గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం
జమ్మూ: పొరుగు దేశం పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యకు తెగబడింది. భారత్‌ను రెచ్చగొట్టేలా ఆ దేశం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇరుదేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ లోని బాలాకోటే సెక్టార్ సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఆదివారం మోర్టారు బాంబులతో విరుచుకు పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించగా ఇద్దరు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.
మరణించిన వారిలో ముగ్గురు మైనర్ సోదరులు. మరో ఐదుగురు ఆర్మీ సిబ్బంది కూడా గాయపడగా వారిని సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలికలను మాత్రం హెలికాప్టర్ ద్వారా జమ్మూలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు భారత భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఫ్తీ తన సంతాప సందేశాన్ని ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.
ఆదివారం ఉదయం 7.45 నుంచి 11.30 గంటల వరకు పాకిస్తాన్ విచక్షణారహితంగా దాడులకు తెగబడినట్లు ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. పాక్ కవ్వింపు చర్యల ఫలితంగా ఐదుగురు సాధారణ పౌరులు చనిపోయారనీ, ఆ దేశం ఎప్పుడూ అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని ఆయన చెప్పారు. పౌరుల ప్రాణాలకు ఎటువంటి ముప్పూ లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు జమ్మూ ఐజీ ఎస్‌డీఎస్ జమ్వాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment