జమ్మూ కాశ్మీర్: పాకిస్తాన్ దళాలు శనివారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్, కథువా జిల్లాల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గ్రామాలు, పలు సెక్టార్ పరిధిలో పాకిస్తాన్ దళాలు కాల్పులకు దిగాయని భద్రతా అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ఆగడాలతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారని వెల్లడించారు. ఆయా గ్రామాల ప్రజలు రాత్రంతా భూగర్భ రక్షణ వసతుల్లో బిక్కు బిక్కుమంటూ గడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు.
పూంచ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి, మాన్‌కోట్ సెక్టార్ పరిధిలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు దాడులు చేశారని, హిరానగర్ సెక్టార్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రంతా కాల్పులు కొనసాగాయని అధికారులు తెలిపారు. ఆటోమాటిక్స్, మోర్టార్స్‌తో దాయాది బలగాలు దాడులకు తెగబడ్డారని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కూడా పాక్ దళాలు కరోల్ కృష్ణ, సత్పాల్, గుర్నామ్‌లో సరిహద్దు వెంట కాల్పులకు దిగారు. భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) పాక్ చర్యలను దీటుగా తిప్పికొట్టిందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment