతో సమావేశం కావడం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించడం చూస్తే పరిస్థితి తీవ్రంగానే ఉన్నట్టు అర్ధమవుతుంది. సమస్యలు తలెత్తినప్పుడు సంయమనం పాటించడం, వాటి పరిష్కారానికి అన్ని మార్గాలూ అన్వేషించడం చాలా అవసరం. సరిహద్దుల్లో ప్రశాంతతను భగ్నం చేయడానికి పాక్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి వెల్లడించి ఆ దేశాన్ని ఏకాకిని చేయాలంటే చర్చల ప్రక్రియ తప్ప మార్గం లేదు. దీనివల్ల తమకు జరిగే నష్టం ఏమిటో తెలుసుగనుకే చర్చల ప్రక్రియకు తూట్లు పొడిచేలా పాక్ సైన్యం సరిహద్దుల్లో ఘర్షణలను ప్రేరేపిస్తున్నది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. మన వ్యూహం అలాంటి దుష్టపన్నాగాలను తిప్పికొట్టే దిశగా ఉండాలి. -
పాక్ తీర్మానం నిరాధారం: భారత్
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద భారత ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడిందంటూ పాక్ పార్లమెంటు మంగళవారం చేసిన ఖండన తీర్మానాన్ని భారత పార్లమెంటు తోసిపుచ్చింది. పాక్ తీర్మానంలో నిరాధారమైన, పసలేని ఆరోపణలు ఉన్నాయని గర్హించింది. ఎల్ఓసీలో దాడికి దిగింది పాక్ ఆర్మీనే అని తేల్చి చెప్పింది. ఈమేరకు బుధవారం ఉభయ సభలు పాక్ ఆర్మీ దాడులను ఖండిస్తూ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి. తమ దేశం ఎల్ఓసీని గౌరవిస్తుందని, 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ప్రభుత్వం అమలు చేయాలని ఏకరూప తీర్మానాల్లో కోరాయి. రాజ్యసభలో చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్‌లు వీటిని చదివారు. భారత్‌పై పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాలను తోసిపుచ్చుతున్నట్లు ఈ తీర్మానాలు పేర్కొన్నాయి. ‘జమ్మూకాశ్మీర్తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగం. అవి ఇకముందూ ఇలాగే ఉంటాయి’ అని ప్రకటించాయి. తీర్మానాలను సభ్యులు బల్లలు చరిచి ఆమోదించారు. ఈ నెల 6న పూంంచ్ సెక్టార్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన భారత జవాన్లకు లోక్‌సభ నివాళి అర్పించింది.